Madurai Subhasree : ఔషధ మొక్కల టీచర్!
ABN, Publish Date - Sep 09 , 2024 | 04:52 AM
మదురై శుభశ్రీకి ఔషధ మొక్కల పెంపకమంటే కాలక్షేపం కాదు. ప్రాచీన వైద్య సంప్రదాయాల్ని పరిరక్షించే ఒక యజ్ఞం. అయిదువందలకు పైగా అరుదైన జాతులకు నెలవైన ఆమె ఔషధ వనం ఇప్పుడు పరిశోధనా విద్యార్థులకు అధ్యయన కేంద్రంగా మారింది.
మదురై శుభశ్రీకి ఔషధ మొక్కల పెంపకమంటే కాలక్షేపం కాదు. ప్రాచీన వైద్య సంప్రదాయాల్ని పరిరక్షించే ఒక యజ్ఞం. అయిదువందలకు పైగా అరుదైన జాతులకు నెలవైన ఆమె ఔషధ వనం ఇప్పుడు పరిశోధనా విద్యార్థులకు అధ్యయన కేంద్రంగా మారింది.
అది తమిళనాడులోని మదురైకి దగ్గర్లోని వరిచియూర్‌లో ఉన్న తోట. యాభై అయిదేళ్ళ మహిళ.. ఒక్కొక్క మొక్క దగ్గరా ఆగుతూ... వాటి విశిష్టతను వివరిస్తూ ఉంటే... స్టడీ టూర్‌లో భాగంగా అక్కడికి వచ్చిన విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. చాలా సాధికారికంగా వాటి గురించి ఆమె చెప్పడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘‘వృత్తి రీత్యా నేను టీచర్‌ని. ఎవరికి ఎలా చెబితే అర్థమవుతుందో నాకు తెలుసు’’ అంటారామె నవ్వుతూ. ఆమె పేరు బి.శుభశ్రీ. ఆ తోటలోని ప్రతి మొక్క ఆమె చేతుల మీదుగా పెరిగిందే. అపురూపమైన ఈ తోట... ఆమె అకుంఠిత దీక్షకు ప్రతిరూపం.
ఆ అనుభవంతోనే...
‘‘ఔషధ మొక్కల మీద నా ఆసక్తి ఈనాటిది కాదు. దాదాపు నలభయ్యేళ్ళ క్రితం మా నాన్నను పాము కరిచింది. అప్పట్లో ఇన్ని వైద్య సౌకర్యాలు లేవు. పాము కాటును నయం చేసే ఒక మొక్క గురించి తెలిసి... దాని కోసం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గాలించాం. చివరికి సంపాదించాం. మా నాన్న ప్రాణం దక్కింది. ఈ అనుభవమే... వైద్యానికి ఉపయోగపడే మొక్కల గురించి ఇంకా తెలుసుకోవాలనే తపన పెరిగింది.
వాటిని సేకరించి, పెంచడం ప్రారంభించాను’’ అని గుర్తు చేసుకున్నారు శుభశ్రీ. చదువు పూర్తి చేసుకొని ఆమె ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. ఉద్యోగ బాధ్యతల్లో, కుటుంబ బాధ్యతల్లో తీరికలేకుండా ఉన్నా... మొక్కలను సంరక్షించే పని మాత్రం వదిలిపెట్టలేదు. అలా కొన్ని వందల మొక్కలకు తన పెరట్లో ఆమె ఆశ్రయం కల్పించారు. ‘‘అయితే వాటి గురించి నా పరిచయస్తులకు తప్ప మరెవరికీ పెద్దగా తెలీదు.
నేనూ పెద్దగా ప్రచారం చేసుకోలేదు. కానీ కొవిడ్ మహమ్మారి విజృంభించడంతో ఆయుర్వేదం ప్రయోజనాలను చాలామంది గుర్తించారు. ప్రత్యేకించి సిద్ధ ఔషధమైన ‘కబాసుర కుడినీర్’ను ఇమ్యూనిటీ పెరుగుదల కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రోత్సహించింది. ఇది నేను కొత్త దిశలో ఆలోచించేలా చేసింది’’ అంటారు శుభశ్రీ. మధురైకి పదిహేడు కిలోమీటర్ల దూరంలోని వరిచియూర్‌లో... తమ నలభై సెంట్ల భూమిలో ఔషధ మొక్కల వనాన్ని ఆమె ప్రారంభించారు.
