సుస్వరాల పాటసారి
ABN , Publish Date - Oct 06 , 2024 | 05:53 AM
విలక్షణమైన గాత్రం... భాష ఏదైనా... ఎంతటి క్లిష్టమైన బాణీ అయినా... అలవోకగా పాడగల సామర్థ్యం. భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక అపురూపం... ‘క్వీన్ ఆఫ్ డైనమిక్స్’గా ప్రశంసలు అందుకొంటున్న గానామృతం... నలభై ఏళ్ల శ్రేయా గోషాల్. రెండున్నర దశాబ్దాల కెరీర్‌లో...
విలక్షణమైన గాత్రం... భాష ఏదైనా... ఎంతటి క్లిష్టమైన బాణీ అయినా... అలవోకగా పాడగల సామర్థ్యం. భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక అపురూపం... ‘క్వీన్ ఆఫ్ డైనమిక్స్’గా ప్రశంసలు అందుకొంటున్న గానామృతం... నలభై ఏళ్ల శ్రేయా గోషాల్. రెండున్నర దశాబ్దాల కెరీర్‌లో... ఉర్రూతలూగించిన కోకిల రాగాలే కాదు... ఆమె అందుకున్న అత్యున్నత పురస్కారాలూ ఎన్నో.
శ్రేయా గోషాల్‌ది బెంగాలీ కుటుంబం. పశ్చిమబెంగాల్ ముషీరాబాద్ జిల్లా బహరామ్‌పూర్ స్వస్థలం. ఆమె తండ్రి బిశ్వజిత్ గోషాల్ ‘న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’లో ఎలక్ర్టికల్ ఇంజనీర్. తల్లి శర్మిష్ట లిటరేచర్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్. రాజస్థాన్ కోటాకు సమీపంలోని రావత్‌భాటా అనే చిన్న పట్టణంలో శ్రేయ పెరిగింది. స్థానిక కేంద్రియ విద్యాలయంలో ఎనిమిదో తరగతి వరకు చదివింది. నాలుగేళ్ల వయసులో శాస్త్రీయ సంగీత సాధన మొదలుపెట్టింది. 1995లో ఢిల్లీ వేదికగా జరిగిన ‘ఆలిండియా లైట్ వోకల్ మ్యూజిక్ కాంపిటీషన్’ సబ్‌జూనియర్ విభాగంలో టైటిల్ గెలుచుకుంది. ‘సంగమ్ కళా గ్రూప్’ ఈ పోటీలు నిర్వహించింది. ఆమె తమ్ముడు సౌమ్యదీప్ గోషాల్ కూడా సంగీతకారుడే. తన తండ్రి ‘బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్’కి బదిలీ కావడంతో... 1997లో శ్రేయ కుటుంబం ముంబయికి మారింది. అక్కడి ‘అటామిక్ ఎనర్జీ జూనియర్ కాలేజీలో’ సైన్స్ సబ్జెక్టు తీసుకున్న ఆమె... మధ్యలోనే ఆపేసింది. ‘ఎస్‌ఐఈఎస్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్’లో చేరింది.
ఆరంభం...
హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం అభ్యసించిన శ్రేయ చిన్న వయసులోనే వేదికలపై తన గానాన్ని వినిపించింది. ఆమెకు ఎప్పుడూ తోడుగా అమ్మ ఉండేవారు. రిహార్సల్స్‌కు వెళ్లేవారు. తంబురా సహకారం అందించేవారు. తొలుత కళ్యాణిజీ భాయ్ దగ్గర సంగీతంలో శిక్షణ పొందిన శ్రేయ... ముంబయికి వచ్చిన తరువాత ముక్తా భిడే వద్ద శిష్యరికం చేసింది. ఆరేళ్ల వయసులో ఓ క్లబ్ వార్షికోత్సవంలో తొలిసారి ఆమె స్టేజీ షో ఇచ్చింది. పదహారేళ్లప్పుడు రియాలిటీ షో ‘సారేగమ’లో పోటీపడి టైటిల్ గెలుచుకుంది. దానికిముందు ఓ ఆల్బమ్ కోసం గాత్రం అందించింది. అదే ఆమెకు మొట్టమొదటి ఆల్బమ్.
