అయినా మనిషి మారలేదు!
ABN, Publish Date - Dec 20 , 2024 | 06:40 AM
ప్రపంచ చరిత్ర అంతటా ఎందరో సంస్కర్తలు, మతప్రవక్తలు మానవుణ్ణి సంస్కారవంతుడిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించారు.
ప్రపంచ చరిత్ర అంతటా ఎందరో సంస్కర్తలు, మతప్రవక్తలు మానవుణ్ణి సంస్కారవంతుడిగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించారు. సమాజంలో అన్యాయం వల్ల అలమటిస్తున్న ప్రజానీకం బతుకులను బాగుపరచడానికి పాటుపడ్డారు. కానీ రాతియుగంలో బతికిన మనిషికి, ఈనాటి మనిషికి మధ్య ఏమాత్రం భేదం లేదని అనడం అతిశయోక్తి కాదు. ఎన్నో వేల సంవత్సరాల పరిణామం తరువాత కూడా మనిషిలో అదే స్వార్థం, అసూయ, ద్వేషం, క్రౌర్యం, నిర్దయ. బుద్ధుడు, మహావీరుడు ప్రసాదించిన ప్రవచనాల ప్రభావం మనిషిమీద కాస్తయినా కనిపించదు. వారు బోధించిన సత్యం, అహింసల ప్రేరణతో... ప్రజలను కూడగట్టి, తెల్ల దొరలను మన దేశం నుంచి పారద్రోలారు మహాత్మా గాంధీ. కానీ 1947లో జరిగిన దారుణమైన మతకలహాలు, వాటి వల్ల లక్షలాది మంది ప్రజలు బలి కావడం మహాత్ముడికి ఎంత దుఃఖం కలిగించాయంటే... అలాంటి పరిస్థితుల్లో మరణమే మేలనుకున్నారు. విశ్వ మానవ స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆశయాలతో ప్రారంభమైన ఫ్రెంచి విప్లవం... దానికి భిన్నంగా మనిషిలో దాగి ఉండే హద్దులు లేని క్రౌర్యాన్ని బహిర్గతం చేసి, వేలాది ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. ‘‘ఆశయాలు ఉత్కృష్టమైనవి అయినా, అవి మనిషిలోని నీచత్వాన్ని, క్రౌర్యాన్ని, అవినీతిని తగ్గించవు. మనిషిని కొంచమైనా మార్చలేవు’’ అని జిడ్డు కృష్ణమూర్తి చాటి చెప్పే సత్యానికి రష్యన్ విప్లవం ఒక తిరుగులేని రుజువు.
సంపూర్ణ చర్య
సంస్కరణలు, విప్లవాలు ఎందువల్ల విఫలమవుతాయి? అన్ని ఉద్యమాల వెనుక ఆశయాలు, భావాలు, నిర్వచనాలు ఉంటాయి. ఇవన్నీ వర్తమానంలో ఉండే పరిస్థితులను బాగుపరచాలనుకొనే ఆలోచనలు. ప్రతి ఆలోచన గతంతో ముడిపడి ఉంటుంది. మనం ఏ ఆలోచనను విశ్లేషించి చూసినా ఆ విషయం అర్థమవుతుంది. గతంలో ఉద్భవించి, గతంలోనే పరిభ్రమించే ఆలోచనలకు, వాటిద్వారా ప్రేరేపితం అయ్యే చేతలకు వర్తమానాన్ని మార్చే దక్షత ఉండదు. సంస్కర్తల, విప్లవకారుల ఆశయాలు, వారి వ్యూహాలు... గతంలో చిక్కుకుపోయిన ఆలోచనలు. గతంలో పుట్టి, వర్తమానాన్ని మార్చాలని అనుకొనే చేతలను ‘ఖండిత చర్యలు’ అంటారు కృష్ణమూర్తి. అవి పరస్పరం ఖండించుకుంటూ, గతానికీ, వర్తమానానికీ మధ్య జరిగే ఘర్షణలో శక్తిని కోల్పోతాయి. సంపూర్ణ చర్య దీనికి భిన్నమైనది. అది వర్తమానంలో పుడుతుంది. మనిషిని క్షణంలో, సంపూర్ణంగా మారుస్తుంది. ‘‘అలాంటి అంతర్పరివర్తన జరిగిన వ్యక్తులు పదిమందైనా చాలు, ఈ ప్రపంచాన్ని ఆమూలాగ్రం మార్చడానికి’’అన్నారు కృష్ణమూర్తి.
ఆలోచనా ప్రక్రియను అర్థం చేసుకోవాలి...
‘సంస్కరణలు విప్లవాలు మనిషిని, సమాజాన్ని మార్చగలవా?’ అనేది కాదు అసలు ప్రశ్న. మనిషి గతంలో పరిభ్రమిస్తున్న ఆలోచనలను వదిలించుకొని, వర్తమానాన్ని దర్శించగలడా? గతాన్ని సంపూర్ణంగా అధిగమించిన దృక్పథానికి ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉంటుంది. అంటే ‘గతం, వర్తమానం, భవిష్యత్తు... ఇలా కాలం అంటే ఏమిటి? అది ఎలా ఉద్భవిస్తుంది? ఆలోచన గతంతో ఎలా ముడిపడి ఉంది?’ అనే విషయాలను మనిషి ప్రప్రథమంగా అర్థం చేసుకోవాలి. అలాగే ‘ఆలోచించడం’ అనే ప్రక్రియని కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి. గతం ప్రభావంలో ఉండే ఆలోచన తెలివిని అంటే ప్రజ్ఞను ఉపయోగించుకుంటుంది. అందువల్ల తెలివి పరిమితం అవుతుంది. ఆలోచన తనను తానే ఖండించుకుంటుంది. అలాకాకుండా, మనిషి గతాన్ని నిశ్శేషంగా అధిగమించినప్పుడు... చైతన్యంలో అఖండమైన ప్రజ్ఞ ఉదయించి, ఆలోచన స్వభావం పూర్తిగా మారిపోతుంది. అనంతమైన, నిత్యనూతనమైన ఒక శక్తి విడుదలై... ఆలోచనను వినియోగిస్తుంది. ఈ ప్రక్రియను ‘ప్రజ్ఞ యొక్క జాగృతి’ అంటారు కృష్ణమూర్తి. ఇక్కడ కృష్ణమూర్తి చేసిన చర్చ... పతంజలి యోగ సూత్రాలమీద తెలిసో తెలియకో ఆయన చెప్పే ఒక భాష్యం. ఇదొక గమ్మత్తు. కృష్ణమూర్తిని కూలంకషంగా అర్థం చేసుకుంటే... పతంజలి యోగ సూత్రాలు అర్థమవుతాయి. పతంజలి యోగసూత్రాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే... కృష్ణమూర్తి గొడవ ఏమిటో తెలుస్తుంది.
గుంటూరు వనమాలి
Updated Date - Dec 20 , 2024 | 06:40 AM