'Jandhyala Foods' : సంప్రదాయ రుచులకు ఈమే చిరునామా
ABN, Publish Date - Sep 25 , 2024 | 04:43 AM
ఆడపడుచు సలహాతో ఐదొందల రూపాయలతో మొదలుపెట్టారు. నడివయసులో వ్యాపారానికి శ్రీకారం చుట్టి... ఆరు పదులు దాటినా అదే ఉత్సాహంతో పని చేస్తున్నారు.పచ్చళ్లు... పొడులు... అప్పడాలు... అంచెలంచెలుగా ఎదుగుతూ...సంస్థను నేడు కోట్ల టర్నోవర్‌కు తీసుకువెళ్లారు. ఎందరో మహిళలకు ఉపాధి కల్పిస్తూ... సంప్రదాయ రుచులను ప్రపంచంలోని తెలుగువారందరికీ అందిస్తున్నారు. ‘జంధ్యాల ఫుడ్స్’ అధినేత జయప్రద జంధ్యాలతో ‘నవ్య’ మాటామంతి.
శ్రీశక్తి
ఆడపడుచు సలహాతో ఐదొందల రూపాయలతో మొదలుపెట్టారు. నడివయసులో వ్యాపారానికి శ్రీకారం చుట్టి... ఆరు పదులు దాటినా అదే ఉత్సాహంతో పని చేస్తున్నారు.పచ్చళ్లు... పొడులు... అప్పడాలు... అంచెలంచెలుగా ఎదుగుతూ...సంస్థను నేడు కోట్ల టర్నోవర్‌కు తీసుకువెళ్లారు. ఎందరో మహిళలకు ఉపాధి కల్పిస్తూ... సంప్రదాయ రుచులను ప్రపంచంలోని తెలుగువారందరికీ అందిస్తున్నారు. ‘జంధ్యాల ఫుడ్స్’ అధినేత జయప్రద జంధ్యాలతో ‘నవ్య’ మాటామంతి.
‘‘అంతకముందు మా కుటుంబంలో వ్యాపారం చేసినవారు ఎవరూ లేరు. నాకూ ఆ ఆలోచన ఎప్పుడూ రాలేదు. అదికూడా పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలు పుట్టాక బిజినెస్ గురించి ఆలోచించేంత సమయం ఎక్కడుంటుంది! నాటి పరిస్థితులవల్ల అనుకోకుండా నా అడుగులు ఇటువైపు పడ్డాయి. ఇదంతా ఇరవయ్యేళ్ల కిందట మొదలైంది. మా నాన్నావాళ్లది గుంటూరు జిల్లా రేపల్లె దగ్గర పెదపులివర్రు. దర్శకుడు కె.విశ్వనాథ్ గారి ఊరు. మా అత్తగారిది తెనాలి.
1986లో నా పెళ్లి అయింది. మావారు జంధ్యాల శివరామకృష్ణకు హైదరాబాద్ ఐడీపీఎల్ మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగం. నేను తెనాలి ప్రభుత్వ పాఠశాలలో హిందీ టీచర్‌గా చేసేదాన్ని. 1983లో ఉద్యోగంలో చేరాను. పెళ్లయ్యాక రెండేళ్లు తెనాలిలో మా అత్తగారి దగ్గర ఉన్నాను. అయితే ఆయన హైదరాబాద్‌లో... నేను తెనాలిలో... ఇలా అయితే కుదరదనుకున్నా. దాంతో 1990లో ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌కు వచ్చేశాను. సాధారణంగా కష్టపడి సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగం వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ మావారి కోసం ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ ఏదోఒక స్కూల్లో చేరవచ్చని అనుకున్నా. చాలాచోట్ల ప్రయత్నించాక ఒక స్కూల్లో ఉద్యోగం వచ్చింది.
ఆడపడుచు ఆలోచన...
కొన్నాళ్లకు మా అత్తగారు పోయారు. మా ఆడపడచులు, మరిది పెళ్లిళ్లు వచ్చాయి. మావారే ఇంటికి పెద్ద కావడం... ఆ బాధ్యతలన్నీ చూసుకోవాల్సి రావడంతో స్కూలు మానేశాను. అదే సమయంలో ఐడీపీఎల్ కూడా ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. దాంతో ఆయన వీఆర్‌ఎస్ తీసుకున్నారు.
ఆయన ఖాళీ. నేనూ ఖాళీ. ఇద్దరు పిల్లలు, వారి చదువులు... ఇల్లు గడవాలి కదా. ఏంచేద్దామని ఆలోచిస్తున్నాం. ఒక రోజు మా ఆడపడుచు వచ్చింది. ‘వదినా... నువ్వు పచ్చళ్లు, పొడులు బాగా చేస్తావు కదా. రూ.500 ఇస్తాను. దాంతో మొదలుపెట్టు’ అంది. ఆ సలహా నాకు బాగా నచ్చింది. ఆ ఐదొందలతో కందిపప్పు, ఇతర దినుసులు తీసుకువచ్చాను. కంది పొడి కొట్టి తెలిసినవాళ్లదరికీ ఇచ్చాను. చాలా బాగుందన్నారు.
స్నేహితులకు పంపిస్తే...
