Mumbai Doctor: కోల్‌కతా ఘటన మరువకముందే మరో ఘోరం!
ABN, Publish Date - Aug 18 , 2024 | 03:41 PM
కోల్ కతాలో వైద్యురాలి మృతిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వైద్య సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. నిందితుడు సంజయ్ రాయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. వైద్యురాలి మృతిపై దేశవ్యాప్తంగా ఒక్కటే చర్చ.. ఇంతలో మరో వైద్యురాలిపై దాడి జరిగింది.
ముంబై: కోల్ కతాలో వైద్యురాలి (Kolkata Doctor) మృతిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. వైద్య సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. నిందితుడు సంజయ్ రాయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. వైద్యురాలి మృతిపై దేశవ్యాప్తంగా ఒక్కటే చర్చ.. ఇంతలో మరో వైద్యురాలిపై దాడి జరిగింది.
ఏం జరిగిందంటే..
ముంబైలో గల సియాన్ ఆస్పత్రికి ఆదివారం ఓ రోగి వచ్చాడు. అతను అప్పటికే గొడవ పడటంతో మొహంపై గాయాలు ఉన్నాయి. చేతులకు గాయం కావడంతో రక్తం కారుతోంది. సియాన్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఈఎన్టీ విభాగానికి అతన్ని తరలించారు. ఆ డిపార్ట్ మెంట్‌లో మహిళా వైద్యులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. రోగి మొహంపై అయిన గాయం వద్ద మహిళా వైద్యురాలు డ్రెస్సింగ్ చేశారు. రక్తం ఉండటంతో శుభ్రం చేస్తున్నారు. ఇంతలో రోగి తనకు నొప్పిగా ఉందని అరవడం ప్రారంభించాడు. దాంతో రోగి, అతని బంధువులు, స్నేహితులు వైద్యురాలితో వాదనకు దిగారు. తర్వాత దూషించడం ప్రారంభించారు.
రోగి, స్నేహితులు కలిసి దాడి
బూతులు తిట్టి.. తర్వాత మహిళా వైద్యురాలిపై భౌతిక దాడి చేశారు. రోగితోపాటు అతని స్నేహితులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటన తెల్లవారు జామున 3.30 గంటలకు జరిగింది. ఉదయం 7 గంటలకు వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోగి, అతని స్నేహితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకుంటామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
వైద్యులపై దాడి
వైద్యో నారాయణో హరి అని అంటారు. వైద్యులను దేవునితో పోలుస్తారు. పిలుస్తారు కూడా.. రోగి ప్రాణాలను కాపాడే వైద్యులపై దాడి జరగడం బాధాకరం. కోల్ కతాలో ఓ ట్రైనీ డాక్టర్‌పై లైంగికదాడి చేసి, దారుణంగా హతమార్చారు. ఆ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. వైద్యులంతా సంఘీభావం తెలియజేశారు. ఈ క్రమంలో ముంబైలో ఓ మహిళా వైద్యురాలిపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 18 , 2024 | 03:57 PM