Bangladesh: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై రగడ
ABN, Publish Date - Jul 19 , 2024 | 05:01 AM
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటి వరకు 33 మంది పౌరులు మృతి చెందగా.
ఘర్షణల్లో 33 మంది మృతి
2వేల మందికి పైగా గాయాలు
ఢాకా, జూలై 18: బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఇప్పటి వరకు 33 మంది పౌరులు మృతి చెందగా.. 2వేలకు పైగా ప్రజలు గాయపడ్డారు. గురువారం ఒక్కరోజే 19 మంది మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో అశువులు బాసిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటాను కల్పించారు. ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా పట్టం కట్టాలని అక్కడి వర్సిటీ విద్యార్థులు, ప్రజలు కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఆందోళనకారులు రెండు బస్సులకు నిప్పు పెట్టారు.
నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు రబ్బరు బులెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొన్నిచోట్ల అధికార అవామీ లీగ్ విద్యార్థి సంఘం నాయకులు.. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా ఘర్షణల్లో ఆరుగురు పౌరులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. గురువారం రాంపురా ప్రాంతంలోని టెలివిజన్ భవన్‌లో మీడియా ప్రతినిధులతో సహా చాలా మంది చిక్కుకుపోయారు. ఘర్షణలు తీవ్రతరం కావడంతో ప్రధాని షేక్ హసీనా పరిస్థితిని సమీక్షించారు. భద్రతా బలగాలను రంగంలోకి దించారు. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. విద్యాసంస్థలు, మదర్సాలను మూసివేయాలని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తెరవద్దని అధికారులు ఆదేశించారు.
Updated Date - Jul 19 , 2024 | 05:01 AM