Lok Sabha Elections: సీట్ల సర్దుబాటుపై సయోధ్య కుదిర్చిన సోనియా, ప్రియాంక.. ఎస్పీకి-62, కాంగ్రెస్‌కు-17
ABN, Publish Date - Feb 21 , 2024 | 06:56 PM
ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాద్ పార్టీ , కాంగ్రెస్ మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చొరవతో సీట్ల సర్దుబాటు ఖరారైంది. సమాజ్‌వాదీ పార్టీ 62 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీకి అంగీకారం కుదిరింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ (Uttar pradesh) లోక్‌సభ ఎన్నికల్లో (Loksabha Elections) సమాజ్‌వాద్ పార్టీ (SP), కాంగ్రెస్ (Congress) మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi), ఆమె కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) చొరవతో సీట్ల సర్దుబాటు ఖరారైంది. ''కలిసే ఉన్నాం'' అంటూ అఖిలేష్ ప్రకటించడంతో పొత్తులపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. సమాజ్‌వాదీ పార్టీ 62 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో పోటీకి అంగీకారం కుదిరింది. ఒక స్థానంలో చంద్రశేఖర్ ఆజాద్‌కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ ఒక స్థానంలో పోటీ చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ''భారత్ జోడో న్యాయ్ యాత్ర''లో ఉన్న రాహుల్‌తో తొలుత మాట్లాడిన ప్రియాంక ఆవెంటనే అఖిలేష్‌తో మాట్లాడి ప్రతిష్ఠంభన తొలగించారని, ఏఏ సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలనే దానిపై త్వరలో తుదిరూపు ఇవ్వనున్నారని ఆ వర్గాలు చెప్పాయి.
ఒప్పందం ఏమిటంటే..?
కాంగ్రెస్ పార్టీ 19 సీట్ల కోసం పట్టుబట్టగా, తొలుత 11 ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సమాజ్‌వాదీ పార్టీ ఎట్టకేలకు 17 సీట్లు ఇచ్చేందుకు ఫిక్స్ అయింది. ఇదే సమయంలో కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులకు సైతం అంగీకరించింది. దీంతో ఇరుపార్టీల మధ్య ప్రతిష్ఠంభన తొలిగింది. ఆ ప్రకారం, సమాజ్‌వాదీ పార్టీ 62 సీట్లలో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 17 సీట్లలో పోటీ చేస్తుంది. ఆజాద్ సమాజ్ పార్టీ ఒక స్థానంలో పోటీ చేస్తుంది. మొరాదాబాద్ సీటును వదులుకునేందుకు కాంగ్రెస్ అంగీకరించగా, వారణాసి నుంచి తమ అభ్యర్థిని ఉపసంహరించుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ అంగీకరించింది. కాంగ్రెస్ పార్టీ మరో రెండు మార్పులు కోరింది. సీతాపూర్, హథ్రాస్ సీట్లు మార్పిడి చేయాలని కాంగ్రెస్ కోరింది. ఇందుకు సమాజ్‌వాదీ పార్టీ అంగీకరించింది. బులంద్‌సహర్ లేదా మధుర స్థానంలో శ్రవస్తి ఇచ్చేందుకు ఎస్‌పీ సిద్ధపడింది. మధుర సీటును కాంగ్రెస్‌కే సమాజ్‌వాదీ పార్టీ కేటాయించింది.
మొరాదాబాద్ పాదయాత్రలో అఖిలేష్
సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి రావడంతో ''కలిసే ఉన్నాం'' అంటూ అఖిలేష్ యాదవ్ బుధవారంనాడు ప్రకటించారు. మల్లికార్జున్ ఖర్గే ఆహ్వానం మేరకు అమేథి లేదా రాయబరేలిలో భారత్ జోడో యాత్రలో పాల్గొంటామని తొలుత అంగీకరించిన అఖిలేష్ ఆ తర్వాత పొత్తు ఖరారైతేనే పాల్గొంటామంటూ ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 24-25 తేదీల్లో మొరాదాబాద్‌లో జరిగే భారత్ జోడో యాత్రలో అఖిలేష్ యాదవ్ పాల్గోనున్నారు.
Updated Date - Feb 21 , 2024 | 06:56 PM