Navya : దీపికకు మేకప్ చేసేది నేనే!
ABN, Publish Date - Aug 24 , 2024 | 05:29 AM
చిన్నప్పుడు అమ్మ మేకప్ కిట్ తస్కరించిన అమ్మాయి... ఇప్పుడు బాలీవుడ్ భామల అందానికి మెరుగులు అద్దుతోంది. కార్పొరేట్ కొలువును కాదనుకుని... అభిరుచికి పట్టం కట్టి... చిత్ర పరిశ్రమలో తిరుగులేని కెరీర్‌ను నిర్మించుకుంది. దీపికా, అలియా, కత్రినా, కరీనా... అందరికీ అభిమానమేకప్ ఆర్టిస్ట్ అయిన సంధ్యా శేఖర్ జర్నీ ఇది.
చిన్నప్పుడు అమ్మ మేకప్ కిట్ తస్కరించిన అమ్మాయి... ఇప్పుడు బాలీవుడ్ భామల అందానికి మెరుగులు అద్దుతోంది. కార్పొరేట్ కొలువును కాదనుకుని... అభిరుచికి పట్టం కట్టి... చిత్ర పరిశ్రమలో తిరుగులేని కెరీర్‌ను నిర్మించుకుంది. దీపికా, అలియా, కత్రినా, కరీనా... అందరికీ అభిమానమేకప్ ఆర్టిస్ట్ అయిన సంధ్యా శేఖర్ జర్నీ ఇది.
‘‘ఇది నేను కోరివచ్చిన రంగం. కానీ ఈ స్థాయికి వస్తానని, ఇంతమంది అభిమాన తారలకు రంగులు అద్దుతానని ఎన్నడూ ఊహించలేదు. చిన్నప్పటి అభిరుచే నన్ను ఇక్కడివరకు నడిపించింది. కర్ణాటకలోని ఉడుపి మా సొంత పట్టణం. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తయింది. ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్‌లో ఎంబీఏ చదివాక యస్‌బ్యాంక్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. ఎందుకో తెలియదు... ఆ కార్పొరేట్ కొలువు నాకు అస్సలు నచ్చలేదు. ఉదయం లేవడం... ఆఫీ్‌సకు పరుగెత్తడం... తిరిగి ఇంటికి రావడం... ‘ఇదేనా జీవితం’ అనిపించింది. అతి కష్టం మీద పన్నెండు నెలలు గడిచాయి.
వద్దంటే వినలేదు...
ఉద్యోగం మానేస్తానని అమ్మానాన్నలకు చెప్పాను. ‘మానేసి ఏంచేస్తావ్’ అన్నారు. మేకప్ ఆర్టి్‌స్టగా కొత్త కెరీర్ ప్రారంభిస్తానని బదులిచ్చాను. వాళ్లు వద్దంటే వద్దన్నారు. రెండు నెలలు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను.
అయినా వారి నిర్ణయం మార్పు రాలేదు. ఇంత మంచి ఉద్యోగం వదిలేసి, ఏమాత్రం అవగాహన లేని రంగంలోకి దూకుతానంటే ఏ తల్లితండ్రులైనా అలానే స్పందిస్తారు. వాళ్ల ఆందోళన నాకు అర్థమవుతోంది. కానీ దాని కోసం నా ఇష్టాన్ని చంపుకోదలుచుకోలేదు.
చివరకు 2005లో, నా పుట్టినరోజునాడు ఇల్లు వదిలి బెంగళూరు వెళ్లిపోయా. ప్రొఫెషనల్ మేకప్ కోర్సులు ఎక్కడెక్కడ నేర్పిస్తారు? నేర్పించేవారికున్న అర్హతలేమిటి? ఇలా నగరమంతా తిరిగి అన్నిటి గురించీ తెలుసుకున్నా.
చిన్న కోర్సుతో...
నాకున్న అవగాహనతో మొదట బెంగళూరులో నాకు తెలిసిన ఒక హెయిర్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ దగ్గర చిన్న కోర్సు నేర్చుకున్నాను. తరువాత బ్రిటన్ వెళ్లాను. అక్కడి ‘లండన్ స్కూల్ ఆఫ్ బ్యూటీ అండ్ మేక్‌ప’లో నెల రోజుల కోర్సు పూర్తి చేశాను. తిరిగి వచ్చాక ముంబయిలో మరో ప్రొఫెషనల్ కోర్సు నేర్చుకున్నాను.
ఇప్పటికీ నేర్చుకోవడం నా వృత్తిలో ఒక భాగం అయింది. దానికోసం దేశవిదేశాల్లోని వర్క్‌షా్‌పలు, మాస్టర్‌క్లా్‌సలు, ట్రేడ్ ఎగ్జిబిషన్లకు వెళుతూ ఉంటాను. వాటివల్ల ప్రస్తుత ట్రెండ్, నూతన పద్ధతులు తెలుసుకొనే అవకాశం కలుగుతుంది.
