Awareness : పని ఒత్తిడి ప్రాణం తీస్తుందా..?
ABN, Publish Date - Sep 24 , 2024 | 05:08 AM
వ్యక్తిత్వం, స్వభావాలను బట్టి పని ఒత్తిడిని భరించే సామర్థ్యం మారుతూ ఉంటుంది. ఒకే మోతాదు పని, ఇద్దరు వ్యక్తుల మీద భిన్నమైన ప్రభావాన్ని కనబరుస్తుంది.
అవేర్‌నెస్
వ్యక్తిత్వం, స్వభావాలను బట్టి పని ఒత్తిడిని భరించే సామర్థ్యం మారుతూ ఉంటుంది. ఒకే మోతాదు పని, ఇద్దరు వ్యక్తుల మీద భిన్నమైన ప్రభావాన్ని కనబరుస్తుంది. ఒకరు సవాలుగా తీసుకుని, సమర్థంగా పనిని సమయానికి ముగించగలిగితే, ఇంకొకరు ఒత్తిడి, ఆందోళనలకు లోనై ఆలస్యంగా పనిని పూర్తి చేయగలుగుతారు. వ్యక్తిగత సమస్యలు, పని ప్రదేశంలో ఎక్కువ గంటల పాటు గడపడం, సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం...
ఇలా ఎన్నో అంశాలు పని ఒత్తిడికి తోడవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎలాగైనా టార్గెట్‌ను అందుకోవాలనే ఆలోచనతో నిద్ర మానుకుని పని చేయడం వల్ల, శరీరం రెట్టింపు ఒత్తిడికి లోనవుతుంది. ఇవన్నీ అంతిమంగా డిప్రెషన్‌కు దారి తీస్తాయి. ఈ కుంగుబాటును ఎవరికి వారు కనిపెట్టలేకపోవడం, కుటుంబసభ్యులు, సహోద్యోగులు పట్టించుకోకపోవడం, సమయానికి అప్రమత్తం అవలేకపోవడం వల్ల, అంతిమంగా పని ఒత్తిడి, ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుంది.
కారణాలు కోకొల్లలు
చేతిలో ఉద్యోగం పోతే మళ్లీ కొత్త ఉద్యోగం సంపాదించుకోవడం కష్టమైపోతున్న పరిస్థితి కొనసాగుతోంది. దాంతో ఎలాగైనా ఉద్యోగంలో కొనసాగాలనే ఒత్తిడి ప్రతి ఒక్కర్లో ఉంటోంది. మరీ ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వాళ్లు పని ఒత్తిడికి తోడు, కొత్త వర్క్ ప్లేస్‌లో సర్దుకుపోగలగడంలో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు.
సహోద్యోగుల సహకారం లోపించడం, పోటీతత్వంతో కూడిన వాతావరణం, అస్పష్టతతో కూడిన ఉద్యోగ అంచనాలు, అదనపు బాధ్యతలు, గుర్తింపుకు నోచుకోలేకపోవడం, పెరిగిన ఊరికి, కుటుంబానికి దూరంగా కొత్త ఊళ్లో ఉండవలసిరావడం, కెరీర్‌నూ, వ్యక్తిగత జీవితాన్నీ సమంగా నిర్వహించలేకపోవడం, ఉద్యోగంలో భాగంగా సామర్ధ్యానికీ, అనుభవానికీ మించిన పని చేయవలసి రావడం లాంటి ఇబ్బందులన్నీ అప్పటికే ఉన్న పని ఒత్తిడికి తోడవుతూ ఉంటాయి.
అయితే కొంతమంది తమలో పెరిగిపోయే ఒత్తిడిని స్వయంగా గ్రహించకపోగా, ఆఫీసు పనిని ఇంట్లో కొనసాగిస్తూ ఒత్తిడిని పెంచుకుంటూ ఉంటారు. ఆఫీసు నుంచి బయటపడినా, మెయిల్స్, వాట్సా్‌పలను చెక్ చేసుకుంటూ, నిరంతరం ఉద్యోగసంబంధ ఆలోచనలు, పని ప్రణాళికలతోనే రోజంతా గడిపేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒత్తిడి నుంచి స్వాంతన పొందే అవకాశమే ఉండదు.
లక్షణాల మీద కన్నేసి...
ఎంత కష్టపడినా, చేయవలసిన పనుల చిట్టా పెరిగిపోతున్నా, పని నుంచి బ్రేక్ తీసుకున్నప్పటికీ అలసట తగ్గకపోతున్నా, పనిని కొనసాగించలేకపోతున్నా, పని ఒత్తిడితో కుంగుబాటుకు (బర్నవుట్) గురవుతున్నట్టు గ్రహించాలి. ఈ బర్నవుట్ కొన్ని లక్షణాల ద్వారా బయల్పడుతూ ఉంటుంది. నిరాశలో కూరుకుపోవడం, ఇతరులతో డిస్కనెక్ట్ అయిపోవడం, ప్రేరణ, శక్తి లోపించడం, ఇతర పనుల మీద ఆసక్తి కోల్పోవడం లాంటి లక్షణాలు దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నట్టు గ్రహించిన వెంటనే అప్రమత్తం కావాలి. మరీ ముఖ్యంగా కొన్ని లక్షణాల మీద ఓ కన్నేసి ఉంచాలి. అవేంటంటే....
