Navya : మరిచిపోయినా... మరపురాని వంటకాలు
ABN, Publish Date - Jul 20 , 2024 | 06:02 AM
కొన్ని వంటకాలు కాలక్రమేనా మరుగవుతుంటాయి. ఎందుకిలా అవుతుంటాయో మనకు తెలీదు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వంటకాలు.. తూకా రోటీ, కొబ్బరిపాలు పులావ్, కిబ్తి, గ్రేటెడ్ కార్న్ స్నాక్స్‌ను వండుకోవచ్చు ఇలా..
గ్రేటెడ్ కార్న్ స్నాక్
కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ కంకులు- 4, పచ్చిమిర్చి- 2 (సన్నగా తరగాలి), అల్లం- చిన్న ముక్క (సన్నగా తరగాలి), శనగపప్పు- 2 టీస్పూన్లు, పసుపు- చిటికెడు, ఉప్పు- రుచికి సరిపడ, ధనియాల పొడి- పావు టీస్పూన్, యాలకులు- 3, ఆవాలు- పావు టీస్పూన్, నూనె- 2 టీస్పూన్స్, నెయ్యి- టీస్పూన్, కొత్తిమీర- 2 టేబుల్ స్పూన్లు, తురిమిన ఎండుకొబ్బరి- 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ- 1
తయారీ విధానం: స్వీట్‌కార్న్ గింజలు తీసి మిక్సీ పట్టాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్‌లో వేసి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలపాలి. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెండు నిముషాలు గరిటెతో తిప్పాక.. కప్పు నీళ్లు పోసి.. మూత పెట్టకుండా మాత్రమే లోహీట్‌లో ఇరవై నిముషాల పాటు ఉంచితే బాగా ఉడుకుతుంది. స్వీట్‌కార్న్ మిశ్రమాన్ని బౌల్‌లో ఉంచి చల్లబర్చాలి.
గుంతప్యాన్‌లో నూనె, నెయ్యి కలిపి వేడి చేయాలి. ఇందులో శనగపప్పు, ఆవాలు వేసి కలపాలి. చేత్తో యాలకులు నలిపి వేయాలి. లోహీట్‌లో ఉంచి స్వీట్‌కార్న్ మిశ్రమం వేయాలి. ఇందులో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి ఇరవై నిముషాల పాటు కలపాలి. అంటే ఉప్మాలా కలపాలి. దీన్ని పొయ్యి మీద నుంచి తీసేసి ఐదు నిముషాల పాటు చల్చార్చాలి. ఆ తర్వాత కొబ్బరి తురుము, కొత్తిమీర, నిమ్మరసం చల్లుకుని కలపాలి. ఈ స్వీట్‌కార్న్ స్నాక్ రుచికరంగా ఉంటుంది.
కొబ్బరిపాల పులావ్
కావాల్సిన పదార్థాలు: నూనె- 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర- టీస్పూన్, యాలకులు-2, దాల్చిన చెక్క-1, లవంగాలు- 4, సోంపు- అర టీస్పూన్, బిర్యానీ ఆకు-1, జీడిపప్పు- 12, ఉల్లిపాయ-1 (సన్నగా తరగాలి), అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టీస్పూన్, క్యారెట్- 1 (సన్నగా తరగాలి), బీన్స్- 5 (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి- 2, బఠాణీలు- 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరిపాలు- 2 కప్పులు, బాస్మతి బియ్యం- కప్పు(ఇరవై నిముషాలు నానబెట్టాలి), తరిగిన కొత్తిమీర- 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడ
తయారీ విధానం: కుక్కర్‌లో నూనె వేసి జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, బిర్యానీ ఆకు వేసి లోఫ్లేమ్‌లో కలపాలి. మంచి సువాసన వస్తుంది. జీడిపప్పు వేసి రంగుమారేంత వరకూ కలపాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిలువుగా చీరిన పచ్చిమిర్చి వేయాలి. క్యారెట్, బీన్స్ ముక్కలతో పాటు బఠాణీలు వేసి రెండు నిముషాలు కలపాలి. వెంటనే కొబ్బరి పాలు పోయాలి. మూడు నిముషాలు ఉడికిన తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. కుక్కర్ మూత క్లోజ్ చేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ కుక్ చేయాలి. ఆ తర్వాత గరిటెతో బాస్మతి బియ్యం విరక్కుండా మెల్లగా కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరి.. కొబ్బరిపాల పులావ్ రెడీ.
