ఉక్రెయిన్ - రష్యా చర్చలు భారత్‌లోనే..
ABN, Publish Date - Oct 29 , 2024 | 02:49 AM
తమ దేశంపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆకాంక్షించారు. ఈ సంక్షోభాన్ని ఆయన ఆపగలరని వ్యాఖ్యానించారు.
అయితే మా షరతుల ప్రకారం జరగాలి
యుద్ధాన్ని నరేంద్ర మోదీ ఆపగలరు!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్య
న్యూఢిల్లీ, అక్టోబరు 28: తమ దేశంపై రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఆకాంక్షించారు. ఈ సంక్షోభాన్ని ఆయన ఆపగలరని వ్యాఖ్యానించారు. జెలెన్‌స్కీ సోమవారం ఓ జాతీయ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘జనాభా, ఎకానమీ, పలుకుబడి, ప్రభావపరంగా భారత్ అతిపెద్ద దేశం. అంత పెద్ద దేశానికి మోదీ ప్రధానిగా ఉన్నారు. ఉక్రెయున్‌పై యుద్ధాన్ని ఆయరు ఆపగలరు. తదుపరి శాంతి చర్చలు ఇండియాలో జరుగుతాయని ఆశిస్తున్నాను. యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు మోదీ కచ్చితంగా చేయగలరు. చర్చలకు అందరం సన్నద్ధం కావాలి. అయితే మేం కోరుకుంటున్న ఫార్మాట్లో అంటే మా షరతుల ప్రకారం ఇవి జరగాలి. ఎందుకంటే యుద్ధం మా భూభాగంలో మాపై జరుగుతోంది’ అని తెలిపారు.
తమ ఇంధన మౌలిక వసతులపై రష్యా దాడులు.. తమ భూభాగంలోకి చొచ్చుకొస్తుండడం.. శీతాకాలం సమీపిస్తుండడం.. వంటి పరిణామాలు తమ దేశానికి పెను సవాల్‌గా మారాయని చెప్పారు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికా సహకారంపై అనిశ్చితి నెలకొందని.. డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే తమకు సైనిక సాయం గందరగోళంలో పడుతుందని అన్నారు. తాము రూపొందించిన ‘విజయ ప్రణాళిక’, నాటో సభ్యత్వం ఇవ్వాలని కోరడం.. రష్యాతో చర్చల్లో బేరసారాల కోసం కాదని చెప్పారు. భవిష్యత్‌లో పశ్చిమ దేశాలు తమ అభిప్రాయం మార్చుకోకుండా ఉండేందుకే ఉక్రెయిన్‌ను నాటోలోకి ఆహ్వానించాలని కోరుతున్నామన్నారు. యుద్ధం ఆగిపోవాలని మోదీ ఊరకే మాటలు చెప్పడం కాదని.. నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రష్యా బలవంతంగా 1,000 మంది ఉక్రెయిన్ పిల్లలను తీసుకెళ్లిందని.. వారిని తిప్పిపంపేందుకు ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌పై ఆయన ఒత్తిడి తేవాలని కోరారు.
Updated Date - Oct 29 , 2024 | 02:49 AM