పని పట్ల ఆసక్తి సన్నగిల్లడం
తీవ్రమైన అలసట
నిద్రాభంగం
బరువుపెరగడం
నిరాశ, నిస్సహాయతలు
మౌనంగా మారిపోవడం
కోపం, చికాకు పెరగడం
తీవ్రమైన భావోద్వేగాలు
ఒత్తిడితో, గుండెకు చేటు
పని ఒత్తిడి మానసిక ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది. కాబట్టి ఒత్తిడితో మొత్తం ఆరోగ్యం మీద పడే ప్రభావం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అవసరం. తీవ్రమైన ఒత్తిడి శరీరంలో ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజంను ప్రేరేపిస్తుంది. ఫలితంగా గుండె కొట్టుకునే వేగం, రక్తపోటు పెరుగుతాయి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే, హృద్రోగాలు, జీర్ణసంబంధ రుగ్మతలు తలెత్తుతాయి.
ఇమ్యూనిటీ కూడా కుంటుపడుతుంది. ఎక్కువ గంటల పాటు ఒకే చోట కూర్చుని పని చేయడం వల్ల ఊబకాయం, శరీర భంగిమ సమస్యలు కూడా తలెత్తుతాయి. ఎక్కువ పని గంటల వల్ల విశ్రాంతికీ, వ్యాయామానికీ సమయం ఉండకపోవడం, ఇంటి భోజనాలకు బదులుగా జంక్ ఫుడ్‌కు దగ్గరవడం, ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం ధూమపానానికి అలవాటు పడడం, నిద్ర కోసం మద్యాన్ని ఆశ్రయించడం లాంటివన్నీ ఆరోగ్య సమస్యలను పెంచుతాయి.
పరిష్కారాలున్నాయి
మోయలేని బరువును భుజాలకెత్తుకుంటే, ఆ ప్రభావం కచ్చితంగా మనసు, శరీరాల మీద పడుతుంది. ఈ సరళమైన తర్కాన్ని నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల, స్వీయ సామర్ధ్యాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. దాంతో సామర్ధ్యానికి మించిన పనిని నెత్తిన వేసుకుని, సమయానికి పని పూర్తి చేయలేక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కానీ తమ సామర్ధ్యం ఎంతో, ఎంత పనికి పూర్తి న్యాయం చేయగలుగుతారో ఎవరికి వారు తెలుసుకోవాలి. ‘నో’ చెప్పడానికి వెనకాడి, మొహమాటంకొద్దీ పనిని నెత్తిన వేసుకుని, సతమతమైపోయేవాళ్లూ ఉంటారు.
ఇలాంటి వాళ్లు, నేనింత పనిని మాత్రమే చేయలేననీ, ఇంకొకరి సహాయం అవసరమనీ నిర్మొహమాటంగా చెప్పి, పని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలాగే అరుదుగా తప్పనిసరి పరిస్థితుల్లోనే రాత్రి పనికి ఒప్పుకోవాలి. రాత్రి ఉద్యోగాలు చేసేవాళ్లు, పగటి వేళ కంటి నిండా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. భోజన వేళలను కూడా అందుకు తగ్గట్టు సర్దుబాటు చేసుకోవాలి. ధూమపానం, మద్యంతో ఒత్తిడి పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గదనే వాస్తవాన్ని గ్రహించాలి. గంటల తరబడి డెస్క్‌లకే అతుక్కుపోకుండా, మధ్యలో లేచి అటూ ఇటూ నడుస్తూ ఉండాలి. నీళ్లు తాగుతూ ఉండాలి.
వ్యాయామం: వ్యాయామం ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి రోజుకు కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయాలి.
ధ్యానం: ధ్యానం, ప్రాణాయామాలతో మనసు నెమ్మదించి, ఒత్తిడి, ఆందోనలు అదుపులోకొస్తాయి.
సపోర్ట్: సహోద్యోగులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ఒత్తిడిని తగ్గించుకోవాలి.
సరిహద్దులు: నో చెప్పడం అలవాటు చేసుకోవడంతో పాటు, పని ఒత్తిడిని సమన్వయపరుచుకోవాలి.
మహిళల మీద ప్రభావం ఎక్కువ
ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా సమంగా నిర్వహించవలసిన రెట్టింపు ఒత్తిడి మహిళల మీద ఎక్కువగా ఉంటుంది. పైగా నెలసరి సమయంలో తలెత్తే హార్మోన్ల హెచ్చుతగ్గుల ప్రభావం, పని సామర్థ్యాన్ని కుంటుపరచవచ్చు. అలాగే పని ప్రదేశంలో చిన్నా చితకా చివాట్లను సైతం మహిళలు తీవ్రంగా పరిగణించి, మానసికంగా కుంగిపోతూ ఉంటారు. అంచనాలను అందుకోలేక పోయామనే ఆత్మన్యూనతకు లోనయ్యే స్వభావం కూడా మహిళల్లోనే ఎక్కువ. అలాగే ఆఫీసు గందరగోళాన్నంతా ఇంటికి వెంట తెచ్చుకుని, అదే ఆలోచనలతో నిద్రను పాడుచేసుకునే మహిళలూ ఉంటారు. ఇలాంటి వారి మీద ఒత్తిడి, ఆందోళనలు పదింతల ప్రభావాన్ని చూపిస్తాయి.
డాక్టర్ జ్యోతిర్మయి
సీనియర్ కన్సల్టెంట్
సైకియాట్రిస్ట్,
మనహ క్లినిక్, హైదరాబాద్.
Updated Date - Sep 24 , 2024 | 05:14 AM