ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deepali Deshpande : పడి లేచిన కెరటం

ABN, Publish Date - Aug 24 , 2024 | 05:38 AM

క్రీడాకారిణిగా విజయాలు, వైఫల్యాలే కాదు... కోచ్‌గా అవమానాలు, ఛీత్కారాలు కూడా చూశారు దీపాలి దేశ్‌పాండే. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ రైఫిల్‌ షూటింగ్‌ జట్టు దారుణ వైఫల్యం, ఆ తరువాత కోచ్‌గా తనను తొలగించడం ఆమెను మానసికంగా కుంగదీసింది. దాని నుంచి బయటపడి, సర్వశక్తులూ కూడదీసుకొన్నారు. నిన్నటి ఒలింపిక్స్‌లో... దీపాలి శిష్యుడు స్వప్నిల్‌ కుశాలె గెలిచిన కాంస్యం... కోచ్‌గా ఆమె స్థాయిని చాటి చెప్పింది.

క్రీడాకారిణిగా విజయాలు, వైఫల్యాలే కాదు... కోచ్‌గా అవమానాలు, ఛీత్కారాలు కూడా చూశారు దీపాలి దేశ్‌పాండే. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ రైఫిల్‌ షూటింగ్‌ జట్టు దారుణ వైఫల్యం, ఆ తరువాత కోచ్‌గా తనను తొలగించడం ఆమెను మానసికంగా కుంగదీసింది. దాని నుంచి బయటపడి, సర్వశక్తులూ కూడదీసుకొన్నారు. నిన్నటి ఒలింపిక్స్‌లో... దీపాలి శిష్యుడు స్వప్నిల్‌ కుశాలె గెలిచిన కాంస్యం... కోచ్‌గా ఆమె స్థాయిని చాటి చెప్పింది.

‘‘విజయాన్ని ఆస్వాదించినంత సులువుగా వైఫల్యాన్ని స్వీకరించలేం. కానీ క్రీడల్లోనే కాదు, జీవితంలో కూడా వైఫల్యాలు ఎదురవుతూనే ఉంటాయి. ఎంత త్వరగా వాటి ప్రభావం నుంచి తేరుకున్నామన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది’’ అంటారు దీపాలి దేశ్‌పాండే. ముంబయిలో పుట్టి పెరిగిన ఈ ఆర్కిటెక్చర్‌ గ్రాడ్యుయేట్‌ను రైఫిల్‌ షూటింగ్‌ అమితంగా ఆకర్షించింది.

తీవ్ర సాధన చేసి... పలు పోటీల్లో తన నైపుణ్యాన్ని చాటారు. 2004 ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షి్‌పలో రజత పతకం సాధించారు. అదే ఏడాది ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున పోటీ పడ్డారు. క్రీడాకారిణిగా బరిలో నుంచి క్రమంగా తప్పుకొని... కోచింగ్‌ మీద దృష్టి సారించారు. ‘నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎన్‌ఆర్‌ఎఐ)లో పదేళ్ళపాటు సీనియర్‌ కోచ్‌గా వ్యవహరించారు. ఎంతోమంది యువ షూటర్స్‌ ప్రతిభకు మెరుగులు దిద్దారు. కానీ టోక్యో ఒలింపిక్స్‌ తరువాత ఆమెకు తీవ్ర అవమానాలు ఎదురయ్యాయి.


  • ఆ రోజులు పెద్ద పీడకల...

‘ఒలింపిక్స్‌లో ఏ క్రీడాంశంలోనైనా విఫలం కావచ్చు కానీ... షూటింగ్‌లో మాత్రం భారత్‌కు పతకం పక్కా’ అనే నమ్మకం ఒకప్పుడు ఉండేది. 2004 నుంచి 2012 వరకూ... మూడు ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యం గెలిచిన చరిత్ర మనది. కానీ 2016 రియో ఒలింపిక్స్‌కు ఎన్నో ఆశలతో వెళ్ళిన భారత షూటర్స్‌ బృందం ఉత్తచేతులతో తిరిగొచ్చింది.

