Navya : భూలోకంలో అమృతం మజ్జిగ
ABN, Publish Date - Jul 20 , 2024 | 05:42 AM
సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు
అమరత్వం యథా స్వర్గం దేవానామమమృతాద్భవేత్!
తక్రాద్భూమౌ తథా నృణామమరత్వం హి జాయతే!
సమస్త దోషాలనూ హరింపచేసే మజ్జిగని మానవులు తప్పనిసరిగా తాగాలి. అమరత్వం కోసం స్వర్గంలో దేవతలకు అమృతాన్ని, భూమ్మీద మానవులకు మజ్జిగని ఇచ్చాడు పరమాత్ముడు. మంచినీళ్లు అడిగితే మజ్జిగ ఇచ్చి పంపే సంస్కృతి మనది. మజ్జిగ లేదా చల్లకూ... తెలుగువారికీ అనుబంధం అనాదిగా ఉంది.
క్షేమశర్మ తన ‘క్షేమకుతూహలం’ గ్రంథంలో మజ్జిగతో అనేక ప్రయోగాలు చెప్పాడు. మజ్జిగని సంస్కృతంలో ‘తక్రం’ అంటారు. ‘తక్రం’ ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధి నివారణకూ పనికొచ్చే ఔషధం. వాపుల్ని కరిగించే శక్తి ఉంది. మొత్తం జీర్ణాశయ వ్యవస్థని బల సంపన్నం చేస్తుంది. లివరు, స్ప్లీను లాంటి మృదువైన అవయవాలలో కలిగే వ్యాధుల్ని నివారిస్తుంది. రక్త పుష్టి ఇస్తుంది. తీసుకున్న ఆహారంలో పోషకాలు వంటబట్టేలా చేస్తుంది. వేసవిలోనే కాదు, అన్ని కాలాల్లో తీసుకోదగిన ఔషధం మజ్జిగ. నెయ్యి, నూనెలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు మజ్జిగ తాగితే ఆ దోషం పోతుంది. జఠరాగ్నిపెరుగుతుంది.
కొందరికి మజ్జిగంటే పడదు. దాని వాసన సరిపడకపోవటం ఒక కారణం. ఇంకొందరికి మజ్జిగ తాగితే జలుబు చేస్తుందని భయం. మరికొందరికి మజ్జిగ అరగదనీ, త్రేన్పులు వస్తాయని అనుమానం. మజ్జిగలో నీళ్లు తప్ప ఏమీ లేవనే అభిప్రాయం కూడా కొందరిలో ఉంది. ఇవన్నీ మజ్జిగ ఉపయోగాలు తెలియక పెంచుకున్న అపోహలు.
ఒక గ్లాసు పెరుగుని చిలికి మూడు నుండి ఎనిమిది గ్లాసుల నీళ్లు కలిపి ఒక పూటంతా ఉంచాలి. ఆ పెరుగులో ఉన్న ఉపయోగపడే బాక్టీరియా ఆ నీళ్ల నిండా పెరుగుతాయి. ఈ ఉపయోగపడే బాక్టీరియా కోసమే మజ్జిగ. దీన్ని ప్రోబయాటిక్ ఔషధంగా చెబుతారు. జీర్ణశక్తి బలంగా ఉండాలంటే ఈ ప్రోబయాటిక్ కావాలి. అందుకు మజ్జిగే మంచి ఉపాయం. పాల కన్నా పెరుగు మంచిది. పెరుగు కన్నా చిలికిన మజ్జిగ తాగేవారి శరీరానికి వృద్ధాప్యం వచ్చినా పేగులకు రాదు.
