National Level kick Boxer : కూతురు కలే తనదిగా..!
ABN, Publish Date - Sep 09 , 2024 | 05:07 AM
‘‘పుట్టినప్పుడు మా అమ్మానాన్నలు నాకు పెట్టిన పేరు అక్రమ్ పాషా. కానీ పెరిగే క్రమంలో నాలో ఏవో విభిన్న భావాలు. చుట్టుపక్కల పిల్లల్లో నేను ప్రత్యేకంగా కనిపించేదాన్ని. అందరూ నన్ను వింతగా చూడడం మొదదలుపెట్టారు.
సంకల్పం
మైసూరు రోడ్ల మీద బిచ్చమెత్తుకున్న ఆమె... ఇప్పుడు తన కూతుర్ని జాతీయ స్థాయి కిక్‌బాక్సర్‌గా తీర్చిదిద్దింది.సమాజంలో తనకు దక్కని గౌరవాన్ని తన బిడ్డకు అందించింది. ఒకప్పుడు కన్నవారికే భారమై... అవమానాలు, అవహేళనలేజీవితమై... గడిపిన ఆమె నేడు ఎందరో తల్లులకు ఆదర్శంగా నిలిచింది. 65 ఏళ్ల ట్రాన్స్‌జెండర్ మహిళ షబనా అంతరంగం ఇది.
‘‘పుట్టినప్పుడు మా అమ్మానాన్నలు నాకు పెట్టిన పేరు అక్రమ్ పాషా. కానీ పెరిగే క్రమంలో నాలో ఏవో విభిన్న భావాలు. చుట్టుపక్కల పిల్లల్లో నేను ప్రత్యేకంగా కనిపించేదాన్ని. అందరూ నన్ను వింతగా చూడడం మొదదలుపెట్టారు. ఇది మా ఇంట్లోవాళ్లకు ఇబ్బందిగా మారింది. నేనేమిటో నాకు అర్థమయ్యేసరికి ఇంటికి దూరమయ్యాను. చెప్పాలంటే ట్రాన్స్‌జెండర్‌నని తెలిసి కన్నవారే నన్ను తరిమేశారు. దిక్కు తోచని స్థితిలో మైసూరు రోడ్లే నాకు దిక్కయ్యాయి. దీనికితోడు అవమానాలు, అవహేళనలు. ఆకతాయిలు ఆట పట్టించేవారు. సమాజంలో నాకంటూ ఒక చోటు లేదు. ఎక్కడికి వెళ్లినా పని దొరకలేదు. అన్నిటినీ భరించాను. అలా కొన్నేళ్లు గడిచాక పలు స్వచ్ఛంద సంస్థలు నన్ను చేరదీశాయి. ఆ సంస్థల సహకారంతో అక్కడా ఇక్కడా పని చేసుకొంటూ జీవించడం మొదలుపెట్టాను. నాతోపాటు నాలాంటి మరికొందరి జీవితాలకు కూడా ఆసరా చూపే ప్రయత్నం చేశాను.
ఆడపిల్లల్ని దత్తత తీసుకుని...
సమాజం నన్ను వెలివేసినా... కొందరి చేయూతవల్ల నేను స్వతంత్రంగా నిలబడగలిగాను. కానీ నా కష్టాలకు తోడు అనుకోని బరువు నా భుజాలపై పడింది. నా కజిన్‌కు నలుగురు ఆడపిల్లలు. పోషించే స్థోమత లేక వారిని రోడ్డుపాలు చేశాడు. సరైన నీడ, తిండి దొరక్క అవస్థలు పడుతున్న ఆ పిల్లల్ని చూసి నా గుండె బరువెక్కింది. మరో ఆలోచన లేకుండా ఆ నలుగురు ఆడపిల్లల్నీ నేను దత్తత తీసుకున్నాను. నాకు తెలుసు... నా జీవితం గడవడమే కష్టంగా ఉంది. అయినా నేను కాకపోతే ఆ చిన్నారులకు దిక్కెవరు? అందుకే ఆ సమయంలో నేను మరేమీ ఆలోచించలేదు. ఎలాగో వారిని పోషించుకొంటూ వచ్చాను.
ఆటపై మక్కువ చూసి...
నా నలుగురు అమ్మాయిల్లో బీబీ ఫాతిమా కాస్త భిన్నంగా కనిపించింది. ఇరవయ్యేళ్ల కిందట తను మా ఇంటికి వచ్చింది. తనకు కిక్‌బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. ఒక దృశ్యం నన్ను బాగా కదిలించింది. అప్పుడు ఫాతిమాకు పన్నెండేళ్లు. ఒక రోజు తన కిడ్డీ బ్యాంక్ పగులగొట్టి, అందులో దాచుకున్న నాణేలు తీసుకుని, స్థానిక ‘ఎలైట్ కిక్‌బాక్సింగ్ అకాడమీ’కి వెళ్లింది. ఆ డబ్బును వారి చేతిలో పెట్టి... తనకు కిక్‌బాక్సింగ్ నేర్పమని అడిగింది. అది చూసి నా కళ్లు చెమర్చాయి. అంత చిన్న వయసులో ఆట నేర్చుకోవాలన్న తన పట్టుదల నా ఆలోచనల్ని మార్చేసింది. రోజు గడవడం కష్టంగా ఉన్నా సరే... ఫాతిమాను అత్యున్నత క్రీడాకారిణిగా తిర్చిదిద్దాలనుకున్నా. ఆ రోజు నుంచి తన కలను నా కలగా మార్చుకున్నా.