ఈ నేపథ్యంలో మాజీ షూటర్స్‌ దీపాలి దేశ్‌పాండే, జస్పాల్‌ రాణాలతో యువ షూటర్లకు ఎన్‌ఆర్‌ఎఐ ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. 2018లో ప్రపంచకప్‌ పోటీల్లో గొప్పగా రాణించిన భారత షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌లో తేలిపోయారు. దాంతో కోచింగ్‌ సిబ్బందిని మార్చడానికి ఎన్‌ఆర్‌ఎఐ సిద్ధపడింది. ఆరుగురు కోచ్‌లు తమ కాంట్రాక్ట్‌లు నిలబెట్టుకున్నారు. దీపాలి బయటకు రావలసి వచ్చింది. ఇది ఆమె మానసిక ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. ‘‘మెలకువగా ఉన్నంతసేపూ అవే ఆలోచనలు. నాకేమవుతోందో అర్థమయ్యేది కాదు.

ఇంటినుంచి ట్రైనింగ్‌ సెంటర్‌కు బయలుదేరి... ఎటో వెళ్ళిపోయేదాన్ని. కొంతసేపటికి ఆలోచనల్లోంచి బయటపడ్డాక... నేను నా గమ్యానికి వ్యతిరేక దిశలో... చాలా దూరంగా వచ్చానని అర్థమయ్యేది. ఇలా పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు జరిగింది. ఎన్నో ఏళ్ళుగా నేను ప్రయాణిస్తున్న మార్గంలో డ్రైవ్‌ చేస్తున్నప్పుడే నా ఆలోచనలు స్తంభించిపోతున్నాయంటే... నాలో ఏదో తేడా జరుగుతోందని గ్రహించాను’’ అన్నారు దీపాలి.

పరిస్థితి మరీ ముదిరిపోకుండా దిద్దుబాటు చర్యలను వెంటనే తీసుకున్నారు. ‘‘షూటర్స్‌కు ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉండాలి. కానీ ఒక దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నప్పుడు... మిగిలిన విషయాలను పెద్దగా పట్టించుకోకపోవడం, మరచిపోవడం సాధారణంగానే జరుగుతూ ఉంటుంది. అది మతిమరపుగా మారితే ప్రమాదం.


షూటింగ్‌ కాకుండా డ్రాయింగ్‌, ట్రెక్కింగ్‌, పెయింటింగ్‌ నా అభిరుచులు. అవి కూడా ఆ సమయంలో నాకు గుర్తుకురాలేదు. అదృష్టవశాత్తూ... నాకు మంచి కుటుంబం ఉంది. అన్ని విషయాలను మేము కలిసి చర్చించుకుంటాం. వారి సలహాతో యోగా, వ్యాయామం మళ్ళీ ప్రారంభించాను. క్రమం తప్పకుండా కొనసాగించాను. ఆ రోజులు నా జీవితంలో పెద్ద పీడకల’’ అంటారు దీపాలి.

  • అది నా అదృష్టం...

అయితే దీపాలి దగ్గర శిక్షణ పొందుతున్న షూటర్స్‌కు ఆమెపై అపారమైన నమ్మకం ఉంది. తమకు వ్యక్తిగత కోచ్‌గా ఆమే ఉండాలని పట్టుపట్టారు. ‘‘వారు నా పక్షాన ఉండడం నా అదృష్టం. నేను త్వరగా కోలుకోవడానికి వాళ్ళు కూడా కారణం. వారు టీనేజ్‌లోకి రాకముందు నుంచీ చూస్తున్నాను.

అందరూ నా బిడ్డల్లాంటివారు’’ అని ఆమె చెప్పారు. ఇక సంస్థలకు కాకుండా... షూటర్లకు వ్యక్తిగత కోచ్‌గా ఉండాలనీ, ప్యారిస్‌ ఒలింపిక్స్‌ మీద దృష్టి కేంద్రీకరించాలనీ దీపాలి నిర్ణయించుకున్నారు. కానీ మళ్ళీ ఎదురుదెబ్బ తగలకూడదంటే... ప్రణాళికలు మరింత కచ్చితంగా ఉండాలని ఆమెకు తెలుసు.

