Nagpur Clash Aurangzeb Tomb Row: ఔరంగజేబు సమాధి తొలగించాలంటూ డిమాండ్స్.. నాగ్‌పూర్‌లో చెలరేగిన హింస
ABN , Publish Date - Mar 18 , 2025 | 08:18 AM
ఔరంగజేబు సమాధిని తొలగించాలన్న డిమాండ్స్ నాగ్‌పూర్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రాళ్ల దాడి, వాహనాలకు నిప్పు పెట్టిన ఘటనలు వెలుగు చూడంతో పోలీసుల భాష్ప వాయువు ప్రయోగించి అల్లరి మూకలను చెదరగొట్టాల్సి వచ్చింది. ప్రజలు ఎటువంటి వదంతులను నమ్మొద్దని మహారాష్ట్ర సీఎం పిలుపునిచ్చారు.

ఇంటర్నెట్ డెస్క్: ఔరంగజేబు సమాధి తొలగించాలన్న డిమాండ్స్ నాగ్‌పూర్‌లో ఉద్రిక్తతలకు దారి తీసింది. దీనిపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.. శాంతిని నెలకొల్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘మహల్ ఏరియాలో రాళ్లు రువ్విన ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే, పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు’’ అని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు. నాగ్‌పూర్ ప్రశాంతమైన నగరమని, స్థానికులు ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలు పంచుకుంటారని అన్నారు. నాగ్‌పూర్ సంస్కృతి ఇదేనని, ప్రజలు వదంతులను నమ్మొద్దని సూచించారు.
Also Read: ప్రధాని మోదీతో తులసి గబ్బార్డ్ భేటీ
ఔరంగజేబు సమాధానికి తొలగించాలంటూ మహల్ ప్రాంతంలో విశ్వహిందూ పరిషత్ నిరసన కార్యక్రమం చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇందుకు ప్రతిగా కొందరు రాళ్లు రువ్వడం, వాహనాల ధ్వంసానికి పాల్పడ్డారు. ఈ దాడిలో కొందరు అగ్నిమాపక సిబ్బందికి గాయాలయ్యాయి. అగ్నిమాపక శాఖ వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ తరువాత పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జ్, భాష్ఫవాయులు ప్రయోగించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డట్టు తెలుస్తోంది.
Also Read: అనుమతి లేకుండా మహిళల ఫొటోల వినియోగం ఆందోళనకరం
‘‘కొందరు రాళ్లు రువ్వారు. కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో మేము కూడా తగు చర్యలు తీసుకున్నాము. భాష్ఫ వాయువు ప్రయోగించాము. అగ్నిమాపక సిబ్బందిని పిలిపించి మంటలను ఆర్పాము. ఈ ఘటనలో కొందరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. నా కాలికీ రాయి తగిలి గాయం అయ్యింది. హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని నాగ్‌పూర్ డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. ఇక నాగ్‌పూర్ ఎంపీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ ఘటనపై స్పందించారు. ప్రజలు హింసకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. ‘‘చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇస్తున్నాను. పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్షిస్తున్నారు. కాబట్టి, వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ఆయన అన్నారు.
ఇక ఔరంగజేబు సమాధి తొలగించాలన్న డిమాండ్స్‌పై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే, ఏ చర్య అయినా చట్టబద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఖులాబాద్‌లోని ఔరంగజేబు సమాధిని పురావస్తు శాఖ పరిధిలోకి తెచ్చిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. హింసకు పాల్పడిన ఔరంగజేబు సమాధికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి రావడం విచారకరమని కూడా వ్యాఖ్యానించారు. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ డిమాండ్స్‌పై మండిపడుతున్నారు. ద్వేషం, హింసను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆక్షేపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి