NRI: లండన్‌లో చెత్త ట్రక్కు ఢీకొని భారతీయ విద్యార్థిని దుర్మరణం!
ABN, Publish Date - Mar 25 , 2024 | 08:57 PM
బ్రిటన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లండన్‌లో చైస్తా కొచ్చర్ అనే విద్యార్థినిని చెత్త ట్రక్కు ఢీకొట్టడంతో ఆమె అక్కడిక్కడే దుర్మరణం చెందారు.
ఎన్నారై డెస్క్: బ్రిటన్‌లో (UK) తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. లండన్‌లో (London) చైస్తా కొచ్చర్ అనే విద్యార్థినిని చెత్త ట్రక్కు ఢీకొట్టడంతో ఆమె అక్కడిక్కడే దుర్మరణం చెందారు. భర్త కళ్లముందే ఆమె కన్నుమూశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో ఆమె పీహెచ్‌డీ చేస్తున్నారు. గత వారం భార్యాభర్తలు ఇద్దరు సైక్లింగ్ చేస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ముందు భర్త వెళుతుండగా వెనక మరో సైకిల్‌పై వెళుతున్న ఆమెను ట్రక్కు ఢీకొట్టింది (Indian student dies after being hit by Truck).
నీతీ ఆయోగ్‌లో పనిచేసిన చైస్తా కొచ్చర్ మృతిపై సంస్థ మాజీ సీఈఓ అమితాబ్ కంత్ విచారం వ్యక్తం చేశారు. ఆమె ధైర్యవంతురాలే కాకుండా ఎంతో ప్రతిభావంతురాలని కూడా కితాబునిచ్చారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, మార్చి 19న రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్ పోలీసులకు సహకరిస్తున్నాడని, కావాల్సిన సమచారం ఇస్తున్నాడని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని తెలుస్తోంది. మరోవైపు, ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వారెవరైనా ఉంటే ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
గురుగ్రామ్‌కు చెందిన చైస్తా నీతీ ఆయోగ్‌కు చెందిన లైఫ్ ప్రోగ్రామ్‌లో పనిచేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో బిహేవియరల్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసేందుకు గతేడాదే ఆమె బ్రిటన్‌కు వెళ్లారు. కాగా, కొచ్చర్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఆమె కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Updated Date - Mar 25 , 2024 | 09:03 PM