Express Entry System: కెనడా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టమ్‌కు కీలక మార్పు.. భారతీయులపై ప్రతికూల ప్రభావం!
ABN, Publish Date - Dec 26 , 2024 | 07:32 AM
కెనడాకు వెళ్లాలనుకుంటున్న భారతీయ ప్రొఫెషనల్స్‌కు పరిస్థితి మరింత జటిలం కానుంది. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టమ్‌లో కీలక మార్పు చేసేందుకు కెనడా ప్రభుత్వం సిద్ధమైంది. కెనడాకు వలసొచ్చేందుకు ప్రయత్నించే విదేశీయుల అర్హతకు సంబంధించి కంప్రెహెన్సివ్ ర్యాకింగ్ సిస్టమ్‌లో కెనడా ఈ మార్పు తీసుకురానుంది.
ఇంటర్నెట్ డెస్క్: కెనడాకు వెళ్లాలనుకుంటున్న భారతీయ ప్రొఫెషనల్స్‌కు పరిస్థితి మరింత జటిలం కానుంది. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ సిస్టమ్‌లో కీలకమార్పు చేసేందుకు కెనడా ప్రభుత్వం సిద్ధమైంది. కెనడాకు వలసొచ్చేందుకు ప్రయత్నించే విదేశీయుల అర్హతకు సంబంధించి కంప్రెహెన్సివ్ ర్యాకింగ్ సిస్టమ్‌లో కెనడా ఈ మార్పు తీసుకురానుంది. దీని ప్రకారం, జాబ్ ఆఫర్ ఉన్న వారికి వలసొచ్చేందుకు అర్హత పెంచే అదనపు పాయింట్లను తొలగించేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని సమాచారం (Canada).
భారతీయ విద్యార్థులపై కెనడా కన్నెర్ర
వలస వ్యవస్థలో అక్రమాలకు తెరదించేందుకు తాత్కాలికంగా ఈ నిబంధనను అమల్లోకి తీసుకురానున్నట్టు కెనడా ప్రభుత్వం చెబుతోంది. శాశ్వత నివాసార్హతకు దరఖాస్తు చేసుకునే వారి అర్హత పాయింట్లను పెంచే లేబర్ మార్కెట్ అసెస్‌మెంట్‌ల అక్రమ కొనుగోళ్లకు ఇది అడ్డుకట్ట వేస్తుందని కెనడా ప్రభుత్వం చెబుతోంది. ‘‘కెనడా అభివృద్ధిలో వలస విధానానిది కీలక పాత్ర. అత్యధిక నైపుణ్యాలున్న వారిని కెనడాలోకి ఆహ్వానించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. కెనడాలోని వారందరికీ నాణ్యమైన ఉద్యోగాలు, నివాస వసతి అందుబాటులో ఉంచాలనేదే మా లక్ష్యం’’ అని కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ పేర్కొన్నారు.
ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ద్వారా శాశ్వత నివాసార్హతకు దరఖాస్తు చేసుకునే వారిపై తాజా మార్పులు ప్రభావం చూపిస్తాయని పరిశీలకులు అంటున్నారు. అయితే, శాశ్వత నివాసార్హతకు (పీఆర్) దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటికే ఆహ్వానాలు అందిన వారికి తాజా మార్పు వర్తించదు. అంతేకాకుండా, ప్రస్తుతం పీఆర్ దరఖాస్తు పరిశీనలలో ఉన్న వారిపై కూడా తాజా మార్పు ప్రభావం ఉండదు.
కెనడాలో ముగ్గురు విద్యార్థుల హత్యపై భారత్ ఆందోళన
ఏమిటీ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ
నిపుణులై విదేశీయుల వలసల కోసం ఉద్దేశించిన ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్, ఫెడరల్ స్కిల్డ్ ట్రేడ్స్ ప్రోగ్రామ్, కెనేడియన్ ఎక్స్ పీరియన్స్ క్లాస్, ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ వంటి పథకాలను ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా వివిధ పథకాల ద్వారా శాశ్వత నివాసార్హతకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ ప్రొఫైల్ తయారు చేయాల్సి ఉంటుంది. దీంతో, వారు అభ్యర్థుల జాబితా (పూల్)లోకి చేరినట్టు పరగణిస్తారు. వారి అర్హతలను బట్టి పాయింట్లు కేటాయిస్తారు. కెనడాలో జాబ్ ఆఫర్ ఉన్న వారికి అదనపు పాయింట్లు ఉంటాయి. ఈ క్రమంలో అత్యధిక పాయింట్లు ఉన్న వారిని కెనడా నివాసార్హతకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తును పరిశీలించి తుది నిర్ణయం ప్రకటిస్తుంది.
మరోవైపు కెనడా ప్రభుత్వం ప్లాగ్ పోలింగ్ విధానానికి కూడా స్వస్తి పలికింది. ఇకపై విదేశీయులు వలసల శాఖ ద్వారానే తమ వర్క్, స్టడీ వీసా పర్మిట్లను పునరుద్ధరించుకోవాలని స్పష్టం చేసింది. ఫ్లాగ్ విధానంలో గతంలో అభ్యర్థులు ఎయిర్ పోర్టుల్లోనే రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకునేవారు.
Updated Date - Dec 26 , 2024 | 07:41 AM