Navya : కార్డు లేదని... ‘కుబేర’ నుంచి తీసేశారు
ABN, Publish Date - May 26 , 2024 | 03:39 AM
సినీ రంగంలో ఉన్న అతి తక్కువమంది మహిళా ప్రొడక్షన్ డిజైనర్లలో ప్రవల్యా ఒకరు.ఆమె చేసిన ‘గామి, అశోకవనంలో అర్జున కళ్యాణం’ తదితర సినిమాలకు మంచి ఆదరణ లభించింది. అయితే చిత్ర పరిశ్రమలో మహిళలు నిలదొక్కుకోవటం అంత సులువు కాదంటారు ప్రవల్యా.
సండే స్పెషల్
సినీ రంగంలో ఉన్న అతి తక్కువమంది మహిళా ప్రొడక్షన్ డిజైనర్లలో ప్రవల్యా ఒకరు.ఆమె చేసిన ‘గామి, అశోకవనంలో అర్జున కళ్యాణం’ తదితర సినిమాలకు మంచి ఆదరణ లభించింది. అయితే చిత్ర పరిశ్రమలో మహిళలు నిలదొక్కుకోవటం అంత సులువు కాదంటారు ప్రవల్యా. అందుకు తన పోరాటమే ఒక ఉదాహరణగా చెబుతున్న ఆమెతో ‘నవ్య’ మాట కలిపింది.
‘‘మా నాన్న ఆర్మీ అధికారి. నేను పుట్టింది, పెరిగిందీ ఉత్తర భారత దేశంలోనే. నాన్న పదవీ విరమణ చేసిన తర్వాత మేము విశాఖపట్టణంలో స్థిరపడ్డాం. ఆ సమయంలోనే నాకు హైదరాబాద్ ‘నిఫ్ట్’లో సీటు వచ్చింది. దాంతో నేను హైదరాబాద్ వచ్చేశాను. అక్కడ యాక్సెసరీ డిజైనింగ్ చదివాను. నాకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్ పట్ల ఆసక్తి. మా తాతగారు ఎం.వి.బి.ఆచారి ఒకప్పుడు పెద్ద ఆర్టిస్ట్. బహుశా ఆ కళా జన్యువులు కూడా నాకు వచ్చి ఉండచ్చు.
అందువల్ల చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ వేసేదాన్ని. ఇప్పటికీ కొద్ది సమయం దొరికినా పెయింటింగ్ వేస్తూనే ఉంటా. నన్ను డాక్టర్‌గా చూడాలనేది మా అమ్మానాన్న ఆకాంక్ష. అందుకే ఇంటర్‌లో బైపీసీ తీసుకోమన్నారు. నాకు దాని మీద ఆసక్తి లేదు. నా అభిరుచికి అనుగుణంగా నేను ‘నిఫ్ట్’లో చదువుతానని అన్నప్పుడు చాలా మంది మధ్యతరగతి తల్లితండ్రుల మాదిరిగానే వారు పెద్దగా పట్టించుకోలేదు.
కానీ నాకు ఎందుకో ‘నిఫ్ట్’లోనే చదవాలని అనిపించింది. ‘‘తాతగారు 60 ఏళ్ల క్రితం ఫైన్ ఆర్ట్స్ చదివినప్పుడే నేనేందుకు చదవకూడదు? ఆయన బతికి ఉంటే నన్ను చదివించేవారు’’ అని ఇంట్లోవాళ్లను ఎలాగో ఒప్పించగలిగాను. అయితే ఫీజు రూపంలో నాకు మరో సమస్య ఎదురయింది. ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదువుతానని వాళ్లను ఒప్పించి ‘నిఫ్ట్’లో చేరా.
అప్పుడే తెలిసింది...
మొదటి ఏడాది నేను ఏం చేస్తున్నానో... చదివిన తర్వాత నాకు ఏ ఉద్యోగం వస్తుందో కూడా తెలియదు. రెండో ఏడాది తర్వాత కాస్త అవగాహన వచ్చింది. బయట ప్రపంచంలో నాకు అనేక అవకాశాలు ఉంటాయని అర్థమైంది. ఫ్యాషన్ డిజైనింగ్ చదివితే... ఫ్యాషన్ రంగంలో ఎక్కువ అవకాశాలు లభిస్తాయి.
