ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మనాలీ మారథాన్‌ క్వీన్‌

ABN, Publish Date - Sep 23 , 2024 | 04:07 AM

లడఖ్‌ మారథాన్‌లో భాగమైన సిల్క్‌ రూట్‌ అలా్ట్ర 122 కి.మీ మేర సాగుతుంది. ఈ మారథాన్‌ను 18 గంటల్లో పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు డోల్మా.

పదిహేనేళ్ల వయసులో పెళ్లి.... పద్దెనిమిదేళ్లు వచ్చే సరికి ఇద్దరు పిల్లలు. బాల్యంను గుర్తు చేసుకుంటే కన్నీళ్లే తప్ప తీపి జ్ఞాపకాలు ఏమీ లేవు. కానీ ఇప్పుడు మారథాన్‌లో రికార్డులు సృష్టిస్తూ అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్నారు. మనాలీకి చెందిన టెంజిన్‌ డోల్మా మారథాన్‌ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.

లడఖ్‌ మారథాన్‌లో భాగమైన సిల్క్‌ రూట్‌ అలా్ట్ర 122 కి.మీ మేర సాగుతుంది. ఈ మారథాన్‌ను 18 గంటల్లో పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు డోల్మా. కానీ 17 గంటల 3 నిమిషాల్లోనే పూర్తి చేసి మారథాన్‌లో అందరి మన్ననలు అందుకున్నారు. 30 ఏళ్ల వయసులో మారథాన్‌ మొదలుపెట్టి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారామె. అలా అని తను మారథాన్‌లో ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు. మారథానర్‌గా మారడం యాదృచ్చికంగా జరిగిపోయిందని అంటారు డోల్మా. హిమాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల గ్రామం కొమిక్‌లో జన్మించారామె.


ఆసియాలోనే ఎత్తైన గ్రామంగా కొమిక్‌కు గుర్తింపు ఉంది. డోల్మా చిన్నతనంలో వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమయింది. దాంతో ఏడో తరగతి తరువాత చదువు మానేసింది. తండ్రి చనిపోవడంతో ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. నలుగురు తోబుట్టువులలో డోల్మా చిన్నది. 15 ఏళ్లకే తనకు పెళ్లి చేశారు. 18 ఏళ్లు వచ్చే సరికి ఒక బాబు, ఒక పాప జన్మించారు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంతోనే సరిపోయేది. కానీ 3 సెప్టెంబరు 2017 ఆమె జీవితాన్నే మార్చేసింది. లడఖ్‌ హాఫ్‌ మారథాన్‌లో పాల్గొని విజేతగా నిలిచింది డోల్మా. ‘‘ఆ రోజు నా జీవితం మారిపోయింది’’ అని అంటారు డోల్మా. 30 ఏళ్ల వయసులో ఎలాంటి శిక్షణ, ఆటల్లో ఆనుభవం లేకున్నా 21.9 కి.మీ మారథాన్‌లో విజేతగా నిలిచారు డోల్మా.


  • పరుగు ఇలా మొదలు

ఏడేళ్ల క్రితం డోల్మీ స్నేహితురాలు మనాలీలో జరుగుతున్న 21కె మారథాన్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఆమె సూచన మేరకు డోల్మీ కూడా తన పేరు నమోదు చేసుకున్నారు. ఆ మారథాన్‌లో అనుభవం ఉన్న రేసర్లు, పోలీస్‌ ఫోర్స్‌లో పనిచేస్తున్న మహిళలను వెనక్కినెట్టి డోల్మీ విజేతగా నిలిచారు. ‘‘ఆ గెలుపు నాకు ఎంతో ఆనందానిచ్చింది. నేను పరుగెత్తడం ప్రారంభించగానే నా కళ్లముందు నా బాల్యం కదలాడింది. గమ్యాన్ని చేరుకునే వరకు పరుగును ఆపొద్దని అనుకున్నా’’ అని ఆనాటి సంగతులను పంచుకుంటారు డోల్మా. భర్త, కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభించడంతో ఆత్మవిశ్వాసంతో ఆ మారథాన్‌లో పాల్గొని విజేతగా నిలిచింది.


  • అదే నాకు శిక్షణ

లేహ్‌-మనాలీ హైవేపై నిర్వహించిన 480 కి.మీ మారథాన్‌ డోల్మాకు ఒక ఛాలెంజింగ్‌గా నిలిచింది. ఈ మారథాన్‌ను పూర్తి చేయడానికి శారీరకంగా దృఽడంగా ఉంటే సరిపోదు. ఉక్కు సంకల్పం కూడా కావాలి. ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉండే ఎత్తైన ప్రాంతాలలో, మంచు వాతావరణంలో మారథాన్‌ అంత సులభం కాదు. కానీ డోల్మా ఆ మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ‘‘ఒక్కోసారి రోజుకు 40 కి.మీ మాత్రమే పరుగెత్తడానికి వీలయింది. అయితే మారథాన్‌ను పూర్తి చేయలేనని ఎప్పుడూ అనిపించలేదు’’ అని అంటారు డోల్మా. హెల్‌ అలా్ట్ర మారథాన్‌ను టైం లిమిట్‌లో పూర్తి చేసిన మొదటి మహిళగా డోల్మా గుర్తింపు సాధించారు. సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఉన్న లాహౌల్‌లో నిర్వహించిన స్నో మారథాన్‌లో మూడు సార్లు విజయం సాధించారు.


ఎముకలు కొరికే చలిలో జరిగే ఈ మారథాన్‌లో వరుసగా మూడేళ్లు తనే విజేతగా నిలిచారు. ‘‘కోచ్‌, శిక్షణ లేకుండా ఇన్నాళ్లుగా ఎలా పరుగెడుతున్నావు అని చాలా మంది నన్ను అడుగుతుంటారు. దానికి నా సమాధానం నేను పాల్గొన్న ప్రతి రేసు నాకు శిక్షణలా ఉపయోగపడింది’’ అని అంటారు డోల్మా. చక్కని ఆహారపు అలవాట్లు, యోగా, మంచి నిద్ర వంటివి కూడా డోల్మా విజయానికి కారణం. కొన్నేళ్లుగా డోల్మా జంక్‌ ఫుడ్‌ను ముట్టుకోవడం లేదు. ఇంట్లో వండిన ప్రొటీన్‌ ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. మనాలి సమీపంలో ఉన్న కోఠి అనే గ్రామంలో భర్తతో కలిసి కేఫ్‌ని నడుపుతున్నారామె. అక్కడికి సమీపంలో ఉన్న రోహతంగ్‌ లాను సందర్శించేందుకు పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఆ దారిలోనే ఈ కేఫ్‌ ఉంది. మూడు పదుల వయసులో మారథాన్‌ మొదలుపెట్టి రికార్డులు సృష్టించడం ద్వారా ఎంతో మంది యువతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు డోల్మా.

Updated Date - Sep 23 , 2024 | 04:43 AM