తూకా రోటీ
కావాల్సిన పదార్థాలు
బియ్యం- 500 గ్రాములు, పచ్చిమిర్చి- 8, మీడియం సైజ్ ఉల్లిపాయ-1 (సన్నగా తరగాలి), కొత్తిమీర- టేబుల్ స్పూన్, ఉప్పు- తగినంత, ఎండు మిర్చి గింజలు- టీ స్పూన్, నూనె- 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
బియ్యాన్ని మెత్తగా అయ్యేంత వరకూ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత బియ్యాన్ని తీసి జార్‌లో వేయాలి. వీటితో పాటు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాలి. ఈ పేస్ట్‌ను బౌల్‌లో వేసి.. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, ఎండుమిర్చి గింజలు, నూనె వేసి మెత్తగా కలపాలి. ఈ పిండితో చపాతీల్లా ఒత్తుకుని.. ప్యాన్‌మీద కొద్దిగా నూనె వేసి స్పూన్‌తో ప్యాన్ అంతా స్ర్పెడ్ అయ్యేట్లు చేసిన తర్వాత ఈ రోటీని రెండు వైపులా కాల్చుకోవాలి. ప్రతి రోటీ కాల్చే ముందు ప్యాన్ మీద నూనె చిలకరించాలి. ఈ రోటీలను స్నాక్స్‌లా తినొచ్చు లేదా చట్నీ, ఊరగాయలతో తినొచ్చు.
కిబ్తి
కావాల్సిన పదార్థాలు
పెద్ద ఉల్లిపాయ-1 (సన్నగా తరగాలి), ధనియాల పొడి- టీస్పూన్, కారంపొడి- టీస్పూన్, కుంకుమపువ్వు- కొద్దిగా, బాదాం- 20, నెయ్యి- ఫ్రైకి తగినంత
మారినేషన్ కోసం
బోన్‌లెస్ చికెన్ థై- 8, పెరుగు- 4 టేబుల్ స్పూన్లు, నల్ల మిరియాలు- 8, యాలకులు- 5, బాదాం- 12, లవంగాలు- 4, అల్లం వెల్లుల్లి పేస్ట్- టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి ముక్కలు- అర టీస్పూన్, ఉప్పు- రుచికి తగినంత
తయారీ విధానం
ముందుగా నల్లమిరియాలు, యాలకులు, లవంగాలను వేయించి పొడిగా చేసుకుని ఉంచుకోవాలి. బౌల్‌లో చికెన్ ముక్కలు వేసి పెరుగుతో పాటు తయారు చేసుకున్న పొడి వేయాలి. పది ఆల్మండ్స్‌ను వేడినీటిలో నానబెట్టి పొట్టును తీసేసి ముక్కలుగా తరిగి వేయాలి. ఈ మిశ్రమంలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి నలభై ఐదు నిముషాల పాటు మారినేట్ చేసుకోవాలి.
ప్యాన్‌లో టీస్పూన్ నెయ్యి వేసి పది ఆల్మండ్స్‌ను వేయించాలి. వీటిని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ మీద చికెన్ ముక్కలు ఉంచి రెండు వైపులా మీడియం హీట్‌లో రంగు మారేంత వరకూ వేయించాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకూ వేయించాలి. ఇందులోకి కారంపొడి, ధనియాల పొడి వేసి కలపాలి. చికెన్ ముక్క జ్యూసీగా ఉన్నట్లు కనపడిన వెంటనే ఇందులోకి నెయ్యి చిలకరించి.. కుంకుమ పువ్వు వేయాలి. గరిటెతో బాగా కలపాలి. చివరగా వేయించిన బాదం పలుకులతో గార్నిష్ చేసుకుని స్నాక్స్‌లా తినాలి.
Updated Date - Jul 20 , 2024 | 06:02 AM