Good Food : బి12 లోపిస్తే?
ABN, Publish Date - Oct 22 , 2024 | 05:43 AM
శాకాహారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య బి12 లోపం. కొన్ని స్పష్టమైన లక్షణాల రూపంలో ఈ లోపం బయటపడుతూ ఉంటుంది. వాటిని గమనిస్తూ, వైద్యుల సూచన మేరకు బి12ను భర్తీ చేస్తూ ఉండాలి.
గుడ్ ఫుడ్
శాకాహారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య బి12 లోపం. కొన్ని స్పష్టమైన లక్షణాల రూపంలో ఈ లోపం బయటపడుతూ ఉంటుంది. వాటిని గమనిస్తూ, వైద్యుల సూచన మేరకు బి12ను భర్తీ చేస్తూ ఉండాలి.
నాడుల ఆరోగ్యం, ఎర్ర రక్తకణాల ఉత్పత్తి, మెదడు పనితీరులకు బి12 అవసరం. ఈ విటమిన్ లోపిస్తే, పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. భిన్నమైన లక్షణాలు, మూల కారణాన్ని కచ్చితంగా కనిపెట్టే వీలు లేకుండా, అయోమయానికి గురి చేస్తాయి. కాబట్టి బి12 లోపంతో తలెత్తే లక్షణాల మీద అవగాహన ఏర్పరుచుకోవడం అవసరం.
చేతుల్లో, పాదాల్లో చిత్రమైన సమస్య
విటమిన్ బి12 లోపం ప్రారంభంలో చేతుల్లో, పాదాల్లో సూదులతో పొడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ చిత్రమైన లక్షణానికి కారణం బి12 లోపం మూలంగా, నాడీ కణాలు సమర్థంగా పని చేయకపోవడమే! ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే, నాడులకు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చేతుల్లో, పాదాల్లో సూదులతో గుచ్చుతున్నట్టు అనిపిస్తే, వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.
గుండె దడ దడ
విటమిన్ బి12 తగ్గితే, రక్తంలో ఆక్సిజన్ మోతాదు కూడా తగ్గుతుంది. దాంతో రక్తాన్ని సరఫరా చేయడం కోసం గుండె అవసరానికి మించి కష్టపడవలసి వస్తుంది. దాంతో గుండె దడ పెరుగుతుంది. అకస్మాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టినా, గుండె వేగంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నా బి12 లోపంగా భావించాలి.
పాలిపోయిన చర్మం
నవనవలాడే చర్మం ఆరోగ్య లక్షణం. కానీ బి12 లోపంతో బాధపడే వ్యక్తుల చర్మం పాలిపోయి, జీవం కోల్పోతుంది. ఇందుకు కారణం ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గడమే! రక్తకణాల ఉత్పత్తికి బి12 దోహదపడుతుంది. ఈ విటమిన్ లోపిస్తే, రక్తలేమి తలెత్తి, చర్మం పాలిపోతుంది. ఈ విటమిన్ లోపంతో ఎర్ర రక్త కణాలు ఛిద్రమైపోతూ ఉంటాయి. దాంతో చర్మం లేత పసుపు రంగులోకి మారుతుంది. ఇలా చర్మం అకారణంగా రంగు మారితే, విటమిన్ బి12 లోపంగా గ్రహించాలి.
నోట్లో పుండ్లు
విటమిన్ బి12 ఆరోగ్యకరమైన కణ నిర్మాణానికి సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల, నోట్లో తరచూ పుండ్లు ఏర్పడుతూ, తగ్గడానికి ఎక్కువ సమయం పడుతూ పడుతూ ఉంటుంది. అలాగే పుండ్లు తరచూ తిరగబెడుతూ ఉంటాయి. ఇలా పెదవులు, బుగ్గల లోపల పుండ్లు తలెత్తుతూ ఉంటే, విటమిన్ బి12 లోపంగానే పరిగణించాలి.
ఇబ్బంది పెట్టే చలి
రక్తంలో ఆక్సిజన్ మోతాదు తగ్గడం వల్ల చర్మంలోని రక్తనాళాలకు సరిపడా ఆక్సిజన్ అందక చలి పెరుగుతుంది. ఇతరులకు సౌకర్యంగా ఉన్న తాపమానం, మనల్ని అసౌకర్యానికి గురి చేస్తోందంటే విటమిన్ బి12 లోపంగా భావించాలి. చల్లదనాన్ని తట్టుకోలేకపోవడం, తక్కువ తాపమానాలను ఏమాత్రం తట్టుకోలేకపోవడం బి12 లోపంలో కనిపించే ప్రధాన లక్షణం.
Updated Date - Oct 22 , 2024 | 05:43 AM