Parliament Winter Session: కొనసాగుతోన్న వాయిదాల పర్వం.. మూడు కీలక బిల్లుల ఆమోదం!
ABN, Publish Date - Dec 09 , 2024 | 12:51 PM
పార్లమెంట్‍లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. గత రెండు వారాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ రోజు సభలో మూడు కీలక బిల్లులు ఆమోదించేందుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్ వ్యూహాత్మంగా అడుగులు వేస్తుంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 09: పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి దాదాపుగా ఇదే పరిస్థితి. అయితే సోమవారం ఉదయం 11.00 గంటలకు పార్లమెంట్ ఎప్పటిలాగా ప్రారంభమైంది. కానీ మణిపూర్‍లో అశాంతి, శంభులో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో వాటిపై చర్చ జరగాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో సభ ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక ఈ శీతాకాల సమావేశాలు మరికొద్ది రోజుల్లో.. ముగియనున్నాయి. దీంతో ఈ సమావేశాల్లో ముఖ్యంగా మూడు కీలక బిల్లులు... రైల్వే (అమాండమెంట్) బిల్లు 2024, డిజాస్టర్ మేనేజ్‍మెంట్(అమాండమెంట్) బిల్లు 2024, బ్యాంకింగ్ లాస్ (అమాండమెంట్) బిల్లు 2024 బిల్లులను ఈ రోజు ఆమోదం పొందే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.
Also Read: పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు.. కలకలం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. నవంబర్ 25వ తేదీన ప్రారంభమైనాయి. నాటి నుంచి నేటి వరకు మణిపూర్ లో అశాంతి, శంభులో హింసతోపాటు పలు సమస్యలపై సభలో చర్చించాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతోన్నాయి. అందుకు సభలో సమయం కేటాయించకపోవడంతో.. ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసనకు దిగాయి. ఈ నేపథ్యంలో సభ సజావుగా సాగడం లేదు. మరోవైపు విపక్షాల తీరును బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తీవ్రంగా తప్పు పడుతోంది. ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు, ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించేందుకు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధఈ భాగమయ్యారని బీజేపీ మండిపడ్డింది.
Also Read: ఆ కీలక మలుపు లేకుంటే.. జూన్ 2 గెలుపు లేనే లేదు
ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదంపై భారత్.. తన వైఖరిని సభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదంతోపాటు బందీలను అదుపులోకి తీసుకోవడాన్ని భారత్ ఖండిస్తుందన్నారు. అయితే పౌరుల ప్రాణ నష్టంపై దేశాలకు ప్రతిస్పందించే హక్కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గత వారం ఈ అంశంపై కేంద్ర మంత్రి జైశంకర్ స్పందించిన సంగతి తెలిసిందే. ఇక శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
Also Read: Cauliflower: క్యాలీఫ్లవర్ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?
మరోవైపు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ దేశ రాజధాని ఢిల్లీకి శాంతియుతంగా పాదయాత్ర చేపట్టారు. అయితే వారిని ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు, భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో వారితో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ అంశంపై సైతం సభలో చర్చించాలని కేంద్రాన్ని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
For National News And Telugu News
Updated Date - Dec 09 , 2024 | 12:52 PM