Landslides: కొండ చరియల ప్రమాదాన్నీ పసిగట్టవచ్చు
ABN, Publish Date - Jul 31 , 2024 | 05:58 AM
దేశంలో భారీ వర్షాలను ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలు ఉన్నట్లే కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని కూడా ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలను రూపొందించాలని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి
నేల రకం, నేలలో తేమ, కొండవాలు సమాచారాన్ని క్రోడీకరిస్తే సాధ్యమే
ప్రభుత్వాలకు శాస్త్రవేత్తల సూచన
న్యూఢిల్లీ, జూలై 30: దేశంలో భారీ వర్షాలను ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలు ఉన్నట్లే కొండచరియలు విరిగిపడే ప్రమాదాన్ని కూడా ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యవస్థలను రూపొందించాలని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ మాట్లాడుతూ, ‘‘ప్రతీ భారీ వర్షం కొండచరియలు విరిగిపడే పరిస్థితికి దారి తీయదు. కొండ చరియలు విరిగిపడే విపత్తును గుర్తించేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరం. కష్టమే కానీ సాధ్యమే’’ అన్నారు. కొండ చరియలు విరిగిపడే ఘటనల్లో నేలరకం, నేలలో తేమ, వాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. వీటికి సంబంధించి మనకు తెలిసిన సమాచారం మొత్తాన్ని ఒక వ్యవస్థలో కూర్చడం ద్వారా ఎలాంటి పరిస్థితుల్లో కొండ చరియలు విరిగిపడతాయో ముందుగానే గుర్తించి ప్రాణనష్టం నివారించవచ్చని చెప్పారు.
కేరళ విపత్తు నిర్వహణ నిపుణుడు శ్రీకుమార్ మాట్లాడుతూ, ‘‘120 మిల్లీమీటర్లకు మించి వర్షపాతం 2-3 రోజులపాటు విడవకుండా కురిస్తే కేరళలోని కొండ వాలుల్లో చరియలు విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’’ అన్నారు. వయనాడులో కొండచరియలు విరిగి పడే అవకాశమున్న ప్రాంతాలు ఎక్కువని చెప్పారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరించడం మినహా మనం చేయగలిగింది ఏమీ లేదన్నారు. అలాంటి ప్రాంతాల్లో వర్షాకాలంలో తాత్కాలికంగా ఉండటానికి సురక్షిత షెల్టర్లు నిర్మించాలని సూచించారు. కేరళలోని కొండల్లో సగానికి పైగా ఇరవై డిగ్రీలకు మించిన వాలు కలిగి ఉన్నాయని, భారీ వర్షాలు వచ్చినపుడు ఇవన్నీ ప్రమాద భరితమేనని పర్యావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్ చెప్పారు.
Updated Date - Jul 31 , 2024 | 07:56 AM