Share News

Phone Addiction: ఫోన్‌కి బానిసైన కుటుంబం.. మహిళ వినూత్న పరిష్కారం.. ఏం చేసిందో తెలుసా?

ABN , Publish Date - Jan 07 , 2024 | 06:46 PM

ఈరోజుల్లో మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న మాట వాస్తవమే. కానీ, కొందరు మాత్రం దీనికి బానిసలుగా మారుతున్నారు. వాస్తవ జీవితానికి దూరంగా.. ఈ మొబైల్ ఫోన్‌తోనే కాలం గడిపేస్తున్నారు.

Phone Addiction: ఫోన్‌కి బానిసైన కుటుంబం.. మహిళ వినూత్న పరిష్కారం.. ఏం చేసిందో తెలుసా?

Rules To End Mobile Addiction: ఈరోజుల్లో మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న మాట వాస్తవమే. కానీ, కొందరు మాత్రం దీనికి బానిసలుగా మారుతున్నారు. వాస్తవ జీవితానికి దూరంగా.. ఈ మొబైల్ ఫోన్‌తోనే కాలం గడిపేస్తున్నారు. నిజ జీవిత సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వడం మానేసి.. ఆన్‌లైన్ స్నేహితులతో ముచ్చటించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఉదయం నిద్రలేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా.. ఫోన్‌లోనే మునిగితేలుతున్నారు. అసలు ఫోన్ లేకపోతే జీవితమే వ్యర్థమన్నట్టుగా కొందరు జీవిస్తున్నారు. తద్వారా కుటుంబం సంబంధాలు దెబ్బ తింటున్నాయి. విద్యార్థుల చదువు కూడా గంగలో కలిసిపోతోంది.

ఒరిస్సాకి చెందిన ఒక కుటుంబం కూడా ఇలాగే మొబైల్ ఫోన్‌కి ఎడిక్ట్ అయ్యింది. ఫోన్ మాయలో పడి.. కుటుంబ సభ్యులకు కనీస సమయం కూడా కేటాయించలేకపోతున్నారు. దీంతో.. కుటుంబ పెద్ద అయిన ఒక మహిళ ఓ వినూత్నమైన పరిష్కారాన్ని తీసుకొచ్చింది. ఫోన్ అడిక్షన్ నుంచి కుటుంబ సభ్యుల్ని బయటపడేందుకు.. కొన్ని నిబంధనలతో కూడిన ఒక అఫిడవిట్‌ని సిద్ధం చేసింది. మంజు గుప్తాగా గుర్తించబడిన ఆ మహిళ.. సమయానుకూలంగా మొబైల్ ఫోన్‌లు వినియోగించేలా తన కుటుంబ సభ్యులతో ఆ అఫిడవిట్‌పై సంతకం చేయించింది. ఇది చూడ్డానికి కాస్త విచిత్రంగా, విడ్డూరంగా అనిపించినా.. ఆ మహిళ పెట్టిన రూల్స్ చూస్తే మాత్రం దిమ్మతిరగడం ఖాయం.


ఇంతకీ ఆ రూల్స్ ఏమిటి?

1. ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే ఫోన్‌ని తాకకూడదు. ముందుగా సూర్య నమస్కారం చేయాలి.

2. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర మాత్రమే తినాలి. భోజనం చేసేటప్పుడు ఫోన్ 20 అడుగుల దూరంలో ఉండాలి.

3. ఎవరూ టాయిలెట్‌లోకి ఫోన్‌ను తీసుకెళ్లకూడదు. రీల్స్ చూసే బదులు, టాయిలెట్‌పై దృష్టి పెట్టేందుకే ఈ రూల్.

ఇది తాను కోపంలో తీసుకున్న నిర్ణయం కాదని, ఓ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అనన్య పాండే నటించిన ‘ఖో గయే హమ్ కహాన్’ చూసిన తర్వాత తన పిల్లలు ‘లైక్స్’ కోసం పిచ్చోళ్లైన సంగతిని గ్రహించానని మంజు గుప్తా ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. కేవలం ఈ మూడు రూల్స్ మాత్రమే కాదు, చివర్లో ఆమె తన పిల్లలకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా పైన తెలిపిన మూడు రూల్స్‌ని పాటించకపోతే.. Zomato, Swiggyలో ఫుడ్ ఆర్డర్ చేసే అవకాశం పొందరని హెచ్చరించింది. ప్రస్తుతం ఈ అఫిడవిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఒక రకంగా ఈ నియమాలు పాటిస్తే.. బహుశా నిజంగానే ఫోన్ అడిక్షన్ తగ్గుతుందేమో! మీరూ ప్రయత్నించి చూడండి.

Updated Date - Jan 07 , 2024 | 06:46 PM