బుకర్ బరిలో... అతివలు అయిదుగురు
ABN, Publish Date - Sep 23 , 2024 | 04:21 AM
సమంతా రచనా శైలిని ప్రముఖ రచయిత్రి వర్జీనియా ఉల్ఫ్‌తో పోలుస్తారు అభిమానులు. ఆమె రాసిన అయిదు నవలలు అటు పాఠకుల నుంచి, ఇటు విమర్శకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందాయి.
బుకర్ ప్రైజ్... ఆంగ్ల సాహిత్యంలో ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఒకటి. దీనికి షార్ట్‌లిస్ట్
అయ్యే వారిలో ప్రతిసారీ పురుషులే ఎక్కువ. ఈ ఏడాది మాత్రం...
ఎంపికైన ఆరుగురిలో అయిదుగురు రచయిత్రులే. యాభై అయిదేళ్ళ ‘బుకర్’
చరిత్రను తిరగరాసిన ఆ మహిళలు ఎవరంటే...
సమంతా హార్వే
వయసు: 49 దేశం: బ్రిటన్
బుకర్‌కు ఎంపికైన రచన: ఆర్బిటాల్
సమంతా రచనా శైలిని ప్రముఖ రచయిత్రి వర్జీనియా ఉల్ఫ్‌తో పోలుస్తారు అభిమానులు. ఆమె రాసిన అయిదు నవలలు అటు పాఠకుల నుంచి, ఇటు విమర్శకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందాయి. ఆమె ‘యూనివర్సిటీ ఆఫ్ యార్క్’, ‘యూనివర్సిటీ ఆఫ్ షెఫ్‌ఫీల్డ్స్’లో ఫిలాసఫీ చదివారు. కవితాత్మకమైన వచనం ఆమె ప్రత్యేకత. మానవ మనస్తత్వం గురించి లోతైన విశ్లేషణలు ప్రధానంగా ఉంటాయి. సమంతా రచనలు పన్నెండుకు భాషల్లో అనువాదమయ్యాయి. వాటికి పలు పురస్కారాలు దక్కాయి. ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఆరుగురు వ్యోమగాముల చుట్టూ ఇది తిరుగుతుంది. ‘భూమిలేని జీవితం ఏమిటి? మానవాళి లేని భూమి ఏమిటి?’ అని ఆ వ్యోమగాములు ఆలోచించడం ప్రారంభిస్తారు. భూమి దిగువ కక్ష్యలో మానవులు నివాసం ఏర్పరచుకోవడం గురించి రాయాలని పాతికేళ్ళుగా అనుకుంటున్నాను. అయితే సైన్స్‌ఫిక్షన్‌గా కాదు, వాస్తవికత ఉట్టిపడేలా. అందరూ నివసించాలని కోరుకొనే ఒక ప్రదేశం సౌందర్యాన్ని ఒక ప్రకృతి రచయిత మాదిరిగా కళ్ళకు కట్టేలా చెప్పగలనా? ఇవీ నా ఆలోచనలు. ఈ రచన ‘బుకర్’ పరిశీలనలో ఉన్నందుకు సంతోషంగా ఉంది’’ అంటూ ‘ఆర్బిటల్’ నేపథ్యం గురించి చెప్పుకొచ్చారు. సమంతా.
అన్నే మైఖెల్స్
వయసు: 66 దేశం: కెనడా
బుకర్‌కు ఎంపికైన రచన: హెల్డ్
ఇరవయ్యెనిమిదేళ్ళ కాలంలో అన్నే మైఖెల్స్ రాసినవి మూడే నవలలు. మొదటి నవల ‘ఫ్యూజిటివ్ పీసె్‌స’కు అక్షరాలా పన్నెండు పురస్కారాలు వచ్చాయి. రెండో నవల ‘వింటర్ వాలెట్’కూ అద్భుతమైన ఆదరణ దక్కింది. ఆ తరువాత పధ్నాలుగేళ్ళకు... తన మూడో నవల ‘హెల్డ్’తో మళ్ళీ సంచలనం సృష్టిస్తున్నారామె. అన్నే కేవలం నవలాకర్త మాత్రమే కాదు... గొప్ప కవయిత్రి. కవితా రచనను ప్రారంభించిన తొలి రోజుల్లోనే ఆమె వెలువరించిన తొలి సంకలనం ‘ది వెయిట్ ఆఫ్ ఆరెంజె్‌స’ను ‘కామన్వెల్త్ పొయెట్రీ ప్రైజ్ ఫర్ ది అమెరికాస్’ పురస్కారం వరించింది. ఆ తరువాత వరుసగా ప్రచురితమైన మరో ఆరు కవితా సంకలనాలు... ఆస్ట్రేలియాలో అత్యుత్తమ కవయిత్రుల్లో ఒకరిగా ఆమెను నిలబెట్టాయి. మఆమె రచనలు, వాటి అనువాదాలు 45కు పైగా దేశాల్లో ప్రచురితమయ్యాయి. ఈ ఏడాది ‘బుకర్ ప్రైజ్‘కు షార్ట్‌లిస్ట్ అయిన ‘హెల్డ్’ నవల... నాలుగు తరాల జీవిత సమాహారం. ‘‘ఆ నవల రాస్తున్నంత కాలం... ‘ఈ అత్యవసరమైన సమయాల్లో... వినలేనంత చిన్నదైనా సరే... ఎలాంటి స్వరం మనకు అవసరం?’ అని ప్రతిరోజూ నన్ను నేను ప్రశ్నించుకున్నాను. దానికి అనుగుణంగానే కథా నేపథ్యాన్ని, శైలిని ఎంచుకున్నాను’’ అంటూ ‘హెల్డ్’ను రాయడం వెనుక తన ఆలోచనలను అన్నే పంచుకున్నారు.
