Odisha: బీజేపీ-బీజేడీ పొత్తు పొడుస్తుందా.. 15 ఏళ్ల చరిత్ర రిపీట్ కానుందా
ABN, Publish Date - Mar 21 , 2024 | 02:38 PM
లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న వేళ.. అన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలనే యోచనలో ఉన్నాయి. పొత్తు ఖరారైన పార్టీలు ప్రచారంలో వేగం పెంచుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకోగా.. ప్రాధాన్యతా క్రమంలో సీట్ల పంపకం జరిగింది.
ఒడిశా: లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్న వేళ.. అన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలనే యోచనలో ఉన్నాయి. పొత్తు ఖరారైన పార్టీలు ప్రచారంలో వేగం పెంచుతున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకోగా.. ప్రాధాన్యతా క్రమంలో సీట్ల పంపకం జరిగింది. అయితే ప్రస్తుతం అందరి చూపు ఒడిశాపైనే ఉంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని అధికార బిజూ జనతా పార్టీ (BJD) రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చనే ఊహాగానాలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.
నవీన్ పట్నాయక్ సన్నిహితుడు, BJD నేత VK పాండియన్ (మాజీ IAS అధికారి) మాట్లాడుతూ.. BJP-BJD కూటమి రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేడీకి బీజేపీ మద్దతు అవసరం లేదని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి బీజేడీ మద్దతు అవసరం లేదని పాండియన్ అన్నారు. కాబట్టి రెండు పార్టీల మధ్య సహకారం రాజకీయాలకు అతీతంగా ఉంటుందని తెలిపారు.
ఎన్నికల వేళ ఇరుపార్టీలు మళ్లీ పొత్తు పెట్టుకుంటాయనే ఊహాగానాలు కొనసాగుతున్న వేళ పాండియన్ ఈ కామెంట్స్ చేశారు. ఒడిశాలో మొత్తం 21 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కానీ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, బీజేడీ పార్టీలు ఇప్పటివరకు తమ అభ్యర్థులను ప్రకటించలేదు. రాష్ట్రంలో మే 13, 20, 25, జూన్ 1 తేదీల్లో చివరి నాలుగు దశల్లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి.
చరిత్ర ఇది..
గనులు, ఖనిజాల శాఖ మంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ 1997లో జనతాదళ్ నుండి విడిపోయి బిజూ జనతాదళ్‌ను స్థాపించారు.
1998లో NDA నేతృత్వంలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో నవీన్ పట్నాయక్ గనుల శాఖ మంత్రిగా పని చేశారు.
1999లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని బీజేడీ పోటీ చేసి ఒడిశాలో 10 సీట్లు గెలుచుకుంది.
2000, 2004 అసెంబ్లీ ఎన్నికలలో BJD రాష్ట్రంలో మెజారిటీ సీట్లను గెలుచుకోగలిగింది.
2004లో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో బీజేపీ-బీజేడీ కూటమి కలిసి పని చేసింది.
2009 లోక్‌సభ ఎన్నికలలో, బీజేపీకి చాలా తక్కువ సీట్లను బీజేడీ ఆఫర్ చేసింది. సీట్ల పంపకం ఎటూ తేలకపోవడంతో రెండు పార్టీలు విడిపోయాయి.
అప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం అవి ఎలాంటి పొత్తు పెట్టుకోలేదు.
ఈ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు పొడిస్తే 15 ఏళ్ల విరామం తర్వాత చరిత్ర రిపీట్ అయినట్లే.
పొత్తు పొడిస్తే ఎవరికి లాభం?
లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. ఒడిశాలో రెండు పార్టీల పొత్తు బీజేపీ జాతీయ లక్ష్యానికి కలిసొచ్చే అవకాశం ఉంది. బీజేపీ నాయకత్వం అండ బీజేడీకి కలిసొస్తుందని నిపుణులు అంటున్నారు. మొత్తంగా కూటమి రూపుదిద్దుకుంటే రెండు పార్టీలకు ఉపయోగపడనుంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 21 , 2024 | 02:40 PM