Share News

Varanasi: ఆలయాల వద్ద ఉద్రిక్తత.. సాయిబాబా విగ్రహాల తొలగింపు

ABN , Publish Date - Oct 02 , 2024 | 11:22 AM

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో బడా గణేష్, పురుషోత్తమ తదితర ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం వివాదానికి దారితీసింది. ‘సనాతన్‌ రక్షక్‌ దళ్‌’ చేపట్టిన ప్రచారంలో భాగంగా 10 మందిరాల్లో మంగళవారం రాత్రి బాబా విగ్రహాల తొలగింపు జరిగింది.

Varanasi: ఆలయాల వద్ద ఉద్రిక్తత.. సాయిబాబా విగ్రహాల తొలగింపు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో బడా గణేష్, పురుషోత్తమ తదితర ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించడం వివాదానికి దారితీసింది. ‘సనాతన్‌ రక్షక్‌ దళ్‌’ చేపట్టిన ప్రచారంలో భాగంగా 10 మందిరాల్లో మంగళవారం రాత్రి బాబా విగ్రహాల తొలగింపు జరిగింది. సనాతన్ రక్షక్ దళ్ సభ్యులు సోమవారం లోహటియాలోని బడా గణేష్ ఆలయంలో సమావేశమయ్యారు. అనంతరం వారంతా సాయిబాబా విగ్రహాన్ని ఆలయంలో నుంచి తీసేసి ప్రాంగణం వెలుపల ఉంచారు. సరైన పరిజ్ఞానం లేకుండా సాయిబాబాను ఆరాధిస్తున్నామని.. వాస్తవానికి శాస్త్రాల్లో బాబా ఆరాధన గురించి ఎక్కడా చెప్పలేదని సనాతన్ రక్షక్ దళ్ సభ్యులు అంటున్నారు. అయోధ్యలోని హనుమాన్‌ గఢీ ఆలయ మహంతు రాజుదాస్‌ సైతం ఈ చర్యను సమర్థించారు. సాయిబాబా ధర్మ గురువే కావచ్చు, దేవుడు కాదని ఆయన అన్నారు.


కాశీలో పరమేశ్వరుడి ఆరాధన మాత్రమే జరగాలని దళ్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్‌శర్మ పేర్కొన్నారు. వారణాసిలోని సంత్‌ రఘువర్‌ దాస్‌ నగర్‌లో వెలసిన బాబా ఆలయ పూజారి సమర్‌ ఘోష్‌ దీనిపై స్పందిస్తూ.. ‘‘ఈరోజు సనాతనులమని అంటున్నవారే గతంలో ఈ ఆలయాల్లో సాయిబాబా విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఇది సరైన చర్య కాదు’’ అన్నారు. ఈ చర్యల వెనుక బీజేపీ ఉందని యూపీ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బాబాను భగవంతుని అవతారంగా అన్ని మతాలవారు పూజిస్తారని శిర్డీ శ్రీ సాయిబాబా సనాతన్‌ ట్రస్టు వెబ్‌సైట్‌లో పేర్కొంది.

సుప్రీం కోర్టు ఏమందంటే..

ద్వారకాపీఠానికి చెందిన శంకరాచార్య.. సాయిబాబాను ఆరాధనపై చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకోవడానికి 2014లో సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ఏడాది జూన్‌లో.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని హిందూ దేవాలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖకు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Viral News: చెత్తలో దొరికింది.. ఖరీదు రూ.55 కోట్లు

ఇదికూడా చదవండి: రేవంత్‌ సర్కారు.. ఇక ఇంటికే

ఇదికూడా చదవండి: దసరాకు ఏపీఎస్‌ ఆర్టీసీ 1,200 ప్రత్యేక బస్సులు

ఇదికూడా చదవండి: చీపుర్లు, రోకళ్లతో సిద్ధంగా ఉండండి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 02 , 2024 | 11:22 AM