Cooking Tips : ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి
ABN, Publish Date - Oct 19 , 2024 | 05:26 AM
ఈ మధ్యకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినాలనుకొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాంటి వారి కోసం కొన్ని వంటలు అందిస్తున్నాం.. ఆస్వాదించండి..
వంటిల్లు
ఈ మధ్యకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినాలనుకొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాంటి వారి కోసం కొన్ని వంటలు అందిస్తున్నాం.. ఆస్వాదించండి..
క్యాబేజీ దాల్ పరాటా
కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి - ఒక కప్పు, క్యాబేజీ తురుము- ఒక కప్పు, పెసరపప్పు- మూడు స్పూనులు, సోంపు- ఒక టేబుల్ స్పూను, సన్నటి ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, తరిగిన పచ్చి మిర్చి ముక్కలు- ఒక టేబుల్ స్పూను, సన్నగా తరిగిన పుదీనా- రెండు స్పూనులు, పసుపు- పావు స్పూను, నూనె- తగినంత, నీళ్లు- తగినన్ని
తయారీ విధానం
పరాటా కోసం : గోధుమ పిండిలో ఒక స్పూను నూనె, కొద్దిగా ఉప్పు వేసి - నీళ్లు పోసి కలపాలి. ఈ పిండి పలుచగా ఉండకూడదు. అలాగని పూరీ పిండిలా బాగా గట్టిగా కూడా ఉండకూడదు. దీనిని ఒక బేసిన్‌లో పెట్టి తడిగుడ్డ కప్పి 15 నిమిషాలు ఉంచాలి.
స్టఫింగ్ కోసం
ఒక మూకుడులో నూనె వేసి సోంపు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత దానిలో పచ్చి మిర్చి ముక్కలు, క్యాబేజీ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి.
ఆ తర్వాత పెసరపప్పు, పుదీనా, పసుపు కూడా వేసి మగ్గనివ్వాలి. మధ్యలో కొద్దిగా నీళ్లు చల్లాలి. బాగా మగ్గిన తర్వాత చల్లార్చాలి.
చివరగా..
గోధుమ పిండిని గుండ్రంగా ఒత్తాలి. దాని మధ్యలో స్టఫింగ్ పెట్టి - గుండ్రంగా ఉండలా చేయాలి.
ఈ ఉండను చేతితో కానీ అప్పడాల కర్రతో కానీ ఒత్తుకోవాలి. దానిని పెనంపై కొద్దిగా నూనె రాసి కాల్చాలి.
జాగ్రత్తలు
స్టఫింగ్ బాగా ముద్దగా ఉండకూడదు. పొడిగా ఉంటేనే పరాటా బావుంటుంది.
స్టఫింగ్ పెట్టిన తర్వాత పరాటాను గట్టిగా ఒత్తకూడదు. ఒత్తితే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది.
బెండకాయ పెరుగు కూర
కావాల్సిన పదార్థాలు:
బెండకాయలు (250గ్రాములు), పెద్ద టమోటాలు- రెండు, పెరుగు (ఒక కప్పు), ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక స్పూను, శనగపిండి- మూడు స్పూన్లు, జీలకర్ర- అర స్పూను, ధనియాల పొడి- అర స్పూను, కాశ్మీరీ కారం- ఒక స్పూను, పసుపు- పావు స్పూను, గరం మసాలా- ఒక స్పూను, క్రీమ్- రెండు స్పూనులు, నూనె- నాలుగు స్పూనులు, నెయ్యి- ఒక స్పూను, మెంతి పొడి- పావు స్పూను, జీడిపప్పులు- 10, తరిగిన కొత్తిమీర- ఒక స్పూను, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని
తయారీ విధానం
బెండకాయలను బాగా కడిగి.. తుడిచి.. చిన్న ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలను ఒక మూకుడులో రెండు స్పూన్ల నూనెలో వేసి మూత పెట్టాలి. పది నిమిషాల తర్వాత ఈ ముక్కలు మెత్తపడతాయి. అప్పుడు వాటిని మూకుడులో నుంచి బయటకు తీసి చల్లబర్చాలి.