తరువాత రెండు కిలోలు టమాటా, కిలో అల్లం తెచ్చి పచ్చళ్లు చేసి ఇచ్చాం. అందరికీ నచ్చాయి. మావారు... ‘జయప్రద చేసింది’ అని తన స్నేహితుడికి పంపించారు. ఆ పచ్చళ్లను తమ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నారట. అదే సమయంలో వాళ్లింటికి విదేశాల నుంచి స్నేహితులు వచ్చారు. వాళ్లు ఆ పచ్చళ్లు తిని, తమకూ కావాలని అడిగారు. వాళ్ల కోసం మొదటిసారి కాస్త ఎక్కువ మొత్తంలో పచ్చళ్లు చేసి ఇచ్చాను. అందరూ బాగున్నాయంటున్నారు.
అలాంటప్పుడు దీన్ని ఒక వ్యాపారంగా మారిస్తే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనతో 2003లో ఇంట్లోనే పచ్చళ్ల తయారీ మొదలుపెట్టాను. అప్పుడు నా వయసు నలభై ఏళ్లు. నెలకు ఐదు వేలు సంపాదిస్తే చాలనుకున్నాను. ఒక అమ్మాయిని హెల్పర్‌గా పెట్టుకున్నాను. పచ్చళ్లు, పొడులు... ఏదైనా పొద్దున అడిగితే సాయంత్రానికల్లా చేసేదాన్ని. మావారు కిలో అయినా... పావుకిలో అయినా ఆర్డర్లు ఇంటికి వెళ్లి ఇచ్చేవారు. వచ్చిన డబ్బుతో సరుకులు కొని... రొటేషన్ చేసేదాన్ని. గ్రైండర్ ఉన్నా... మంచి రుచి కోసం అన్నీ రోట్లోనే రుబ్బేదాన్ని. క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. ఆరేడేళ్ల తరువాత ఒడియాలు కూడా ప్రారంభించాం. అప్పటి నుంచి గ్రైండర్ వాడకం మొదలైంది.
ఇరవై దేశాలకు...
కొన్నేళ్లకు మా ‘జంధ్యాల ఫుడ్స్’ పేరిట వెబ్‌సైట్ తెరిచాం. ఇప్పుడు ఇరవై రకాల పచ్చళ్లు, పది రకాల పొడులు, అప్పడాలు, ఒడియాలు తయారు చేస్తున్నాం. చర్లపల్లిలో తయారీ యూనిట్ ఉంది. హబ్సిగూడలో ఒక స్టోర్ నెలకొల్పాం. మరో రెండు చోట్ల కూడా స్టోర్స్ ప్రారంభించే ఆలోచన ఉంది. అమెరికా, కెనడా, ఆస్ర్టేలియా, న్యూజిలాండ్ సహా ఇరవై దేశాలకు మా ఉత్పత్తులు వెళతాయి. యాభై మందికి పైగా మా సంస్థలో పని చేస్తున్నారు. అందులో అత్యధికంగా మహిళలే. ఐదు వందలతో మొదలైన మా సంస్థ ఇప్పుడు 3.6 కోట్ల టర్నోవర్‌కు చేరింది.
వాళ్లిద్దరి నుంచే...
నేను వంటలు ఇంత బాగా చేయడానికి కారణం... మా అమ్మ, తరువాత మా అత్తగారు. తెనాలిలో అత్తగారి దగ్గర ఉన్నప్పుడు చాలా వంటలు నేర్చుకున్నా. ఏదైనా వెరైటీ చూస్తే... అది బాగా వచ్చేవరకు నిద్రపోను. వంట చేయడం నాకు ఎంతో ఇష్టం. మన సంప్రదాయ వంటలన్నీ బాగా చేస్తాను. అయితే మసాలాల జోలికి వెళ్లను. నాణ్యత, రుచి... ఇదే మా ప్రత్యేకత.
లేటు వయసులో మొదలుపెట్టి...
నలభై ఏళ్ల వయసులో కొత్తగా వ్యాపారం ఏంటని చాలామంది అనుకున్నారు. కానీ లక్ష్య సాధనలో పట్టుదల ఉంటే వయసు అవరోధం కాదనేది నా నమ్మకం. ప్రత్యేకించి ఆ వయసు మహిళలు... ఇల్లు, పిల్లలు, వారి భాధ్యతల్లో మునిగిపోతారు. వాటి నుంచి బయటికి రావడం అంత సులువు కాదు. అయితే ఎంచుకున్న రంగంలో మహిళలు రాణించాంటే... కుటుంబ సహకారం ఎంతో అవసరం. నా విషయమే తీసుకొంటే... నేను బిజినెస్ ప్రారంభించేనాటికి మా అమ్మాయి సీఏ ఇంటర్ అయిపోయింది.
మా అబ్బాయూ పెద్ద తరగతుల్లో ఉన్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు. అయితే నాకు ఇంట్లో ఖాళీ దొరికింది. మావారితో పాటు పిల్లలు కూడా నాకు సహకరించారు. వారందరి సహకారంతోనే ఇంతవరకు రాగలిగాను. ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లయింది. మా అబ్బాయి నా బిజినెస్ చూసుకొంటున్నాడు.
- హనుమా
Updated Date - Sep 25 , 2024 | 04:43 AM