కానీ ‘యాక్సెసరీ డిజైనింగ్ పూర్తయితే... ఇంటీరియర్ డిజైనింగ్ చేయవచ్చు. రకరకాల ఫ్యాషన్ వస్తువులు డిజైన్ చేయవచ్చు. సినిమాలకు సెట్‌లు వేయవచ్చు... ఇలా చాలా విషయాలు తెలిసాయి. నాలుగో సంవత్సరంలో నాకు అనేక కంపెనీలలో ఉద్యోగాలు వచ్చాయి.
నాకు నేనుగా ఎదగాలని...
అయితే ఒకరి దగ్గర పని చేయకూడదనే ఆలోచన మాత్రం బలంగా ఉండేది. ఎందుకంటే... నేను చేసిన డిజైన్లు ఆ కంపెనీల పేరు మీద మార్కెట్‌లోకి వెళ్తాయి. నాకు ఎటువంటి పేరూ రాదు. చాలామంది కాంట్రాక్ట్‌లు అడిగారు. ఏడాది పని చేసి నా లోన్ తీర్చేయాలనుకున్నా.
అందువల్ల బెంగుళూరులో గోడల మీద మ్యూరల్స్ చిత్రించే ఒక కంపెనీలో చేరా. ఒక గోడ మీద మ్యూరల్స్ వేస్తే 70 వేల నుంచి లక్ష రూపాయల దాకా వచ్చేది. ఒక వైపు డబ్బులు వచ్చేవి.
మరో వైపు ఆత్మతృప్తి కూడా కలిగేది. కానీ డబ్బులు సంపాదించడానికి నా జీవితాంతం ఆ పని చేయడం నాకు ఇష్టంలేదు. దాంతో మళ్లీ హైదరాబాద్‌కు వచ్చేసి ఒక ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలో చేరా. అయితే వాళ్లు ఇచ్చే జీతం సరిపోలేదు.
ఉద్యోగం చేస్తూ...
ఆ సమయంలోనే ‘గామి’ చిత్రం నిర్మాతలు... ఒక వెబ్‌సిరీస్ తీయాలనుకొని నన్ను పిలిచారు. కానీ ఆ వెబ్‌సిరీస్ ఆగిపోయింది. వారికి నా సృజనాత్మకత నచ్చి... ‘గామి’కి ప్రొడక్షన్ డిజైన్ చేసే అవకాశమిచ్చారు. అది క్రౌడ్ ఫండింగ్‌తో తీసిన సినిమా. డబ్బులు ఎక్కువగా లేవు.
దాంతో నేను ఒక ఇంటీరియర్ కంపెనీలో ఉద్యోగానికి చేరాను. ఉదయం ఉద్యోగానికి వెళ్లేదాన్ని. సాయంత్రం, రాత్రి ‘గామి’ కోసం పని చేసేదాన్ని. ఇలా రెండు షిఫ్ట్‌లు పని చేసేదాన్ని. ఆ సమయంలో కొవిడ్ విజృంభించింది.
దాంతో నా జీతం సగం తగ్గించేసారు. నా కష్టాలు మళ్లీ వెంటాడాయి. సరైన జీతం లేనప్పుడు ఉద్యోగం చేసి ప్రయోజనం లేదని... ఆ కొలువు వదిలేసి ‘గామి’ పైనే పూర్తి దృష్టి పెట్టాను. ఆ సినిమా పూర్తయిపోయింది.
ఇంకో ప్రాజెక్టు చేతిలో లేదు. ఇలా రెండు నెలలు గడిచింది. ఆ సమయంలో ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాకు అవకాశం వచ్చింది. ఆ వర్క్ ఏడాదిన్నరపాటు సాగింది. ఒకవైపు సినిమా చేస్తూనే వేరే ప్రాజెక్టులు చేశాను.
‘ఈ పిల్లకు ఏం తెలుసు..!’
ఆ తర్వాత ‘కుబేర’లో అవకాశం లభించింది. డీఓపీ, డైరక్షన్ టీమ్, ప్రొడక్షన్ డిజైన్‌లో ఉన్న ఇతర కొలిగ్స్‌తో కలిసి పని చేయటం ఒక సవాలు. ఇండస్ట్రీలో చాలా కాలంగా పని చేసినవాళ్లు ఉంటారు.
వాళ్లతో సమస్యలు ఎక్కువగా వస్తాయి. ‘‘ఈ పిల్లకు ఏం తెలుసు? ఇన్నేళ్లుగా మేం పని చేస్తున్నాం’’ అనే ఈగో సమస్యలు వస్తాయి. నాకు సృజనాత్మకతకు సంబంధించి ఎటువంటి సమస్యలూ లేవు. మనుషుల మేనేజిమెంట్ దగ్గరే అసలైన సవాళ్లు ఎదురయ్యాయి.
