Share News

వర్షాలతో వణుకుతున్న ఉత్తరాఖండ్‌

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:16 AM

ఎడతెరపి లేని వానలు ఉత్తరాఖండ్‌ను వణికిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ రాష్ట్రంలోని ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి.

వర్షాలతో వణుకుతున్న ఉత్తరాఖండ్‌

డెహ్రాడూన్‌, జూలై 4: ఎడతెరపి లేని వానలు ఉత్తరాఖండ్‌ను వణికిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ రాష్ట్రంలోని ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అలకనంద, మందాకిని, భగీరథి నదులు ఇప్పటికే ప్రమాదకర స్థాయిని దాటేసి ప్రవహిస్తుండగా.. గంగా, సరయు నదులు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. గోమతి, కాళీ, గౌరీ, శారద నదుల్లో కూడా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన అధికారులు.. ముందు జాగ్ర త్త చర్యల్లో భాగంగా దాదాపు 100 రహదారులను మూసివేశారు. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ వద్ద నది పక్కన ఏర్పాటు చేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. చంపావత్‌, అల్మోరా, ఫిథోర్‌గఢ్‌, ఉధమ్‌సింగ్‌ నగర్‌, కుమావ్‌ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో మరో వారంరోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఉత్తరాఖండ్‌ వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్‌, పౌరి, తెహ్రీ, హరిద్వార్‌లోనూ ఆరెంజ్‌ అలర్ట్‌ (సిద్ధంగా ఉండాలి) ప్రకటించారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గంగా, అలకనంద, భగీరథి, శారద, మందాకిని, కోసి నదుల్లో నీటిమట్టం భారీగా పెరిగింది. గత 24 గంటల్లో అల్మోరాలోని చౌకుటియాలో అత్యధికంగా 72.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. లోతట్టు ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున నదీ తీరప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - Jul 05 , 2024 | 01:16 AM