అలా తిరిగింది...
నా కెరీర్‌కు అతిపెద్ద బ్రేక్ వచ్చింది మాత్రం ఎంటీవీ ప్రోమో షూట్‌తో. దాని కోసం నేను మేకప్, హెయిర్ డ్రెస్సింగ్ చేశాను. అది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుంచి నా ప్రయాణం జెట్ స్పీడ్ అందుకుంది. కొన్ని టీవీ షోలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించాను. ఔత్సాహికులకు తరగతులు నిర్వహిస్తున్నాను. గెస్ట్ లెక్చర్స్ ఇస్తున్నాను.
దీపికా పదుకొనే, కత్రినా కైఫ్, అనుష్కా శర్మ, కంగనా రనౌత్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అదితీరావ్ హైదరీ, పరిణీతి చోప్రా తదితర టాప్ బాలీవుడ్ స్టార్స్‌కు మేకప్ వేశాను. ముఖ్యంగా దీపికా పదుకొనేకు అయితే కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్, మెట్ గాలా, కొన్ని అంతర్జాతీయ మ్యాగజైన్స్ కోసం పని చేశాను.
ఆమె పెళ్లి మేకప్ కూడా నేనే వేశాను. అన్నిటికంటే ప్రతిష్టాత్మక మెట్ గాలా కోసం దీపికను ముస్తాబు చేయడాన్ని నేను ఎంతో గౌరవంగా భావిస్తాను. అలాగే కేన్స్ ఉత్సవానికి కూడా. ఇది నాకు దక్కిన అద్భుత అవకాశం.
ప్రముఖులు ఎందరితోనో...
ఈ వృత్తిలోకి వచ్చాక సితారా కుడిగె పనితనం నాకు ప్రేరణనిచ్చింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. ఏ రంగంలోనైనా పోటీని తట్టుకొని నిలబడాలంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి కదా. దాని కోసం నేనూ ప్రయత్నించాను. ఇప్పుడు నా పేరు చెప్పగానే ‘నో మేకప్ లుక్స్’ అనే ట్యాగ్‌లైన్ గుర్తుకువస్తుంది పరిశ్రమలో ఎవరికైనా.
ఇదే నా మేకప్ ప్రత్యేకత. అందానికి మెరుగులు అద్దాలే కానీ, మేకప్ పేరుతో సహజ సౌందర్యాన్ని దాచేయకూడదనేది నా ఉద్దేశం. అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన ఫ్రెంచ్ హెయిర్ డ్రెస్సర్ లారెంట్ ఫిలిప్పన్, అమెరికా మేకప్ ఆర్టిస్ట్ రోషర్‌తో కలిసి కొన్ని ప్రాజెక్ట్స్‌లో పని చేశాను. ఆ అనుభవం నాకు ఎన్నో పాఠాలు నేర్పింది.
అలాగే వోగ్, హార్పర్ బజార్, గ్రాజియా, జీక్యూ, కాస్మోపాలిటన్ తదితర మ్యాగజైన్లు, టెలివిజన్ కమర్షియల్స్‌కు సేవలు అందించాను. అందుకే చెబుతున్నాను... మనసు చంపుకొని పని చేయవద్దు. నచ్చిన రంగంలో మనసు పెట్టి కష్టపడితే విజయం తప్పక వరిస్తుంది.’’
ఎన్నడూ ఊహించలేదు...
నాకు చిన్నప్పటి నుంచి మేకప్ అంటే అమితమైన ఇష్టం. అందుకు మా అమ్మే నాకు ప్రేరణ. ఆవిడ మేకప్ వేసుకోవడం చూసి నాకూ ఆసక్తి కలిగింది. ఒకసారి తన మేకప్ కిట్ తస్కరించి, ఎవరికీ తెలియకుండా నాకు నేను మేకప్ వేసుకున్నాను. నన్ను నేను చూసుకుని మురిసిపోయాను. వయసుతోపాటు ఆ అభిరుచి కూడా నాలో అంతర్లీనంగా పెరుగుతూ వచ్చింది.
కెరీర్ ఆరంభంలో కొన్నాళ్లు బ్రైడల్ మేకప్‌లు కూడా చేశాను. రోజువారీ ఖర్చుల కోసం. అయితే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. అసలు అది నా ఊహల్లోనే లేదు. ఈ వృత్తి పట్ల నాకున్న అంకితభావం, కష్టపడి పని చేసే తత్వమే ఇవాళ నన్ను ఇంత ఎత్తులో నిలబెట్టిందనేది నా నమ్మకం.
Updated Date - Aug 24 , 2024 | 05:29 AM