వృత్తి‘గతం’...
అప్పటివరకు ప్రైవేటు ఆల్బమ్స్‌కే పరిమితమైన శ్రేయ కెరీర్‌కు అతిపెద్ద మలుపు... ఓ టీవీ షోలో ఆమె ప్రదర్శన. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తల్లి లీలా బన్సాలీ ఆ షోలో శ్రేయ ప్రతిభ చూసి ముగ్ధురాలయ్యారు. సంజయ్ లీలా బన్సాలీని పిలిచి, తనను కూడా ఆ షో చూడమన్నారు. ఆయన కూడా ఫిదా అయ్యారు. శ్రేయాకు అవకాశం ఇవ్వాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. తను తీయబోయే ‘దేవ్‌దాస్’ చిత్రంలో ఐశ్వర్యారాయ్ పోషించే ‘పారు’ పాత్రకు అమాయకత్వం నిండిన గొంతు కావాలని సంజయ్ అనుకున్నారు. అందుకు శ్రేయ గాత్రం సరిగ్గా సరిపోతుందని భావించి, ఆమెను పిలిపించారు. అలా 2002లో విడుదలైన ‘దేవ్‌దా్‌స’లో శ్రేయ ఐదు గీతాలు పాడారు. అందులోని ‘బైరీ పియా...’, ‘డోలా రే డోలా...’ తదితర పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. అప్పటికి శ్రేయ వయసు పదహారేళ్లు. హయ్యర్ సెకండరీ పరీక్షల సమయం కావడంతో, రికార్డింగ్ థియేటర్‌కు పుస్తకాలు వెంట తెచ్చుకొనేది. ఖాళీ సమయంలో చదువుకొనేది.
తొలి చిత్రంతోనే శ్రేయ ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు అందుకుంది. ‘బైరీ పియా’ పాటకు గానూ ఈ పురస్కారం లభించింది. ‘డోలా రే డోలా’కు ‘ఫిలిమ్‌ఫేర్’ అవార్డు దక్కింది. కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమెకు ఇది ఊహించని విజయం. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకొనే అవసరం రాలేదు. ఒక్క హిందీ చిత్ర సీమ నుంచే కాకుండా దక్షిణాది నుంచి కూడా పిలుపు వచ్చింది. తెలుగు, కన్నడ, తమిళ్, మళయాళం, గుజరాతీ, సంస్కృతం, ఇంగ్లీష్... ఒకటేమిటి మొత్తం 20 భాషల్లో మూడు వేలకు పైగా పాటలు పాడింది. వాటిల్లో సగం హిందీ కాగా, మూడొందల వరకు తెలుగు పాటలు ఉన్నాయి.
‘‘ఫైనల్ రికార్డింగ్‌కు ముందు ‘బైరీ పియా’ పాటను ఒకసారి రిహార్సల్ చేయమన్నారు. ఎంతో ఉత్సుకతకు లోనయ్యా. కళ్లు మూసుకుని బ్రేక్ లేకుండా పాడేశాను. కళ్లు తెరిచి చూసే సరికి రికార్డింగ్ రూమ్ బయట అంతా ఏదో గందరగోళంగా ఉన్నట్టు అనిపించింది. అప్పుడు సంజయ్ చెప్పారు... ‘చాలా అద్భుతంగా పాడావు’ అని’’ అంటూ తొలినాటి అనుభవాలను ఓ సందర్భంలో పంచుకుంది శ్రేయ. ‘బర్సో రే’ వంటి రాగయుక్తమైన గీతమైనా... ‘చిక్‌నీ చమేలీ’ లాంటి దుమ్ము లేపే మాస్ పాటైనా... ఆమె గొంతులో పడితే వీనుల విందుగా మారుతుంది. ఏ భాషలో పాడినా... తన మాతృక అదే అన్నంతగా పాటకు ప్రాణం పోస్తుంది. ఇదే ఆమెను ప్రత్యేకంగా నిలుపుతోంది. రెండున్నర దశాబ్దాల కెరీర్‌లో ఎంతోమంది గాయనీమణులు వచ్చిపోతున్నారు కానీ... శ్రేయ స్థానం మాత్రం ఎప్పుడూ శిఖరాగ్రమే.