మజ్జిగ అంటే పూర్ణచంద్రుడిలా, మల్లెపువ్వులా, శంఖంలా తెల్లగా ఉండాలి. బాగా చిలికితే తేలికగా అరుగుతాయి. ఫ్రిడ్జ్‌లో ఉంచిన మజ్జిగైతే దాని చల్లదనం పోయేదాకా బయటే ఉంచి తీసుకుంటే జలుబు చెయ్యదు. ఈ పెద్ద గ్లాసు మజ్జిగలో అరచెంచా నెయ్యి కలిపి, తగినంత సైంధవ లవణం, చిటికెడు ఇంగువ చేర్చి తాగితే అన్ని వ్యాధుల మీదా ఔషధంగా పని చేస్తుంది. అన్నంలో కూడా తినవచ్చు.
పెరుగుని చిలికి, దానికి మూడు నుంచి ఎనిమిది రెట్లు నీళ్లు పోసి, రాత్రంతా ఫ్రిడ్జ్‌లో కాకుండా బయటే ఉంచాలి. ఉదయాన్నే అందులో సైంధవ లవణం, జీలకర్ర, కాల్చిన శొంఠి దంచి, ఆ పొడి తగుపాళ్లలో కలిపి రోజూ తాగితే వాతం, పైత్యం, కఫ దోషాలు పోతాయి. కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాసు, మంట తగ్గుతాయి. మొలల వ్యాధి కూడా తగ్గుతుంది. అజీర్తి పోతుంది. షుగరు, బీపీ, స్థూలకాయం, కీళ్లవాతం, చర్మ వ్యాధులు. సైనసైటిస్, మైగ్రేన్ తలనొప్పికి మంచి ఔషధం.
శొంఠి, మిరియాలు, ఉప్పు, జీలకర్ర, కమలాపండు పైన తొక్కలను తగు పాళ్లలో తీసుకొని, దంచి, ఆ పొడిని చిలికిన మజ్జిగలో కలపాలి. ఇంగువ పొంగించిన నెయ్యితో తిరగమోత పెడితే ఆ మజ్జిగని ‘గౌరీ తక్రం’ అంటారు. దీన్ని పార్వతీదేవి శివుడి కోసం తయారు చేసిందన్నాడు క్షేమశర్మ. ఇది ఆకలిని పుట్టిస్తుంది. తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. సమస్త వ్యాధుల్లోనూ ఔషధం. దీని రుచి ‘దివ్యం’ అన్నాడు.
పులిసిన మజ్జిగలో ఎనిమిది రెట్లు నీళ్లు కలిపి, ఔషధంగా మలుచుకోవచ్చు. వాత వ్యాధుల్లో సైంధవ లవణం (పింక్ సాల్ట్), పైత్య వ్యాధుల్లో చక్కెర, కఫ వ్యాధుల్లో శొంఠి, పిప్పలి, మిరియాల పొడి కలిపి తాగాలన్నాడు.
నిన్నటి మజ్జిగ మిగిలిపోతే ఒక వస్త్రంలో పోసి, మూటగట్టి, వడగట్టండి. సైంధవ లవణం, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, పిప్పళ్లు, శొంఠి, ఇంగువ, ఆవాలు, మెంతులు దంచి, ఆ పొడిని తగినంత కలిపిన మజ్జిగని ‘అచ్చిక’ అంటారు. ఇది అన్ని దోషాల మీదా పని చేస్తుంది. ముఖ్యంగా అజీర్తిని పోగొడుతుంది. భోజనం చేసిన తరువాత పైన చెప్పిన పద్ధతుల్లో ఏదైనా మజ్జిగని ఎంచుకుని, రోజూ తాగుతుంటే భుక్తాయాసం కలగదు. తీసుకున్న ఆహారం తేలికగా అరుగుతుంది. అన్నంలో విష దోషాలు పోతాయి. చర్మానికి మంచి కాంతి వస్తుంది. స్థూలకాయం తగ్గుతుంది. నరాలకు ఉత్తేజం కలుగుతుంది. షుగరు రోగులు ఈ మజ్జిగని తాగితే షుగరు త్వరగా అదుపులోకి వస్తుంది.
Updated Date - Jul 20 , 2024 | 05:42 AM