ఛార్లెట్ వుడ్
వయసు: 59 దేశం: ఆస్ట్రేలియా
బుకర్‌కు ఎంపికైన రచన: స్టోన్ యార్డ్ డివోషనల్
పలు ప్రతిష్టాత్మకమైన బహుమతుల జాబితాలో తరచూ కనిపించే పేరు ఛార్లెట్ వుడ్. విమర్శకుల ప్రశంసలూ ఆమెకు కొత్త కాదు. కొన్ని పదుల అవార్డుల్ని గెలుచుకున్న ఆమెను ‘సొంత గొంతు కలిగిన, ప్రేరణ కలిగించే ఆస్ట్రేలియన్ రచయితల్లో ఒకరు’ అని ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక ప్రశంసించింది. క్రియేటివ్ ఆర్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ అందుకొని, ‘యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్’లో పిహెచ్‌డి చేసిన ఛార్లెట్ పాత్రికేయ వృత్తిలో కొన్నాళ్ళు ఉన్నారు. ‘పీసెస్ ఆఫ్ ఎ గర్ల్’తో ఆమె రచనా వ్యాసంగం ప్రారంభమయింది. ఏడు నవలలతో పాటు కొన్ని కాల్పనికేతర రచనలు కూడా చేశారు. కిందటి ఏడాది ప్రచురితమైన ‘స్టోన్ యార్ట్ డివోషనల్’ నవల ఈ ఏడాది ‘బుకర్ ప్రైజ్‘కు షార్ట్‌లిస్ట్ అయింది. ‘‘ఈ నవలలోని అంశాలన్నీ నా జీవితం, బాల్యానికి సంబంధించినవి. వాటిని ఏకంతంగా గడిపే ఒక మత సమాజం గురించి నేను ఊహించుకున్న కథతో కలగలిపాను. ఈ నవలను కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో రాశాను. అప్పుడే నేను తీవ్ర అనారోగ్యం నుంచి బయటపడ్డాను. కొవిడ్, అస్వస్థత... ఈ రెండూ మానసికంగా అనిశ్చితి కలిగించాయి. గందరగోళంలో నిశ్చలత్వాన్ని సాధించడంలో నైపుణ్యం పొందడానికి ప్రయత్నించాను. ముందే చెప్పినట్టు అందరికీ దూరంగా ఉండే ఒక మత సమాజంలో క్షమాగుణం, దుఃఖం, మహిళలతో స్నేహాల కోసం నిర్భయమైన అన్వేషణే ఈ నవల’’ అంటారు ఛార్లెట్.
