ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anjini Dhawan : దేనికైనా రెడీ..!

ABN, Publish Date - Nov 18 , 2024 | 01:28 AM

బాలీవుడ్‌లోకి మరో వారసురాలు వచ్చింది. ఆమె ఎవరో కాదు... హీరో వరుణ్‌ ధావన్‌ అన్న కూతురు... ‘బిన్ని అండ్‌ ఫ్యామిలీ’ కథానాయిక... అంజినీ ధావన్‌.

సెలబ్‌ టాక్‌

బాలీవుడ్‌లోకి మరో వారసురాలు వచ్చింది. ఆమె ఎవరో కాదు... హీరో వరుణ్‌ ధావన్‌ అన్న కూతురు... ‘బిన్ని అండ్‌ ఫ్యామిలీ’ కథానాయిక... అంజినీ ధావన్‌. వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశయంతో... కొన్నేళ్లు పరిశ్రమలోనే పని చేసి... అనుభవం గడించింది. తొలి చిత్రంతోనే మంచి హిట్‌ సొంతం చేసుకోవడమే కాదు... అగ్ర నటుల ప్రశంసలు కూడా అందుకుంది.

అంజినీ ఇంట్లో అందరూ సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్నవారే. తాతయ్య అనిల్‌ ధావన్‌ వెటరన్‌ నటుడు. ఆయన కుమారుడు, అంజినీ తండ్రి సిద్ధార్ధ్‌ ధావన్‌ బుల్లితెర నటుడు. హిట్‌ చిత్రాల దర్శకుడు డేవిడ్‌ ధావన్‌ పినతాత. డేవిడ్‌ తనయుడు, ప్రముఖ హీరో వరుణ్‌ ధావన్‌ ఆమెకు వరుసకు బాబాయి. చిన్నప్పటి నుంచీ సినీ వాతావరణంలోనే గడిపిన అంజినీకి సాధారణంగానే నటనపై మక్కువ పెరుగుతూ వచ్చింది. ముంబయిలో పుట్టి పెరిగిన ఆమె... డిగ్రీ తరువాత కెరీర్‌పై పూర్తి శ్రద్ధ పెట్టింది. అయితే కుటుంబ నేపథ్యం, ఇంట్లోవాళ్ల ప్రోత్సాహం ఉన్నా... తొలుత తనను తాను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని అనుకుంది.

ఆ తరువాతే తెర మీద కనిపించాలనే పట్టుదలతో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పరిశ్రమలో అడుగుపెట్టింది. వరుణ్‌ ధావన్‌ ‘కూలీ నంబర్‌-1’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసింది. అప్పుడప్పుడూ బామ్మ రష్మీ ధావన్‌ యాక్టింగ్‌ స్కూల్లోని విద్యార్థులతో కలిసి నటనలో మెళకువలు కూడా నేర్చుకుంది. ఇలా ఎక్కడ అవకాశం దొరికినా దాన్ని ఉపయోగించుకొంటూ... తనలోని నటికి మరిన్ని వన్నెలద్దింది. వీటన్నిటి ఫలితం తొలి చిత్రం ‘బిన్ని అండ్‌ ఫ్యామిలీ’లోనే కనిపించింది. సినిమా చూసినవారందరూ... ఆమెకు అది మొదటి సినిమా అనుకోలేదట. అంతలా అదరగొట్టింది నటనలో. ఇక ఎంతో సహజంగా నటించిందనేది విమర్శకుల మాట.


  • వేరొక ఆడిషన్‌లో చూసి...

‘బిన్ని అండ్‌ ఫ్యామిలీ’లో అవకాశం కూడా విచిత్రంగా వచ్చింది అంజినీకి. ‘‘వేరొక సినిమా కోసం ఏడాదిగా ఆడిషన్లు ఇస్తున్నా. అది సంజయ్‌ త్రిపాఠీ దృష్టిలో పడింది. తను తీయబోయే చిత్రంలో ‘బిన్ని’ పాత్రకు నేనైతే సరిగ్గా సరిపోతానని ఆయన భావించారట. వెంటనే నన్ను ఆడిషన్స్‌కు పిలిచారు. నా నటన నచ్చింది. అలా ‘బిన్ని అండ్‌ ఫ్యామిలీ’లో అవకాశం రావడమే కాదు... నటిగా నా కెరీర్‌ కూడా ప్రారంభమైంది’’ అంటూ ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది అంజినీ.

  • ‘నా జీవితానికి దగ్గరైన పాత్ర’...

ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను లండన్‌లో చిత్రీకరించాడు సంజయ్‌. నెల రోజులపాటు సాగిన ఆ షెడ్యూల్‌లో ‘పంకజ్‌ కపూర్‌, హిమని శివ్‌పురి, రాజేష్‌కుమార్‌ లాంటి సీనియర్లతో కలిసి పని చేయడంవల్ల ఎంతో నేర్చుకొనే అవకాశం లభించింది. అంతా ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు. నెల రోజులూ ఎంతో సరదాగా గడిచిపోయాయి. అదీకాకుండా ‘బిన్ని’ పాత్ర నిజ జీవితంలో నాకు చాలా దగ్గరగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు చేస్తున్నప్పుడు, ముఖ్యంగా బామ్మ పాత్రధారి నా చిరిగినట్లుండే ఫ్యాషన్‌ జీన్స్‌ చూసి ఇదేంటని ప్రశ్నించినప్పుడు మా నాన్న గుర్తుకువచ్చారు. ఆయన కూడా ఇంట్లో నా డ్రెస్‌లు చూసి జోకులు వేసేవారు’ అంటూ తన అనుభవాలు పంచుకుంది అంజినీ. డేవిడ్‌, వరుణ్‌ ధావన్‌ ఎప్పుడూ ఆమెకు అండగా ఉంటారు. ముఖ్యంగా ఈ చిత్రం ప్రచార కార్యక్రమాల్లోనే కాకుండా, షూటింగ్‌ సమయంలో కూడా వరుణ్‌ అంజినీకి మద్దతుగా నిలిచాడు. తన ఇన్‌స్టా, ఎక్స్‌ ఖాతాల్లో ఆమె గురించి, ఆమె చిత్రం గురించిన విశేషాలను పంచుకున్నాడు. సినిమా విడుదల తరువాత కూడా అంజినీని ప్రత్యేకంగా అభినందించాడు.


  • నిరూపించుకొంటేనే...

‘‘నా సినిమా విడుదలకు ముందు కొందరు ‘బాలీవుడ్‌లో బంధుప్రీతికి మరో నిదర్శనం’ అంటూ కించపరిచేలా నాపై వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో పరిచయాలవల్ల కష్టపడకుండానే మొదట్లో ఒకటి రెండు అవకాశాలు వస్తాయేమో! కానీ మనలో సామర్థ్యం లేకపోతే ఇక్కడే కాదు, ఏ రంగంలోనూ నిలదొక్కుకోలేము. మనల్ని మనం నిరూపించుకొంటేనే మనుగడ. నటిగా తెరమీద కనిపించడానికి ముందు సినీ నిర్మాణంలో ప్రతి క్రాఫ్ట్‌ గురించీ తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే తొలుత బాబాయి సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాను. షూటింగ్‌ స్పాట్‌కు ఉదయాన్నే వెళ్లిపోయేదాన్ని. కెమెరా, లైటింగ్‌, లొకేషన్లు... ఇలా అన్నిటి మీద ఒక అవగాహన వచ్చాకనే నటన గురించి ఆలోచించాను’’ అంటుంది అంజినీ.

  • మంచి స్నేహితులు...

‘కూలీ నంబర్‌-1’ షూటింగ్‌లో వరుణ్‌, ఆ చిత్ర కథానాయిక సారా అలీఖాన్‌తో ఎంతో సరదాగా గడిచిపోయేదని, తారలపై వచ్చే గాసిప్స్‌ మీద మాట్లాడుకొని నవ్వుకొనేవారమని చెప్పింది ఇరవై నాలుగేళ్ల అంజినీ. ‘వరుణ్‌ను ఎప్పుడూ బాబాయిగా చూడలేదు. అన్నయ్యలాగా భావిస్తాను. తను నన్ను ఎంతో గారాబంగా చూసుకొంటాడు’ అంటున్న అంజినీకి సంజయ్‌ కపూర్‌ కుమార్తె, నటి షనయ కపూర్‌, బోనీ- శ్రీదేవిల చిన్న కూతురు ఖుషీ కపూర్‌ మంచి మిత్రులు. ‘నా సినిమా ప్రివ్యూ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ల కళ్లు చమర్చాయి. నా నటన బాగుందని అభినందించారు’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది అంజినీ.

  • అన్నీ చెయ్యాలి...

మొదటి చిత్రంతోనే మంచి నటిగా ప్రశంసలు అందుకున్న అంజినీ... భవిష్యత్తులో అన్ని రకాల పాత్రలూ చేయాలని అనుకొంటోంది. ‘యాక్షన్‌, కామెడీ, ప్రేమ కథలు, స్పై థ్రిల్లర్లు అనే తేడా లేకుండా ప్రతి పాత్రా పోషించాలి. విలక్షణ నటిగా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి’... అని కోరుకొంటున్న అంజినీ ఏ పాత్రకైనా రెడీ అంటోంది. ఆమెకు ఇన్‌స్టాలో ఫాలోవర్స్‌ కూడా తక్కువేంలేరు. ఫ్యాషన్‌ ఐకాన్‌గా తెరంగేట్రానికి ముందే లక్షలమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె... తరచూ వెరైటీ డ్రెస్సుల్లో ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తుంటుంది. వాటికి లైక్‌లూ లక్షల్లోనే. ఫిట్‌గా ఉండటానికి యోగా, జిమ్మాస్టిక్స్‌ను తన దినచర్యల్లో భాగంగా చేసుకుంది.

Updated Date - Nov 18 , 2024 | 01:32 AM