ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bathukamma Special: శ్రీగౌరి నీ పూజ ఉయ్యాలో...

ABN, Publish Date - Sep 27 , 2024 | 05:32 AM

ఆశ్వయుజ మాసం శరద్రుతువులో తొలి మాసం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దుర్గా నవరాత్రులు ప్రారంభమవుతాయి. అంతకు ఒక రోజు ముందుగానే... అంటే భాద్రపద అమావాస్య నాటి నుంచే బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి.

విశ్వం అంతా శక్తిమయం. ప్రకృతే పరాశక్తి. ఆ మాత అనేక రూపాల్లో అభివ్యక్తమవుతుంది. దుర్గగా, గౌరిగా... ఇలా ఎన్నో విధాలుగా పూజలందుకుంటుంది. గౌరిగా ఆరాధించే రూపానికి ప్రతిరూపమే బతుకమ్మ.

ఇది తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వేడుక.

శ్వయుజ మాసం శరద్రుతువులో తొలి మాసం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దుర్గా నవరాత్రులు ప్రారంభమవుతాయి. అంతకు ఒక రోజు ముందుగానే... అంటే భాద్రపద అమావాస్య నాటి నుంచే బతుకమ్మ సంబరాలు మొదలవుతాయి. ఇది ప్రకృతిని ఆరాధించడానికి అనువైన మాసం. పరిసరాలన్నీ శోభాయమానంగా ఉంటాయి. చంద్రుడు షోడశ కళలతో చల్లని వెన్నెల కురిపిస్తాడు. రంగురంగుల పూలతో చెట్లు కనువిందు చేస్తాయి. వాటి సువాసనలతో గాలి గుబాళిస్తూ ఉంటుంది. అర్చనలో పూలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ పూలనే బతుకమ్మగా ఆరాధించడం విలక్షణమైన సంస్కృతి.

కైలాసంలో మెట్టినింట ఉన్న గౌరిని (పార్వతిని) మహాలయ అమావాస్యకు ముందుగానే పుట్టినింటికి ఆహ్వానిస్తారు. మహాలయ అమావాస్యనాడు గౌరిని యథావిధిగా అలంకరించినా... ఆ రోజు పితృ అమావాస్య కాబట్టి... పితృదేవతలకు నివేదనలు ప్రధానం కనుక ఆ రోజు ప్రత్యేక పూజలు ఉండవు. వరిపిండిలో నువ్వులు, బెల్లం కలిపిన పదార్థాన్ని బతుకమ్మకు నైవేద్యం పెడతారు. ముందురోజు సేకరించిన పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు కాబట్టి... తొలి రోజున గౌరీదేవిని ‘ఎంగిలి పూల బతుకమ్మ’ అని వ్యవహరిస్తారు. బతుకమ్మ పుట్టు పూర్వోత్తరాల గురించి ఎన్నో కథలు పాటల రూపంలో ఉన్నాయి. పూర్వం ధర్మాంగదుడనే రాజు ఉండేవాడనీ, అతను, అతని భార్య సత్యవతి శివ భక్తులని, ఆ దేవదేవుడి అనుగ్రహంతో జన్మించిన కుమార్తెకు ‘బతుకమ్మ’ అని పేరు పెట్టుకున్నారనీ ఒక కథ ఉంది.


ఈ సంబరాల్లో ప్రతి రోజూ మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను తయారు చేస్తారు. రోజుకో విధమైన నివేదనలు సమర్పిస్తారు. చెరువులు, కుంటల దగ్గర బతుకమ్మలతో చేరుకుంటారు. వాటిని పేర్చి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. ఆఖరి రోజున బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. బతుకమ్మను పేర్చడానికి పూల సేకరణను తెల్లవారుజామునే ప్రారంభిస్తారు. బంతి, చామంతి, గునుగు, గుమ్మడి, తంగేడు... ఇలా ఎన్ని పూలు ఉన్నా తంగేడుకే ప్రాధాన్యం. ఇది పసుపు వర్ణంలో ఉంటుంది. పసుపు అయిదవ తనానికి సంకేతం. అలాగే పసుపును ముద్దగా చేసి, గోపురం రూపంలో నిర్మించి, దాని మధ్యలో నొక్కి రెండు శిఖరాలుగా చేస్తారు.

అది అర్థనారీశ్వరులకు సంకేతం. ఆ గోపురం చుట్టూ పూల దండలను అలంకరిస్తారు. రోజుకో నైవేద్యాన్ని పెడతారు. ‘తీరొక్క పువ్వేసి, తీరొక్క కూర్పుగా ఉయ్యాలో’ అంటూ బతుకమ్మల కూర్పును, పేర్పును ప్రస్తావిస్తారు. ‘చిక్కుడూ ఆకులో ఉయ్యాలో... సద్దులు పెట్టేము ఉయ్యాలో’ అంటూ నైవేద్యాల విశేషాలను వివరిస్తారు. వేడుకల్లో చివరి రోజైన ఆశ్వయుజ శుద్ధ అష్టమి నాడు గౌరిని మెట్టినింటికి పంపే సంరంభం వైభవంగా జరుగుతుంది. ఇంటి ఆడపడుచులకు ఒడిబియ్యం పోసి, చీరసారెలతో మెట్టినింటికి పంపినట్టు... బతుకమ్మను సాగనంపుతారు.


శ్రీగౌరి నీ పూజ ఉయ్యాలో - చిత్తములో తలతుమమ్మ ఉయ్యాలో

మా లక్ష్మి మా గౌరి ఉయ్యాలో - పోయి రావమ్మ ఉయ్యాలో

కైలాసగిరివాసి ఉయ్యాలో - శంకరీ పార్వతీ ఉయ్యాలో

... అంటూ బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు చెబుతారు. అష్టమినాటి చంద్రకళలు ప్రసరిస్తూ ఉండగా... బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. అంతటితో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. ఇది పూల పండుగ. ఆడపిల్లల పండుగ, అక్కచెల్లెళ్ళ పండుగ, అమ్మ అమ్మమ్మల పండుగ. అందరికీ ఆటా పాటా నేర్పే పండుగ. సంగీత, సాహిత్య, నాట్యాల మేళవింపుగా... వర్ణ, వర్గ విచక్షణ లేకుండా సమైక్యతను చాటి చెప్పే పండుగ.

ఆయపిళ్ళ రాజపాప

(అక్టోబర్‌ 2 నుంచి బతుకమ్మ పండుగ)

Updated Date - Sep 27 , 2024 | 05:40 PM