Aanvi Kamdar: యువతి ప్రాణాలు తీసిన రీల్.. జలపాతం వద్ద వీడియో తీస్తుండగా..
ABN, Publish Date - Jul 18 , 2024 | 05:07 PM
ఆమె ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ లక్షల్లో ఫాలోవర్లను, పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. రీల్స్ పుణ్యమా అని.. అనతి కాలంలోనే ఎంతో పాపులారిటీ..
ఆమె ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ (Social Media Influencer). ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ (Instagram Reels) చేస్తూ లక్షల్లో ఫాలోవర్లను, పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. రీల్స్ పుణ్యమా అని.. అనతి కాలంలోనే ఎంతో పాపులారిటీ గడించింది. కానీ.. అదే తన ప్రాణాలు తీస్తుందని ఆమె ఏనాడూ ఊహించలేకపోయింది. లొకేషన్ బాగుంది కదా ఓ జలపాతం వద్ద వీడియో తీస్తుండగా.. ప్రమాదవశాత్తూ లోయలో పడి ఆమె మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Read Also: ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి 12 బోగీలు బోల్తా
ఆమె పేరు ఆన్వీ కామ్‌దార్. వయసు 26 సంవత్సరాలు. ముంబయికు చెందిన ఆమె ఓ ఇన్‌స్టాగ్రామ్ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్. అంటే.. అందమైన ప్రదేశాలకు వెళ్లి, అక్కడ వీడియోలు షూట్ చేసి, వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె జులై 16వ తేదీన తన ఏడుగురు స్నేహితులతో కలిసి.. రాయ్‌గఢ్‌లోని కుంభే జలపాతం వద్దకు వెళ్లింది. అక్కడి ప్రకృతి అందాల మధ్య ఒక రీల్ చేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆన్వీ లోయ అంచున వెళ్లగా.. ఆమె స్నేహితులు వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. అయితే.. దురదృష్టవశాత్తూ ఆమె కాలు జారి లోకలోకి పడిపోయింది. తాను నిల్చున్న ప్రాంతమంతా చిత్తడిగా ఉండటం వల్లే.. కాలు జారి 300 అడుగుల లోయలో పడింది. ఉదయం 10.30 గంటలకు ఈ ఘటన జరిగింది.
Read Also: కారులో ఇదేం పాడుపని.. ఓవైపు డ్రైవ్ చేస్తూనే..
ఆన్వీ స్నేహితులు స్థానిక అధికారులను సంప్రదించగా.. రెస్క్యూ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. వారితో పాటు కోస్ట్ గార్డ్, కోలాడ్ రెస్క్యూ టీమ్, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సిబ్బంది కూడా ఆమెని వెతకడానికి రంగంలోకి దిగాయి. ఆరు గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత.. ఆన్వీని కొండగట్టు నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే.. 300 అడుగుల ఎత్తు నుంచి పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలవ్వడం, రక్తస్రావం జరగడంతో.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆన్వీ మృతితో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె స్నేహితులు సైతం కన్నీరుమున్నీరు అయ్యారు.
ఎవరీ ఆన్వీ కామ్‌దార్?
కాగా.. వృత్తిరీత్యా ఆన్వీ కామ్‌దార్ ఒక చార్టెర్డ్ అకౌంటెంట్. ప్రముఖ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ డెలాయిట్‌లోనూ పని చేసింది. అయితే.. ఆమెకు విహారయాత్రలకు వెళ్లడం అంటే ఎంతో ఇష్టం. అందుకే.. దేశ విదేశాలను చుట్టేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఆమె అనేక ప్రాంతాలను సందర్శించి.. అక్కడి విశేషాలను వీడియోల రూపంలో పంచుకోవడం స్టార్ట్ చేసింది. దీంతో.. ఆమెకు ఫాలోవర్లు క్రమంగా పెరుగుతూ వచ్చారు. ఇన్‌స్టాలో ఆన్వీకి 2.56 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ముఖ్యంగా మాన్‌సూన్ టూరిజంపై తీసిన వీడియోలే ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
Read Latest National News and Telugu News
Updated Date - Jul 18 , 2024 | 05:07 PM