Maoist Encounter:: భారీ ఎన్‌కౌంటర్.. మృతుల్లో అగ్రనేతలు
ABN, Publish Date - Nov 22 , 2024 | 11:51 AM
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ తూటా పేలింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో భద్రతా దళాలు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అడవుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఇవాళ(శుక్రవారం) తుపాకుల మోత కలకలం రేపింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో కీలక నేతలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు. సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులు మధ్య ఎదురు ఎదురు కాల్పులు జరిగడంతో హై అలర్ట్ ప్రకటించారు.
సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో భద్రతా దళాలు, మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఒకరిపై ఒకరు తూటాల వర్షం కురిపించుకుంటూ ఇరువర్గాలు భీకరంగా పోరాడుతున్నాయి.
ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొన్ని మృతదేహాలను ఘటనా స్థలంలో గుర్తించినట్లు భద్రతా దళాలు తెలిపాయి. అలాగే మృతుల నుంచి భారీఎత్తున ఆటోమేటెడ్ ఆయుధాలు, ఏకే 47 సహా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భద్రతా దళాలు తెలిపాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..
ఛత్తీస్‌గఢ్ అడవులు ఇక తమకు ఎంతమాత్రం సురక్షితం కాదని మావోయిస్టులు భావిస్తున్నారా? ఇరవై ఏళ్లుగా దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మావోయిస్టులు అక్కడే ఉంటే క్యాడర్‌ను మరింతగా నష్టపోతామనే అంచనానికొచ్చేశారా? ప్రస్తుతం వారు తెలంగాణ వైపు చూస్తున్నారా? కొన్నాళ్లుగా దండకారణ్యంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టడం.. పలు విభాగాలకు చెందిన కేంద్ర బలగాలతో విరామం లేకుండా కూంబింగ్ నిర్వహిస్తుండటం.. తరచూ భారీ ఎన్‌కౌంటర్లు జరుగుతుండటం.. పెద్ద ఎత్తున ఉద్యమకారులను కోల్పోతుండటంతో మావోయిస్టులు పునరాలోచనలో పడ్టట్టు సమాచారం.
ఇటీవలే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నక్సలిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్, బీహార్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మావోయిస్టు తీవ్రవాదం అంతమైందని.. ఛత్తీస్‌గఢ్‌లోని మూడు, నాలుగు జిల్లాల్లో ఈ సమస్య కొనసాగుతోందని అన్నారు. దాన్ని అణచివేసేందుకు కృషి చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు.
నక్సలైట్లపై ఉక్కుపాదం..
అప్పటి సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ నక్సల్స్ గ్రూపు తన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో దేశంలో బలమైన నక్సల్స్ ఉద్యమాన్ని నడుపుతున్న మరో రెండు విప్లవ సంఘాలైన మావోయిస్టు, కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీ), సీపీఐ (ఎంఎల్) నక్సల్బరీ గ్రూపులతో విలీనమై సెప్టెంబరు 21, 2004లో సీపీఐ (మావోయిస్టు)గా ఏర్పడింది. ఉమ్మడి ఏపీలో బలమైన శక్తిగా ఉన్న పీపుల్స్‌వార్ మావోయిస్టు పార్టీగా మారటంతో అప్పటి వైఎస్ ప్రభుత్వం నక్సలైట్లపై ఉక్కుపాదం మోపింది. ఫలితంగా అప్పట్లోనే మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌కు మకాం మార్చారు. ఈ క్రమంలో సెప్టెంబరు 21వ తేదీ నుంచి అక్టోబరు 30వ తేదీ వరకు 20 ఏళ్ల వార్షికోత్సవాలను మావోయిస్టులు జరుపుకొంటున్న నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీకి అత్యంత భారీ ఎదురుదెబ్బ తగిలింది.
భారీ షాక్..
నారాయణ్‌పూర్- దంతేవాడ అడవుల్లో గతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఇది మావోయిస్టు పార్టీకి భారీ షాక్‌గా భావిస్తున్నారు. ఇటీవల పలు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు పార్టీ పెద్ద సంఖ్యలో కేడర్‌ను కోల్పోయింది. కారణం.. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చాక ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా నక్సల్స్ ఏరివేతే లక్ష్యంగా పలు ఆపరేషన్లు మొదలు పెట్టారు. వీటిలో ప్రధానంగా ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ కగార్‌లతో కేంద్ర బలగాలు దండకారణ్యంలో మావోయిస్టులపై విరుచుకుపడుతున్నాయి. 2024 జనవరి నుంచి జూలై వరకే పోలీసు దాడుల్లో 171 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ 20ఏళ్లలో పోలీసు దాడుల్లో 5,285 మంది మావోయిస్టులు చనిపోయినట్లు అంచనా. మూడున్నరేళ్లలో 475 మందిని కోల్పోయినట్లుగా మావోయిస్టులు పేర్కొంటున్నారు.
Updated Date - Nov 22 , 2024 | 12:08 PM