రాచెల్ కుష్నీర్
వయసు: 55 దేశం: అమెరికా
బుకర్‌కు ఎంపికైన రచన: క్రియేషన్ లేక్
అయిదేళ్ళ వయసులో... అమ్మ చెయ్యి పట్టుకొని బుక్ స్టోర్స్‌లో బిడియంగా అడుగుపెట్టిన రాచెల్ కుష్నీర్‌కు బాల్యం నుంచే పఠనం ప్రధాన ఆసక్తిగా మారింది. ‘పొలిటికల్ సైన్స్-ఫారిన్ పాలసీ’లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. ఆ తరువాత స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో ఇటలీకి వెళ్ళి.. ‘బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్’ పూర్తి చేశారు. కొలంబియా యూనివర్సిటీలో క్రియేటివ్ రైటింగ్‌లో ‘మాస్టర్ ఆఫ్ ఫైనార్ట్స్’ డిగ్రీ తీసుకున్నారు. చదువుకొనే రోజుల్లోనే సంపాదన కోసం నైట్ క్లబ్‌లో క్లర్క్‌గా పని చేశారు. అనంతరం న్యూయార్క్‌లో ఎనిమిదేళ్ళు పాత్రికేయురాలిగా ఉన్నారు. ‘గ్రాండ్ స్ట్రీట్’ తదితర పత్రికలకు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలోనే కళారంగంపై రాచెల్ రాసిన వ్యాసాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. 2008లో విడుదలైన ‘టెలెక్స్ ఫ్రమ్ క్యూబా’ ఆమె మొదటి నవల. 1967లో జరిగిన ‘ఆరు రోజుల (అరబ్-ఇజ్రాయెల్) యుద్ధం’ యాభయ్యో వార్షికోత్సవం సందర్భంగా... ఇజ్రాయిల్ ఆక్రమణపై ఒక పుస్తక ప్రచురణకు నిర్ణయించిన ‘బ్రేకింగ్ ది సైలెన్స్’ సంస్థ తరఫున 2016లో ఇజ్రాయెల్ వెళ్ళారు. ఆ సందర్శన తన దృక్పథంలో అనేక మార్పులు తీసుకువచ్చిందని ఆమె చెబుతారు. ఇప్పటివరకూ ఆమె ఏడు నవలలు రాశారు. తాజా నవల ‘క్రియేషన్ లేక్’,,, ‘బుకర్ ప్రైజ్‘కు షార్ట్‌లిస్ట్ అయింది. సీక్రేట్ ఏజెంట్ అయిన ముప్ఫై నాలుగేళ్ళ అమెరికన్ మహిళ ప్రధాన పాత్రగా ఈ కథ నడుస్తుంది. ‘‘ఫ్రాన్స్ రాజధాని పారిస్ నుంచి ఆ దేశంలోని గ్రామీణ ఔట్‌పో్‌స్టకు వెళ్లే యువకుల బృందం గురించి నేను చాలా కాలంగా ఒక కథ చెప్పాలనుకున్నాను. అదే సమయంలో పూర్వ చరిత్ర మీద నాకు ఆసక్తి కలిగింది.. ‘మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడున్నాం?’ అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకోడానికి ప్రతి రోజూ సరైన తరుణమే అనుకుంటాను. ఈ సంఘర్షణను ప్రతిఫలించే స్పై థ్రిల్లర్... క్రియేషన్ లేక్’’ అంటూ తన రచన గురించి వివరించారు
యేల్ వాన్ డెర్ వూడెన్
వయసు: 37 దేశం: నెదర్లాండ్స్
బుకర్‌కు ఎంపికైన రచన: ది సేఫ్ కీప్
ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో యూదు తల్లికి, యూదేతర తండ్రికి యేల్ వాన్ జన్మించారు. ఆ తరువాత ఆమె కుటుంబం నెదర్లాండ్స్‌కు వలస వెళ్ళింది. చరిత్ర, సాహిత్యం ఆమె అభిమాన విషయాలు. పలు యూనివర్సిటీల్లో క్రియేటివ్ రైటింగ్, స్టోరీ టెల్లింగ్, లిటరేచర్ గురించి బోధించారు. అనేక పత్రికల్లో కళలు, సాహిత్యంపై వ్యాసాలు రాశారు. ఆమె కథలు ఎన్నో బహుమతులను అందుకున్నాయి. ఈ ఏడాది ‘బుకర్ ప్రైజ్‘కు షార్ట్‌లిస్ట్ అయిన ‘ది సేఫ్ కీప్’ ఆమె తొలి నవల. అంతేకాదు... ఆ బహుమతికి నామినేట్ అయిన తొలి డచ్ రచయితగానూ చరిత్రకెక్కారు. ‘‘ఈ నవల ఎందుకు రాశాననే ప్రశ్నకు... అనేక సమాధానాలు ఉన్నాయి. నెదర్లాండ్స్‌లో స్థిరపడిన ఇజ్రాయిలీ కుటుంబం మాది. వలస వచ్చిన చోట మా అస్థిత్వ మూలాల గురించి ఆలోచన, వాటిని వెతుక్కొనే ప్రయత్నాలు ఎంతో సంఘర్షణాత్మకమైనవి. ఒకసారి... నా సన్నిహితుల అంత్యక్రియల్లో పాల్గొని, కారులో తిరిగి వస్తున్నాను. విశాలమైన డచ్ వ్యవసాయ క్షేత్రాలు దారిలో కనిపిస్తున్నాయి. ఏదో దుఃఖం నాలో కదిలింది. దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? అప్పుడు ఒక ఇల్లు, ఒక మహిళ, ఒక అపరిచితుడు... ఈ పాత్రలు నాలో మెదిలాయి. అదే రెండో ప్రపంచయుద్ధం ముగిసిన పదిహేనేళ్ళ తరువాత... నెదర్లాండ్స్‌లో జరిగే ఫ్యామిలీ డ్రామా- ది సేఫ్ కీప్’’ అంటూ తన నవల నేపథ్యాన్ని వివరించారు యేల్ వాన్. ప్రస్తుతం బోధన కొనసాగిస్తూనే... రచనా వ్యాసంగంలో తదుపరి అడుగులకు ఆమె సిద్ధమవుతున్నారు.
Updated Date - Sep 23 , 2024 | 04:43 AM