మరో ప్రస్థానం...
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా... మరోవైపు ప్రైవేటు గీతాలు కూడా పాడుతూ... తన గాత్రానికి మరింత వైవిధ్యాన్ని జోడించే ప్రయత్నం చేస్తోంది ఈ బెంగాలీ భామ. తన పాటలకు తనే సాహిత్యం రాసుకొని, వాటిని విడుదల చేస్తోంది. ‘న వో మై, అప్‌నీ మాతీ’ తదితర వాటిల్లో ఉన్నాయి. 73వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రూపొందించిన ‘అప్‌నీ మాతీ’ గీతాన్ని... సద్గురు జగ్గీవాసుదేవ్ ‘ఇషా ఫౌండేషన్’ తమ ‘సేవ్ సాయిల్’ ఉద్యమానికి ఉపయోగించుకుంది. పలువురు అంతర్జాతీయ కళాకారులతో కలిసి కొన్ని ఆల్బమ్స్ చేసింది. ఇక దేశవిదేశాల్లో ఆమె ఇచ్చే లైవ్ షోలకు లెక్కే లేదు.
స్ఫూర్తి మంత్రం...
సంగీతంపై తనకు మక్కువ కలిగింది తన తల్లి శర్మిష్టను చూసే అంటారు శ్రేయ. శర్మిష్ట క్లబ్బుల్లో శాస్త్రీయ బెంగాలీ గీతాలు ఆలపించేవారు. ఆవిడే శ్రేయను అంత చిన్న వయసులో సంగీతం వైపు నడిపించారు. ‘నా తొలి గురువు మా అమ్మే. నా తొలి విమర్శకురాలు కూడా తనే. లతామంగేష్కర్‌ను, కేఎస్ చిత్రను గాత్రంలో నా గురువులుగా భావిస్తాను. నేను పాడే శైలిపై వాళ్ల ప్రభావం ఎంతో ఉంది. అలాగే వైవిధ్యంలో ఆశాభోంశ్లే, గీతా దత్తా, ఘజల్స్‌లో జగ్జీత్‌సింగ్ నాకు స్ఫూర్తి’ అంటారు శ్రేయ.
వ్యక్తిగతం...
చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలకు భిన్నం శ్రేయ. తన వ్యక్తిగత జీవితం గురించి నలుగురితో పంచుకోవడానికి ఇష్టపడదు. శ్రేయ, ఆమె భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ కెమెరాలకు దూరంగా ఉంటారు. అయితే వీరి ప్రేమ కథ ఏ సినిమా కథకూ తీసిపోదు. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. పదేళ్ల సహజీవనం తరువాత 2015లో పెళ్లి చేసుకున్నారు. ‘ఒక స్నేహితుడి వివాహ వేడుకలో ముందుగా తనే నన్ను అడిగాడు’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది శ్రేయ. తన భర్తే తన మనసుకు దగ్గరైనవాడని పేర్కొంది. 2015లో వీరు మగబిడ్డకు జన్మనిచ్చారు. ముంబయి యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన ముఖోపాధ్యాయ కాలర్ ఐడీ, కాల్ బ్లాకింగ్ యాప్ ‘ట్రూకాలర్’కు గ్లోబల్ హెడ్.