సాగునీటి కోసం బోర్‌వెల్, మొక్కల రక్షణ కోసం ఇనుప కంచె ఏర్పాటు లాంటివాటికి చాలా ఖర్చుచేశారు. దానికి ఆమె భర్త, పిపిఎ్‌ఫఓ మాజీ ఉద్యోగి బి.బాబు పూర్తి సహాయసహకారాలు అందించారు. ప్రస్తుతం ఆ తోటలో 500కు పైగా అరుదైన, విశిష్టమైన ఔషధ మొక్కలు ఉన్నాయి. ప్రతిదాని స్థానిక పేరును, శాస్త్రీయ నామాన్ని, ప్రయోజనాలను శుభశ్రీ చాలా వివరంగా నమోదు చేశారు. ఆమెను అందరూ ’ఔషధ మొక్కల టీచర్’ అని ఆప్యాయంగా పిలుస్తారు.
సంప్రదాయానికి కొనసాగింపు
అయితే అపురూపమైన ఔషధ మొక్కల కోసం తను సాగిస్తున్న అన్వేషణ అంత సజావుగా సాగడం లేదంటారు శుభశ్రీ. ‘‘ఆయుర్వేద వైద్యుల ద్వారా, వృక్షశాస్త్ర నిపుణుల ద్వారా, పెద్దల ద్వారా, పుస్తకాల ద్వారా గొప్ప మొక్కల గురించి తెలుసుకుంటూ ఉంటాను. వాటి కోసం ప్రయత్నిస్తాను. కొన్ని నర్సరీలు నకిలీ మొక్కల్ని లేదా ఎదగడానికి అవకాశం లేని నాసిరకం మొక్కల్ని అంటగడుతూ ఉంటాయి.
కొన్ని మొక్కల్ని సంపాదించడం చాలా కష్టం. ఒకసారి ఒక నర్సరీలో జలుబు నివారణతో పాటు క్యాన్సర్ రోగులకు స్వస్థత కలిగించే ఒక మొక్క ఉందని తెలిసింది. అక్కడికి వెళ్ళాను. తమ దగ్గర అవి లేవని యజమాని చెప్పాడు. మూడు నెలల తరువాత అతను నాకు కాల్ చేసి... ఆ మొక్క ఉంది. రమ్మన్నాడు.
అది కొనడానికి వెళ్తే... స్టాక్ అయిపోయిందన్నాడు. నాకు కోపం, నిరాశ కలిగాయి. వెనక్కి వస్తూ ఉంటే... అక్కడ పని చేస్తున్న ఒక పెద్దాయన నా దగ్గరకు వచ్చారు. నేను పడుతున్న తాపత్రయాన్ని అర్థం చేసుకున్నానని చెబుతూ... నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ‘‘అది వస్తే నేను కొని, నా దగ్గర ఉంచుతాను. మీకు సమాచారం ఇస్తాను. వచ్చి తీసుకోండి’’ అన్నారు. రెండు వారాల తరువాత ఆయన మాట నిలబెట్టుకున్నారు’’ అని చెప్పారు శుభశ్రీ. ఇప్పుడు ఆమె గార్డెన్ విద్యార్థులకు, పరిశోధకులకు, వృక్ష ప్రేమికులకు ఒక రిసోర్స్ సెంటర్‌గా మారింది. అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు స్టడీ టూర్ల కోసం అక్కడికి వస్తున్నారు. ప్రతి మొక్క ప్రాధాన్యత గురించి వారికి శుభశ్రీ వివరిస్తారు. వారు విశ్రాంతి తీసుకోవడం కోసం చిన్న కుటీరం లాంటి ఏర్పాట్లను కూడా చేశారు.
అంతేకాదు... ఔషధ మొక్కల విలువ, అవసరం, సంరక్షణ గురించి ప్రజలకు తెలియజెయ్యడానికి వర్క్‌షాపులను, అవగాహన తరగతులను నిర్వహిస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఔషధ మొక్కలు పెంచాలనుకొనేవారికి తనవంతు సాయం చేస్తున్నారు. ‘‘ఇది కేవలం మొక్కల సేకరణ మాత్రమే కాదు.
ఇది సంప్రదాయ విజ్ఞాన సంప్రదాయానికి కొనసాగింపు. ప్రాచీన వైద్యవిధానాల పట్ల అవగాహనను పెంపొందించే ప్రయత్నం. ఈ గార్డెన్ లక్ష్యం... కేవలం సేంద్రియంగా ఔషధ మొక్కలను పెంచడం మాత్రమే కాదు... వాటికి సంబంధించిన అమూల్యమైన విజ్ఞానాన్ని పదిలపరచి, భవిష్యత్ తరాలకు అందించడం, ఇంటింటా ఒక హెర్బల్ గార్డెన్ ఏర్పాటును ప్రోత్సహించడం కూడా’’ అంటున్నారు శుభశ్రీ.
Updated Date - Sep 09 , 2024 | 04:52 AM