Heart Surgery : ఛాతీ తెరవకుండా గుండె సర్జరీ
ABN, Publish Date - Nov 12 , 2024 | 05:55 AM
గుండెకు శస్త్రచికిత్స అనగానే ఛాతీ మీద పెద్ద కోత కళ్ల ముందు మెదులుతుంది. పెళ్లీడు యువతకు ఇదొక పెద్ద అవరోధమే! కానీ ఇప్పుడా సమస్య లేదు. తాజా మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలతో పక్కటెముల మధ్య నుంచి గుండెకు చికిత్స చేసే వెసులుబాటు కలుగుతోంది. ఈ శస్త్రచికిత్సకు ఎవరు అర్హులో తెలుసుకుందాం!
గుండెకు శస్త్రచికిత్స అనగానే ఛాతీ మీద పెద్ద కోత కళ్ల ముందు మెదులుతుంది. పెళ్లీడు యువతకు ఇదొక పెద్ద అవరోధమే! కానీ ఇప్పుడా సమస్య లేదు. తాజా మినిమల్లీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలతో పక్కటెముల మధ్య నుంచి గుండెకు చికిత్స చేసే వెసులుబాటు కలుగుతోంది. ఈ శస్త్రచికిత్సకు ఎవరు అర్హులో తెలుసుకుందాం!
ఛాతీ తెరిచి చేసే సంప్రదాయ సర్జరీలతో కోత, కోలుకోడానికి సమయాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా పెద్దల్లో ఎముక అతుక్కోడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. అలాగే మధుమేహుల్లో కూడా కోత మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇక పెళ్లీడు యువత శరీరం మీద పెద్ద గాటు ఏర్పడుతుందనే భయంతో గుండె సర్జరీలను వాయిదా వేస్తూ ఉంటారు. ఇలా సంప్రదాయ గుండె సర్జరీలకు కొన్ని చిక్కులున్నాయి. వీటిని అధిగమిస్తూ తాజాగా అత్యాధునిక సాంకేతిక పరికరాలు, రోబోట్ల సహాయంతో చిన్న కోతతో గుండెకు శస్త్రచికిత్స చేసే మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు అందుబాటులోకొచ్చాయి.
ఎవరు అర్హులు?
ఈ శస్త్రచికిత్సకు అన్ని వయసుల వాళ్లూ అర్హులే అయినప్పటికీ, పైచర్మానికీ గుండెకూ మధ్య ఉన్న దూరం కీలకంగా మారుతుంది. పక్కటెముకల మధ్య నుంచి కోత పెట్టి, గుండెను చేరుకోవలసి ఉంటుంది కాబట్టి ఆ మార్గం సులువుగా ఉందో లేదో ముందుగానే పరీక్షించుకోవలసి ఉంటుంది. మరీ ముఖ్యంగా తొడ దగ్గరి రక్తనాళం వ్యాసార్థాన్ని ముందుగానే తెలుసుకోవాలి. ఈ రక్తనాళం సన్నగా ఉన్నా, ఛాతీ మరీ వెడల్పుగా ఉన్నా, మినిమల్లీ ఇన్వేసివ్ శస్త్రచికిత్స సాధ్యపడదు. ఈ సమస్యలేవీ లేకుండా భౌతిక ప్రమాణాలన్నీ కుదిరిన వాళ్లకు వయసుతో సంబంధం లేకుండా ఈ చికిత్సను ఎంచుకోవచ్చు.
ఏ సమస్యలకు?
ఇన్‌ఫెక్షన్, పుట్టుకతో వెంట తెచ్చుకునే సమస్యల వల్ల గుండెలోని రెండు ప్రధాన నాళాల్లో ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. కొన్నిసార్లు నాళాల్లో అవరోధాలు ఏర్పడవచ్చు లేదంటే వాటి నుంచి రక్తం బయటకు వచ్చేస్తూ ఉండవచ్చు. ఇలాంటప్పుడు నాళాలను మార్చే శస్త్రచికిత్సల కోసం ఈ తరహా విధానాన్ని ఎంచుకోవచ్చు. అలాగే అకస్మాత్తుగా తలెత్తే గుండెపోట్లకు కూడా ఈ విధానాన్ని ఎంచుకోవచ్చు. ఇలా నాళం మరమ్మత్తు, నాళం స్థానంలో కొత్త నాళాన్ని అమర్చడం, కొరొనరీ ఆర్టరీ బైపాస్‌లతో పాటు, పుట్టుకతో వెంట తెచ్చుకునే కొన్ని గుండె జబ్బులకు, మరీ ముఖ్యంగా గుండెలో రంథ్రాలకు కూడా ఈ సర్జరీని ఆశ్రయించవచ్చు. మధుమేహులకు ఈ సర్జరీ ఎంతో ఉపయోగకరం. ఛాతీ ఎముక కత్తిరించి చేసే గుండె శస్త్రచికిత్సతో మధుమేహుల్లో ఇన్‌ఫెక్షన్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. చిన్న కోతతో ఆ ముప్పు తక్కువగా ఉంటుంది.
సర్జరీ ఇలా...
ఈ సర్జరీలో ప్రత్యేకమైన పరికరాలను వినియోగిస్తారు. ల్యాప్రోస్కోపిక్ సర్జరీలలో ఉపయోగించే పరికరాలను పోలిన వాటినే ఈ శస్త్రచికిత్సలో కూడా ఉపయోగిస్తారు. అయితే వాటి కంటే ఇవి మరింత సన్నగా ఉంటాయి. కాబట్టి కోత ఐదు నుంచి పది సెంటీమీటర్లకు మించదు. ప్రోబ్స్, వాటి చివర అమర్చి ఉండే కెమెరాలతో గుండెను స్పష్టంగా పరిశీలిస్తూ, వైద్యులు సమర్థంగా చికిత్సను పూర్తి చేయగలుగుతారు. అరుదుగా కొన్ని సందర్భాల్లో, కొంత మందిలో, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ మొదలుపెట్టిన తర్వాత, ఓపెన్ హార్ట్ సర్జరీని ఆశ్రయించక తప్పని పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో శస్త్రచికిత్స విఫలమైందని అనుకోడానికి వీల్లేదు. కొంతమందిలో అంతర్గత భౌతిక మార్పుల వల్ల ఈ సర్జరీ సాధ్యపడకపోవచ్చు. అలా మినిమల్లీ ఇన్వేసివ్ నుంచి ఓపెన్ హార్ట్ సర్జరీకి మరలే అవకాశాలు ఐదు నుంచి పది శాతం మేరకే ఉంటాయి.
ప్రయోజనాలు ఎక్కువ
కోత, నొప్పి, కోలుకునే సమయం తక్కువ
కోత ఛాతీ పక్కన ఉంటుంది కాబట్టి స్పష్టంగా కనిపించదు
ఎముక కత్తిరించే అవసరం ఉండదు
ఆస్పత్రి నుంచి నాలుగు రోజుల్లో ఇంటికి చేరుకోవచ్చు
ఒకటి రెండు వారాల్లో వాహనాలు నడపవచ్చు
డాక్టర్ గిరిధర్ ప్రసాద్
సీనియర్ కార్డియో థొరాసిక్,
మినిమల్లీ ఇన్వేసివ్ అండ్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్,
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్.
Updated Date - Nov 12 , 2024 | 05:56 AM