ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vinayaka Chavithi: అష్ట గణపతి క్షేత్రాలు

ABN, Publish Date - Sep 06 , 2024 | 06:08 AM

Ganesh Chaturthi:సూర్యుణ్ణి, గణపతిని, శక్తిని, రుద్రుణ్ణి, విష్ణువును పంచభూతాత్మకులని అంటారు. ఒక్కొక్క దైవానికి ఒక్కో విధమైన శక్తి ఉంటుంది. ఈ దైవాలు అందరినీ ఏకకాలంలో పూజించిన ఫలం ఒక్క గణపతిని పూజిస్తే లభిస్తుందనేది శ్రుతి వాక్యం....

Ashta Ganapati Kshetras

ఆలయదర్శనం

ఆదిత్యం గణనాథంచ దేవీ రుద్రంచ కేశవమ్‌... పంచదైవత మిత్యుక్తమ్‌

సూర్యుణ్ణి, గణపతిని, శక్తిని, రుద్రుణ్ణి, విష్ణువును పంచభూతాత్మకులని అంటారు. ఒక్కొక్క దైవానికి ఒక్కో విధమైన శక్తి ఉంటుంది. ఈ దైవాలు అందరినీ ఏకకాలంలో పూజించిన ఫలం ఒక్క గణపతిని పూజిస్తే లభిస్తుందనేది శ్రుతి వాక్యం. పంచాయతనంలో పరబ్రహ్మ స్వరూపుడైన గణపతి ముఖ్యుడు. తొలిపూజను అందుకొనే దైవం. గణపతిని సంతృప్తిపరచి, అనుగ్రహం పొందితే... అన్నీ సానుకూలం అవుతాయి. గణపతినే ప్రధానంగా ఉపాసించేవారిని ‘గాణపత్యులు’ అంటారు. గాణపత్య సంప్రదాయానికి పట్టుకొమ్మ... మరాఠా ప్రాంతం.

భారతీయులకు తొలి పండుగ వినాయక చవితి. భాద్రపద శుద్ద చవితిని వినాయక చవితిగా... దేశమంతటా ఇంటింటా, వాడవాడలా జరుపుకొంటారు. సామూహికంగా నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల ప్రజలు వైదిక సంప్రదాయానుసారం స్వామిని పూజిస్తారు. గణపతి తత్త్వాన్ని ‘క్షిప్రప్రసాద తత్త్వం’ అంటారు. అంటే కోరిన వెంటనే కోరిక తీర్చే దయాగుణం. గణపతి రూపాలు అనేకం. అలాగే నామాలు కూడా. ప్రతి నామానికీ తనదైన ప్రత్యేకత ఉంది. శాస్త్రప్రకారం 108 నామాలున్నాయి. ‘ముద్గల పురాణం’తో సహా పలు పురాణాలు 32 నామాలను, శిల్పశాస్త్రం 16 నామాలను చెప్పాయి. వాటిలో ఎనిమిది నామాలకు ప్రతీకగా... గాణపత్య సంప్రదాయానికి చెందిన అష్ట వినాయక క్షేత్రాలు మహారాష్ట్రలో ఏర్పాడ్డాయి. ఈ క్షేత్రాల్లో వినాయకుడు స్వయంభువుగా వెలిశాడని ప్రతీతి. అవి..


మయూరేశ్వరుడు, మోర్గావ్‌

ఈ ప్రాంతంలో ఎక్కువగా నెమళ్ళు ఉండేవట. అందుకే అక్కడ వెలసిన గణపతికి ‘మయూరేశ్వరుడు’ అనే పేరు వచ్చింది. ఇది సింధు అనే రాక్షసుణ్ణి వినాయకుడు వధించిన ప్రదేశం. గర్భాలయంలో గణపతి... నెమలిపై ఆసీనుడై దర్శనమిస్తాడు. మూలవిరాట్టుకు ఎదురుగా... పెద్ద మూషికం కాళ్ళతో మోదకాన్ని పట్టుకొని ఉంటుంది. ఆలయానికి ఎనిమిది దిక్కుల్లో గణపతి విగ్రహాలు, వాటికి ఇరుపక్కలా ఆయన పత్నులైన సిద్ధి, బుద్ధి విగ్రహాలు ఉంటాయి. గణపతి శిరస్సుపై పాము పడగ ఉంటుంది.

శ్రీ సిద్ధి వినాయకుడు, సిద్ధిటెక్‌

మధు, కైటభులనే రాక్షసుల సంహార సమయంలో శ్రీహరికి గణపతి సిద్ధి కలుగజేసిన ప్రాంతంగా దీన్ని పరిగణిస్తారు. అందుకే దీన్ని ‘సిద్ధిటెక్‌ అంటారు. ప్రసిద్ధమైన ఇతిహాసం కలిగిన క్షేత్రం ఇది. తమ జీవితంలో ఒక్కసారైనా ఈ గణపతిని దర్శించుకొని... సిద్ధిని పొందాలని మహారాష్ట్రీయులు ఆకాంక్షిస్తారు. ఇక్కడ వినాయకుడి తొండం కుడివైపు తిరిగి ఉండడం విశేషం. భీమా నదీతీరంలో... చిన్న కొండమీద, చుట్టూ కనువిందు చేసే ప్రకృతి మధ్య ఈ ఆలయం ఉంది.


