Radhakumari ఆమెకు ఆకాశమే హద్దు
ABN, Publish Date - May 20 , 2024 | 01:11 AM
జీవితమంటేనే నిత్య పోరాటం. సమస్యలు, సవాళ్లు అందులో భాగం. ఇది రాధాకుమారికి చిన్నప్పుడే అర్థమైంది. ఆమెది బిహార్ రాజధాని పట్నా. పుట్టుకతోనే పోలియో మహమ్మారి రాధాకుమారి జీవితాన్ని చక్రాల కుర్చీకే పరిమితం చేసింది.
జీవితమంటేనే నిత్య పోరాటం. సమస్యలు, సవాళ్లు అందులో భాగం. ఇది రాధాకుమారికి చిన్నప్పుడే అర్థమైంది. ఆమెది బిహార్ రాజధాని పట్నా. పుట్టుకతోనే పోలియో మహమ్మారి రాధాకుమారి జీవితాన్ని చక్రాల కుర్చీకే పరిమితం చేసింది. అయినా ఆమె తన వైకల్యాన్ని సాకుగా చూపి ఇంట్లోనే కూర్చోవాలని అనుకోలేదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆశావహ దృక్పథంతో ముందడుగు వేయడం అలవాటు చేసుకున్నారు.
పోలియో తన జీవితాన్ని శాశించకూడదని నిర్ణయించుకున్నారు. పట్టుదలతో ప్రయత్నించి ఫుడ్ డెలివరీ యాప్ ‘జొమాటో’లో ఉద్యోగం సంపాదించుకున్నారు. రోజూ ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంటింటికీ వెళ్లి ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. అందరిలా నడవలేకపోతున్నందుకు రాధాకుమారి ఎన్నడూ బాధపడలేదు.
చక్రాల కుర్చీని కేవలం తన పనులు తాను చేసుకోవడానికే కాకుండా... తన కాళ్లపై తాను నిలబడడానికి ఒక ఆధారంగా మలుచుకున్నారు. ‘జానో జంక్షన్’ అనే యూట్యూబ్ చానల్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వీడియోను పోస్ట్ చేశారు. అందులో రాధాకుమారి తన కథను అందరితో పంచుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో లక్షల మందిని కదిలించింది.
చూసినవారు ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. చేసే పనిపట్ల ఆమె అంకితభావానికి, చెదరని ఆత్మావిశ్వాసానికి సెల్యూట్ కొడుతున్నారు. ‘మీ నుంచి మాకు స్ఫూర్తి కావాలి’ అంటూ రాధాకుమారిని కొనియాడారు.
‘మీ పనులన్నీ మీరే చేసుకొంటున్నారు. సాధారణ వ్యక్తులతో పోటీపడి మరీ ఉద్యోగం చేస్తున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యం’ అని అడిగితే... ‘జీవితం అనేది ఉంటే... దాంతోపాటే సమస్యలూ ఉంటాయి’ అంటూ చిరునవ్వుతో సమాధానమిస్తారు రాధా కుమారి.
ఆమె అద్భుతమైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కూడా. ఈ ఏడాది జంషెడ్‌పూర్‌లో జరిగిన ‘జాతీయ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్’లో బిహార్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ‘తద్వారా నాలాంటి వికలాంగులకు ప్రేరణగా నిలవాలన్నదే నా కోరిక’ అంటారు రాధాకుమారి.
Updated Date - May 20 , 2024 | 01:11 AM