‘గామి’ చిత్రంలో నేను నేర్చుకున్న పాఠాలను ఏ కాలేజీలో నేర్పరు. ఇండస్ట్రీలో మన కన్నా సీనియర్లు ఉంటారు. వాళ్ల అనుభవాలు వారికి ఉంటాయి. నా ఉద్దేశంలో అందరినీ కలుపుకొని పోవటమనేది ఎవరికైనా ఎదురయ్యే పెద్ద సవాలు. దీనిని అధిగమిస్తే విజయం చాలా సులభమనిపిస్తుంది.
పనితోనే సమాధానం...
అలాగే నేను అమ్మాయిని కాబట్టి మరికొన్ని ప్రత్యేక సమస్యలు ఎదురవుతాయి. ‘‘మీరు నెమ్మదిగా ఉంటే ఎలా అవుతుంది?’’ అంటుంటారు. వారికి నేను నా పనితో సమాధానం చెబుతా. నాకు సాధారణంగా వనరులు వృథా చేయటం ఇష్టం ఉండదు.
కానీ చాలా సందర్భాలలో నిర్మాతలు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు నేను అడిగిన బడ్జెట్ కన్నా తక్కువ ఇస్తారు. దానికి సరైన కారణం కూడా ఉండదు.
అలాంటి సమయాల్లో మనం పని నాణ్యతలో రాజీ పడకుండా చేయాల్సి వస్తుంది. అందరు కళాదర్శకులకూ ఈ సమస్యలు ఉంటాయో లేదో నాకు తెలియదు. లేకపోతే నాకు ఆనందమే.
సెట్‌లోకి రానివ్వలేదు...
‘గామి’ షూటింగ్‌లో నేను అనేక సమస్యలు ఎదుర్కొన్నా. ముఖ్యంగా నాకు యూనియన్ల గురించి తెలియదు. అందువల్ల కళాశాలల్లో చదువుకొనే విద్యార్థులతో పని చేసేదాన్ని. ఇప్పుడు నాకు సృజనాత్మకత, వనరుల సమస్య లేదు. కానీ యూనియన్లతోనే సమస్య వస్తోంది. నేను ‘కుబేర’ చిత్రం రెండు షెడ్యూల్స్ చేసిన తర్వాత యూనియన్‌వాళ్లు అడ్డం చెప్పారు.
నాకు యూనియన్ కార్డు లేదు కాబట్టి నేను ఆ సినిమా చేయకూడదనేది వాళ్ల అభ్యంతరం. పని చేయటానికి సెట్‌లోకి మమ్మల్ని రానిచ్చేవారు కాదు. దాంతో నేను ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఈ రాజకీయాలు చూస్తే బాధ కలుగుతుంది. ఒకప్పుడు నాకన్నా టాలెంట్ ఉన్నవారు సినిమా రంగంలోకి ఎందుకు రావటంలేదని అనుకొనేదాన్ని.
టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదని.. ఇండస్ట్రీ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలని ఇప్పుడు అర్థమవుతోంది. ఈ రాజకీయాలను తట్టుకొని నిలబడలేక- వదిలేసి వెళ్లిపోదామనుకున్నా. కానీ శేఖర్ సర్ (శేఖర్ కమ్ముల)... ‘‘ఇలాంటి రాజకీయాలన్నీ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడాలి. పోరాడాలి’’ అని చెప్పారు. నాకు మద్దతుగా నిలిచారు. అయితే ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. నేనుఎంత పోరాడినా... చివరకు యూనియన్ గెలిచింది.’’
- సీవీఎల్‌ఎన్ ప్రసాద్
యూనియన్ కార్డుకు రూ.8 లక్షలు...
యూనియన్ కార్డు కావాలంటే రూ.8 లక్షలు కట్టాలి. నాకు అది కష్టమే! కానీ తప్పదు. యూనియన్ కార్డుకు అప్లై చేశాను. నాకు మద్దతు ఇచ్చేవాళ్లు కూడా బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడలేక పోతున్నారు. నేను తాజా ఉదాహరణ కావచ్చు. నాలాంటివాళ్లు ఎందరో ఉన్నారు. వాళ్లకైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ప్రస్తుతం కొన్ని కంపెనీలతో మాట్లాడుతున్నా. ఆ ప్రాజెక్టులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశముంది.
Updated Date - May 26 , 2024 | 03:42 AM