Navya : త్యాగానికి ప్రతిరూపం బక్రీద్
ABN, Publish Date - Jun 14 , 2024 | 12:19 AM
బక్రీద్- ముస్లింలు జరుపుకొనే అతి పెద్ద పండుగ. ఇస్లాంలో త్యాగానికి ఒక ప్రత్యేకమైన స్థానముంది. ఈ పండుగ ఆ త్యాగానికి ఒక సూచికగా నిలుస్తుంది. అందుకే ఇద్ అల్ అదా అంటే- త్యాగం సందర్భంగా చేసుకొనే విందు అని అర్థం.
సందేశం
బక్రీద్- ముస్లింలు జరుపుకొనే అతి పెద్ద పండుగ. ఇస్లాంలో త్యాగానికి ఒక ప్రత్యేకమైన స్థానముంది. ఈ పండుగ ఆ త్యాగానికి ఒక సూచికగా నిలుస్తుంది. అందుకే ఇద్ అల్ అదా అంటే- త్యాగం సందర్భంగా చేసుకొనే విందు అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరూ ఈ పండుగ జరుపుకోవటం వెనక కదిలించే ఒక కథ ఉంది.
ఇస్లాం సంప్రదాయం ప్రకారం- సుమారు నాలుగువేల సంవత్సరాల క్రితం మక్కా వ్యాలీ (ప్రస్తుతం సౌదీ అరేబియా) ప్రాంతమంతా కొండలతో కూడిన ఎడారిగా ఉండేది. అల్లా తన భక్తుడైన అబ్రహంకు తనపై ఉన్న నమ్మకాన్ని పరీక్షించాలనుకున్నాడు. అబ్రహంను, అతని భార్య హిజార్‌ను, కొడుకు ఇస్మాయిల్‌ను మక్కా ప్రాంతానికి వెళ్లి- అక్కడ భార్య, కొడుకులను వదిలేసి రమ్మని ఆదేశించాడు. అబ్రహం అల్లా ఆజ్ఞ ప్రకారం మక్కా వ్యాలీకి వెళ్లి అక్కడ వారిని వదిలేసి వచ్చాడు. వారికి కొన్ని రోజులకు సరిపడా ఆహారపదార్థాలు, నీళ్లు వదిలి- బరువైన గుండెతో తన స్వస్థలం కానాన్‌కు తిరిగి వెళ్లిపోయాడు. రోజులు గడిచాయి. ఆహారపదార్థాలు, నీళ్లు అయిపోయాయి. దీనితో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో హిజార్ తమను రక్షించమని అల్లాను ప్రార్థించింది. ఊహించని విధంగా ఒక అద్భుతం జరిగింది. ఇస్మాయిల్ కాళ్ల దగ్గర నుంచి ఒక నీటి ప్రవాహం ఉవ్వెత్తున ఎగసింది. దీనితో వారి కష్టాలు తీరిపోయాయి. ఇలా కొన్నేళ్లు సాగిన తర్వాత- అబ్రహంను మక్కా వ్యాలీకి వెళ్లమని.. అక్కడ ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించమని అల్లా ఆజ్ఞాపించాడు. అబ్రహం, ఇస్మాయిల్ - కాబా ప్రాంతంలో ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. అయితే దీని నిర్మాణం కూడా అంత సులభంగా జరగలేదు. ఈ మందిరాన్ని నిర్మించకుండా సైతాన్ అడ్డుపడ్డాడు. అప్పుడు ఇస్మాయిల్ ఆ సైతాన్‌ను గులకరాళ్లు విసరటం ద్వారా తరిమేశాడు. ఈ రోజుకు ఇస్లాంలో సైతాన్‌ను తరిమివేయటానికి గులకరాళ్లను విసరటం ఒక ప్రధానమైన ఘట్టం.
మరో పరీక్ష..
అబ్రహంకు 99 ఏళ్లు వచ్చాయి. ఆ సమయంలో అల్లా - ఇస్మాయిల్‌ను బలి ఇవ్వమని - మరో పరీక్ష పెట్టాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకును బలి ఇవ్వటానికి ఏ తండ్రికి మనసు ఒప్పుతుంది? కానీ అబ్రహం మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఇస్మాయిల్‌ను బలి ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు. అయితే బలి కావటానికి ఇస్మాయిల్ అంగీకారం కూడా అవసరమే కదా! ఎందుకంటే- అల్లా పట్ల ఇస్మాయిల్‌కు ఉన్న నమ్మకానికి.. తన జీవితాన్ని త్యాగం చేయటానికి అంగీకరించటానికి ఇది ఆఖరి పరీక్ష. ఇస్మాయిల్‌కు బలి విషయం చెప్పినప్పుడు అతను ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ‘‘అల్లా నీకు ఇచ్చిన ఆజ్ఞ శిరోధార్యం. ఏ మాత్రం ఆలోచించకు’’ అని బలికి సిద్ధపడ్డాడు. అబ్రహం కత్తితో ఇస్మాయిల్ తల నరకటానికి ప్రయత్నించాడు. అక్కడ మరో అద్భుతం జరిగింది. ఇస్మాయిల్‌కు ఎటువంటి హాని జరగలేదు. కింద ఒక కొండ జంతువు తల పడి కనిపించింది.
అబ్రహం, ఇస్మాయిల్ - తమకు అల్లా పట్ల ఉన్న విశ్వాసాన్ని చాటుకోవడానికి బలికి సిద్ధపడి ప్రపంచానికి తెలియజేశారు. అయితే కరుణామయుడైన అల్లా తన భక్తులను శిక్షించడు. ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. అయితే భక్తుల విశ్వాసం ఎంత ఉందో తెలుసుకోవటానికి పరీక్షలు పెడుతూనే ఉంటాడు. అబ్రహం, ఇస్మాయిల్‌లు- ఇస్లాం చరిత్రలో విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా నిలుస్తారు. వారి త్యాగానికి గుర్తుగా- ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిములందరూ ఈ పండుగను జరుపుకుంటారు. దీనితో పాటు కొందరు- ఖురాన్ పూర్తయి.. మానవాళికి అందిన రోజుగా బక్రీద్‌ను భావించి పండుగ చేసుకుంటారు. అల్లాకు ప్రార్థనలు చేస్తారు.
(16న ‘బక్రీద్’)
Updated Date - Jun 14 , 2024 | 12:19 AM