మహాగణపతి, రంజన్‌గావ్‌

త్రిపురాసుల సంహారానికి వెళ్ళే ముందు గణపతి కోసం శివుడు ఇక్కడ తపస్సు చేశాడట. ఉత్తరాయణ, దక్షిణాయన సంధి కాలంలో సూర్యకిరణాలు నేరుగా స్వామిపై ప్రసరించేలా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. గర్భాలయంలో రెండు మూలవిరాట్టులుంటాయి. ఒకటి చాలా పెద్దది. రెండోది దాని కింద ఒక అరలో ఉంటుంది. ఈ రెండిటినీ భక్తులు దర్శించుకోవచ్చు. వేరే మతాలకు చెందిన రాజులు సాగించిన విధ్వంసానికి గురికాకుండా... ఆ విగ్రహాన్ని అరలో దాచి ఉంచారనేది చారిత్రక కథనం.

విఘ్నహర గణపతి, ఓజర్‌

పూర్వం అభినందనుడనే రాజు గణపతి కోసం చేస్తున్న తపస్సును భంగం చెయ్యడానికి... విఘ్నాసురుణ్ణి ఇంద్రుడు సృష్టించాడు. ఇది తెలిసిన గణపతి ఆ అసురుణ్ణి ఇక్కడ సంహరించి, విఘ్నహర గణపతిగా వెలిశాడు. ఈ ఆలయం కుకుడీ నదీ తీరంలో... తూర్పుకు అభిముఖంగా ఉంటుంది.

చింతామణి గణపతి, తేయూర్‌

మోరయా గోసానీ అనే భక్తుడి తపస్సుకు మెచ్చిన విఘ్నేశ్వరుడు... వ్యాఘ్ర (పులి) రూపంలో ఇక్కడ దర్శనమిచ్చాడట. దానికి చిహ్నంగా... ఈ ఆలయం ముందు వ్యాఘ్ర రూపం కనిపిస్తుంది. కపిలముని ఈ ఆలయాన్ని నిర్మించాడనీ, గణపతికి చింతామణిని సమర్పించాడనీ స్థలపురాణం చెబుతోంది. దేవేంద్రుడు, అంగారకుడు తదితర గ్రహాలు, దేవతలు... గణపతిని అర్చించిన క్షేత్రం ఇది. ఇక్కడ విఘ్నేశ్వరుడు నిత్యం అనేక దివ్యాలంకారాలతో భక్తులకు దర్శనమిస్తాడు.

గిరిజాత్మక గణపతి, లేన్యాద్రి

వినాయకుడి తలని శివుడు ఖండించినప్పుడు పార్వతి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆ దుఃఖాన్ని తొలగించడం కోసం శివుడు గజముఖాన్ని అమర్చి, వినాయకుణ్ణి తిరిగి బతికించాడు. అది జరిగిన ప్రాంతం ఇదేననీ, దానికి సంకేతంగా... గణపతి ఇక్కడ కొండ మీద గజముఖుడిగా, గిరిజాత్మకుడిగా కొలువు తీరాడనీ స్థలపురాణం వివరిస్తోంది. ‘గణేశ పురాణం’లోనూ ఈ ఆలయ ప్రశస్తి ఉంది. ఆలయం ఉన్న కొండ చుట్టూ గుహలు, బౌద్ధుల ఆరామాలు ఉన్నాయి.


భల్లాలేశ్వర గణపతి, పాలీ

భల్లాలుడు అనే బాలుని కోరిక మేరకు భల్లాలేశ్వరుడిగా గణపతి ఇక్కడ వెలిశాడు. ప్రతిరోజూ ఉదయం సూర్యుడి తొలికిరణాలు సభామండపం మీదుగా వచ్చి, గణపతి పాదాలను స్పృశిస్తాయి. ప్రధానమందిరం వెనుక వైపు శ్రీడుండి వినాయక మందిరం ఉంది. ఈ ఆలయం గొప్పతనాన్ని ‘ముద్గల పురాణం’, ‘గణేశ పురాణం’ విశదంగా వివరించాయి.

వరద వినాయకుడు, మహడ్‌

ఇక్కడ వేదకాలం నుంచి గణపతి ఉన్నాడనీ, కొలనులో కొలువైన గణేశుణ్ణి గృత్సమద మహర్షి ‘గణానాం త్వామ్‌...’ అనే వేద మంత్రం ఉపాసించి సాక్షాత్కరింపజేసుకున్నాడనీ, అనంతరం కొలను నుంచి గణపతి విగ్రహాన్ని వెలికి తీసి ప్రతిష్ఠించాడనీ స్థల పురాణం చెబుతోంది. గృత్సమద మహర్షిని గాణపత్య సంప్రదాయానికి తొలి ప్రవక్తగా గాణపత్యులు భావిస్తారు. గర్భాలయంలో స్వయంగా స్వామిని పూజిస్తే వరదానం అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం.

ఈ ఆలయాలన్నీ మహారాష్ట్ర ప్రధాన నగరాల్లో ఒకటైన పుణేకి సమీపంలో ఉన్నాయి. ఈ ఆలయాలు, మూలవిరాట్టులు... పురాణేతిహాస చరిత్ర కలిగినవి. పశ్చిమ కనుమల ప్రకృతి సౌందర్యంతో విలసిల్లుతూ ఉంటాయి. ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ అష్ట వినాయకులను దర్శించుకోవచ్చు.

ఆయపిళ్ళ రాజపాప

Updated Date - Sep 06 , 2024 | 02:12 PM

Advertising
Advertising