టమోటాలను చిన్న ముక్కలుగా చేయాలి. వీటిని, జీడిపప్పులను ఒక మిక్సి జార్‌లో వేసి ముద్దగా చేయాలి.
పెరుగును ఒక గిన్నెలో వేసి ఒక స్పూనుతో బాగా తిప్పాలి.
బెండకాయ ముక్కలు వేయించిన మూకుడులో నెయ్యి వేయాలి. ముందు జీలకర్రను దానిలో వేసి వేయించాలి. ఆ తర్వాత దానిలో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆ తర్వాత టమోటా, జీడిపప్పు ముద్దను వేసి వేయించాలి.
ఆ మిశ్రమంలో మసాలా, శనగ పిండి, ధనియాల పొడి, కారం, పసుపు వేయాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత చల్లార్చిన బెండకాయ ముక్కలు వేయాలి.
ఈ మిశ్రమం చల్లారిన తర్వాత దానిలో పెరుగు కలపాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కూడా కలపవవచ్చు. ఈ మిశ్రమంలో ఉప్పు వేసిన తర్వాత మళ్లీ స్టౌ మీద పెట్టి ఇంకొంత సేపు ఉడకనివ్వాలి.
ఈ మిశ్రమంలో క్రీమ్ మరియు తరిగిన కొత్తిమీర వేయాలి.
జాగ్రత్తలు
బెండకాయలను ఎక్కువగా వేయించ కూడదు. బెండకాయలు ఎక్కువగా వేగితే రుచి పోతుంది.
కూర చల్లారిన తర్వాత మాత్రమే పెరుగును కలపాలి. వేడిగా ఉన్నప్పుడు పెరుగు కలిపితే విరిగిపోయినట్లు అవుతుంది.
జీడిపప్పు ముద్ద వేయకపోయినా పర్వాలేదు. అయితే జీడిపప్పు ముద్ద వల్ల కూరకు మంచి రుచి వస్తుంది.
క్యాబేజీ మిక్స్ వెజ్ కూర
కావాల్సిన పదార్థాలు: తురిమిన క్యాబేజీ- ఒక కప్పు, క్యారెట్ ముక్కలు, బీన్స్, కాకరకాయ ముక్కలు, పచ్చి బఠానీలు- రెండు కప్పులు, పచ్చి మిరపకాయ ముక్కలు- రెండు స్పూనులు, తురిమిన కొబ్బరి- అర కప్పు, కరివేపాకు- ఒక రెబ్బ, ఆవాలు- ఒక స్పూను, జీలకర్ర- ఒక స్పూను, వెల్లుల్లి- నాలుగు రెబ్బలు, కారం- రెండు స్పూనులు, ఆవ పొడి- ఒక స్పూను, పసుపు- పావు స్పూను, ఇంగువ- చిటికెడు, కొబ్బరి నూనె- 3 స్పూనులు, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని
తయారీ విధానం
ఒక మూకుడులో నూనెను వేడి చేసి దానిలో ఆవాలు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చి మిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి ఒక ఐదు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత దానిలో కొబ్బరి తురుము వేయాలి.
ఈ మిశ్రమంలో కూర ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి మూత పెట్టాలి. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత మూత తీసి నీళ్లు చల్లాలి. కూర ముక్కలు బాగా మగ్గిన తర్వాత స్టౌ మీద నుంచి కిందకు దింపేయాలి.
జాగ్రత్తలు
చాలా మంది కాకరకాయ ముక్కలను ఇతర కూరలతో కలపటానికి ఇష్టపడరు. కాకర చేదు ఇతర ముక్కలకు అంటుకుంటుందని భావిస్తారు. కాకరకాయను చెక్కి ముక్కలుగా చేస్తే చేదు తగ్గుతుంది. కొబ్బరినూనెలో వేయిస్తే చిరు చేదు ఉన్నా పోతుంది.
ఈ కూరలో ఎక్కువ నీళ్లు పోయకూడదు. ఎక్కువ నీళ్లు పోస్తే కూర ముద్దగా అయిపోతుంది.
Updated Date - Oct 19 , 2024 | 05:26 AM