Share News

Army Officers: ఇద్దరు ఆర్మీ అధికారులపై దారుణంగా దాడి.. స్నేహితురాలిపై సామూహిక అఘాయిత్యం

ABN , Publish Date - Sep 12 , 2024 | 09:06 AM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఊహించని దారుణం జరిగింది. జామ్ గేట్ సమీపంలో మంగళవారం సాయంత్రం ఇద్దరు ఆర్మీ యువ అధికారులు, వారి స్నేహితురాళ్లపై సాయుధ దుండగులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. దోపిడీ చేసేందుకు వచ్చిన దుండగులు ఆర్మీ ఆఫీసర్లపై కిరాతకంగా దాడి చేశారు. మహిళా స్నేహితుల్లో ఒకరిపై సామూహిక అత్యాచారానికి కూడా పాల్పడ్డారు.

Army Officers: ఇద్దరు ఆర్మీ అధికారులపై దారుణంగా దాడి.. స్నేహితురాలిపై సామూహిక అఘాయిత్యం

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఊహించని దారుణం జరిగింది. జామ్ గేట్ సమీపంలో మంగళవారం సాయంత్రం ఇద్దరు ఆర్మీ యువ ట్రైనీ అధికారులు, వారి స్నేహితురాళ్లపై సాయుధ దుండగులు అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడ్డారు. దోపిడీ చేసేందుకు వచ్చిన దుండగులు ఆర్మీ ఆఫీసర్లను దారుణంగా కొట్టారు. మహిళా స్నేహితుల్లో ఒకరిపై సామూహిక అత్యాచారానికి కూడా పాల్పడ్డారు. ఈ ఘటనకు పాల్పడ్డవారిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డవారిలో ఒకరికి నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. ఈ నేరానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

బాధిత ఆర్మీ అధికారులు మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ పొందుతున్నారు. అధికారులు ఇద్దరూ మధ్యాహ్న సమయంలో మహిళా స్నేహితులతో కలిసి బయటకు వెళ్లారు. సమీపంలో ఉన్న ఛోటీ జామ్‌లోని ఫైరింగ్ రేంజ్‌కు వెళ్లారు. అయితే వారిని అకస్మాత్తుగా 8 మంది వ్యక్తులు పిస్టల్స్, కత్తులు, కర్రలతో చుట్టుముట్టారు. డబ్బు, నగలు, వస్తువులు దోచుకోవడానికి వచ్చిన దుండగులు ఇద్దరు ట్రైనీ అధికారులను దారుణంగా కొట్టారు.


ఒక ఆఫీసర్‌ని, ఒక మహిళను బందీలుగా మార్చుకున్న దుండగులు.. మరో అధికారిని, ఒక మహిళను వదిలిపెట్టి రూ.10 లక్షలు తీసుకొచ్చి బందీలుగా ఉన్నవారిని విడిపించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వారి చెర నుంచి బయటపడ్డ ఆర్మీ అధికారి వేగంగా తన ఆర్మీ యూనిట్ వద్దకు వెళ్లి విషయాన్ని కమాండింగ్ అధికారికి చెప్పారు. ఇదే సమయంలో డయల్-100 ద్వారా పోలీసులకు కూడా సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పోలీసులు, సైనిక అధికారులు ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. అయితే వాహనాలను ముందుగానే గమనించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.


బాధితులు నలుగురినీ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు ఆర్మీ అధికారులకు గాయాలు అయ్యాయని వైద్యలుు తెలిపారు. ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయినట్టు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్‌ చెప్పారు. దుండగులపై దోపిడీ, అత్యాచారం మరియు ఆయుధ చట్టంలోని (BNS) సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఇండోర్ రూరల్ ఎస్పీ హితికా వాసల్ మీడియాకు వెల్లడించారు. ఈ నేరంతో సంబంధం ఉన్న ఇతర నేరస్తుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.

Updated Date - Sep 12 , 2024 | 09:12 AM