నాకే దక్కినంత ఆనందం...
ఫాతిమాను రోజూ వెంటబెట్టుకుని అకాడమీకి తీసుకువెళ్లేదాన్ని. తను లోపల శిక్షణ తీసుకొంటుంటే... నేను బయట కూర్చొనేదాన్ని. ఒక్కోసారి ఉండబట్టలేక లోపలకు వెళ్లి తన సాధన చూసేదాన్ని. నా మనసు ఉప్పొంగిపోయేది. నా కష్టాన్ని నా బిడ్డ అర్థం చేసుకుంది. తన కోసమే కాదు... నా కళ్లల్లో మెరుపు కోసం కూడా తను కష్టపడింది. కోచ్ జస్వంత్, ‘కర్ణాటక కిక్‌బాక్సింగ్ అసోసియేషన్’ కార్యదర్శి రవి ఫాతిమాకు అండగా నిలిచారు. చక్కని మార్గదర్శనం చేసి... నైపుణ్యానికి పదును పెట్టారు. కోచ్‌లు ఫాతిమాను ప్రశంసిస్తుంటే... అవి నాకే దక్కినంత సంతోషించేదాన్ని.
కలలకు ప్రతిరూపం...
ఇప్పుడు ఫాతిమాకు ఇరవయ్యేళ్లు. పసిబిడ్డగా నా ఇంటికి వచ్చిన తను... ఎంతో ఎత్తుకు ఎదిగింది. నా కలలకు ప్రతిరూపమైంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి కిక్‌బాక్సింగ్ పోటీల్లో రాణించి ఎన్నో పతకాలు గెలుచు కుంది. ఇటీవలే ముగిసిన ‘కర్ణ్ణాటక స్టేట్ క్యాడెట్’ 46 కేజీల మహిళల లైట్ వెయిట్ విభాగంలో జూనియర్, సీనియర్, మాస్టర్ కిక్‌బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ల్లో స్వర్ణ పతకాలు సాధించింది. అంతేకాదు... ఇతర రాష్ట్రాల్లో జరిగి న ఓపెన్ చాంపియన్‌షిప్‌లో కూడా అద్భుత విజయాలు నమోదు చేసింది. ప్రస్తుతం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే జాతీయ కిక్‌బాక్సింగ్ పోటీలకు సన్నద్ధమవుతోంది.
అవమానాలు దాటి...
ఫాతిమా నా బిడ్డ మాత్రమే కాదు... నా గౌరవం కూడా. ఆమె విజయాలు నాకు గర్వకారణం. తననే కాదు... మిగిలిన పిల్లల్ని కూడా ఉన్నంతలో చదివిస్తున్నా. వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహిస్తున్నా. అయితే నాలాంటివారి పట్ల ఈ సమాజం వివక్ష చూపుతుంది. ఏదో అపరాధం చేసినట్టు పరిగణిస్తుంది. కానీ మేమూ మనుషులమే. మాలోనూ ప్రేమ, వాత్సల్యం, సమాజం పట్ల బాధ్యత ఉన్నాయి. ఈ లోకం మమ్మల్ని చూసే దృష్టి మారాలి. ఆ దిశగా నావంతు ప్రయత్నం చేస్తున్నాను. నాలాంటివారికి స్ఫూర్తిగా నిలిచి, వారి అభ్యున్నతికి బాటలు వేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాను.’’
అమ్మే నా బలం...
‘‘ఇవాళ కిక్‌బాక్సర్‌గా ఇంతటి కీర్తి గడిస్తున్నానంటే అది మా అమ్మ గొప్పతనమే. తను నా కోసం ఎన్నో త్యాగం చేసింది. అవమానాలు భరించింది. కష్టాలు అనుభవించింది. చిన్నప్పుడే నాలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించింది. ఆఖరికి నా కలను తన లక్ష్యంగా మలుచుకుని ఇన్నేళ్లుగా అవసరమైనవన్నీ సమకూర్చింది. ఇప్పుడు నా విజయాన్ని తనదిగా ఆస్వాదిస్తోంది. నా బలం మా అమ్మే. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి అమ్మ గర్వపడేలా చేయడమే నా లక్ష్యం.’’ అంటుంది ఫాతిమా.
Updated Date - Sep 09 , 2024 | 05:07 AM