Jairam Ramesh: మమత లేకుండా కూటమిని ఊహించలేం.. కాంగ్రెస్ బుజ్జగింపు
ABN, Publish Date - Jan 24 , 2024 | 03:06 PM
పశ్చిమబెంగాల్‌లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇండియా కూటమికి టీఎంసీ కీలక స్తంభమని, మమతా బెనర్జీ లేకుండా కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు.
బార్‌పేట: పశ్చిమబెంగాల్‌లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధ్యక్షురాలు మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇండియా (I.N.D.I.A.) కూటమికి టీఎంసీ కీలక స్తంభమని, మమతా బెనర్జీ లేకుండా కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ అన్నారు.
''మమతా బెనర్జీ ఇచ్చిన మొత్తం ప్రకటనను మీరు వినిలేదనుకుంటా. బీజేపీని ఓడించాలని తాము కోరుకుంటున్నామని, బీజేపీని ఓడించేందుకు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయమనేది ఆమె మాటల సారాంశం. అదే ఫీలింగ్‌తో మేము పశ్చిమబెంగాల్‌లో అడుగుపెడుతున్నాం. దూరప్రయాణం అయినప్పుడు మార్గంలో స్పీడ్‌బ్రేకర్లు, రెడ్ లైట్ వంటివి వస్తాయి. దాని అర్ధం ప్రయాణం ఆపినట్టు కాదు. ప్రయాణం కొనసాగుతుంది. స్పీడ్ బ్రేకర్లను అధిగమిస్తాం, రెడ్ లైట్లు గ్రీన్‌లైట్లుగా మారుతాయి'' అని జైరామ్ రమేష్ బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఎన్డీయే కూటమిలో మమతా బెనర్జీ కీలక స్తంభమని రాహుల్ గాంధీ సైతం మంగళవారంనాడు స్పష్టం చేశారని, మమతా బెనర్జీ చెప్పినట్టు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ పనిచేస్తుందని చెప్పారు. సమస్యలు పరిష్కరించుకుంటామని, ఇండియా కూటమి పశ్చిమబెంగాల్‌లో కూడా పోటీ చేస్తుందని జైరామ్ రమేష్ ధీమా వ్యక్తం చేశారు.
మమత ఏమన్నారు?
మమతా బెనర్జీ బుధవారంనాడు చేసిన వ్యాఖ్యలతో ఇండియా కూటమికి గట్టి దెబ్బ తగిలింది. బెంగాల్‌లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని తాను ఎప్పుడూ చెబుతూనే ఉన్నానని, ఒంటరిగానే బీజేపీని ఓడించగలమని చెప్పారు. తాను అనేక ప్రతిపాదనలు చేసినప్పటికీ వారు (కాంగ్రెస్) మొదట్నించీ తిరస్కరిస్తున్నారని, దీంతో బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేయాలని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు. పశ్చిమబెంగాల్ మీదుగా రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర వెళ్తుందన్న సమాచారం తనకు లేదని అన్నారు.
Updated Date - Jan 24 , 2024 | 03:55 PM