‘‘ప్రపంచం మీద కొవిడ్‌ విరుచుకుపడడానికి ముందు... 2019 డిసెంబర్‌లో భారత రైఫిల్‌ షూటింగ్‌ సీనియర్‌ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాను. అప్పట్లో నేను వేసుకున్న ప్రణాళికలు ఫలితాన్ని ఇవ్వలేదు.


దానికి కారణాలేమిటి? కొవిడ్‌ కారణంగా యువ షూటర్లలో మానసికంగా ఒత్తిడి ఏర్పడి, వాళ్ళ సామర్థ్యం దెబ్బతిందా? వాళ్ళ సామర్థ్యాన్ని మరీ ఎక్కువగా ఊహించుకున్నామా? లేదంటే... ఒలింపిక్స్‌ వాయిదా కారణంగా మరీ ఎక్కువ కాలం శిక్షణ శిబిరంలో ఉండడం వారి ప్రదర్శన మీద ప్రభావం చూపించిందా? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు తెలుసుకోవాలని ప్రయత్నించాను’’ అని చెప్పారు.

దీపాలి. ఏం చేయాలనే స్పష్టత వచ్చాక... ఆమె వెనుతిరగలేదు. తనను నమ్మి వచ్చిన యువ షూటర్లకు కఠినమైన శిక్షణ ఇచ్చారు. వారందరూ ప్యారిస్‌ ఒలింపిక్స్‌ కోటాలో ఎంపికయ్యారు. అయితే ఇద్దరు ట్రయల్స్‌లో వెనుకపడగా... నలుగురు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు.


  • ఆ బాధ పోయింది...

షూటర్‌ స్వప్నిల్‌ కుశాలె 60 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం అందుకున్నాడు. ఈ విభాగంలో భారత్‌ పతకం సాధించడం ఇదే తొలిసారి. ‘‘ఈ ఘనత ఎవరికైనా దక్కాలంటే... అది నా కోచ్‌ దీపాలికే’’ అంటూ తను గెలిచిన పతకాన్ని స్వప్నిల్‌ ఆమె చేతికి అందించినప్పుడు... ఆమె ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. ‘‘అర్జున్‌ బబుతా కనీసం రజత పతకం సాధిస్తాడనుకున్నాను. కొద్దిలో కాంస్య పతకాన్ని కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచాడు.

కానీ అది చిన్న విషయం కాదు. టోక్యో ఒలింపిక్స్‌ నాటికి భారత జట్టుకు నేను అత్యున్నతస్థాయి రైఫిల్‌ కోచ్‌గా ఉన్నాను. కానీ ఆ తరువాత ఎలాంటి ఉద్యోగం లేకుండా మిగిలిపోయాను. నన్ను మాత్రమే తొలగించినందుకు ఎంతో బాధపడ్డాను. కానీ కుశాలె పతకంతో ఆ బాధ తొలగిపోయింది.

ఇదంతా ఉద్యోగం పోయినందుకు మాత్రమే కాదు... నేనిక పనికిరాననే భావనకు ఆ సంఘం వచ్చినందుకు. క్రీడాకారులు ఓడిపోయినా... వారిని కాపాడడానికి ఎవరో ఒకరుంటారు. కోచ్‌ల మీద కనీసమైన సానుభూతి కూడా ఎవరూ చూపించరు. వైఫల్యముద్రతో జీవితాంతం బతకాల్సిందే. ఇప్పడు ఆ ముద్ర పోయినందుకు సంతోషంగా ఉంది’’ అంటున్నారు 55 ఏళ్ళ దీపాలి.

Updated Date - Aug 24 , 2024 | 05:38 AM

Advertising
Advertising
<