NRI News: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా “సురభి ఏక్ ఎహసాస్”
ABN, Publish Date - Aug 15 , 2024 | 08:59 PM
మనం సాధారణంగా ఒక రేడియో సంస్థ తమ కార్యక్రమాల పాపులారిటీని బట్టి ఆ కార్యక్రమం గురించి వేడుకలు చేయగా చూస్తుంటాం. కానీ ఒక రేడియో వ్యాఖ్యాత, తాను నిర్వహిస్తున్న రేడియో ప్రోగ్రాం గురించిన ముఖ్య ఉద్దేశ్యాన్ని ఒక వేడుకగా చేయగా విన్నారా...
ఇంటర్నెట్ డెస్క్: మనం సాధారణంగా ఒక రేడియో సంస్థ తమ కార్యక్రమాల పాపులారిటీని బట్టి ఆ కార్యక్రమం గురించి వేడుకలు చేయగా చూస్తుంటాం. కానీ ఒక రేడియో వ్యాఖ్యాత, తాను నిర్వహిస్తున్న రేడియో ప్రోగ్రాం గురించిన ముఖ్య ఉద్దేశ్యాన్ని ఒక వేడుకగా చేయగా విన్నారా ?? చూసారా ??. ఒక చక్కటి దేశ భక్తీ భావనని జాగృతం చేసే టోరి రేడియో ‘జై హింద్’ కార్యక్రమ వ్యాఖ్యాత RJ జయ అలాంటి వేడుకను గత ఏనిమిదేళ్లుగా నిర్వహిస్తున్నారు.
వార్షికంగా జరిగే “సురభి ఏక్ ఎహసాస్” కార్యక్రమ ముఖ్య ఉద్ద్యేశం ‘జై హింద్‘ లో పాల్గొన్న మన దేశ రక్షక భటులు - నిజమైన హీరోలను సత్కరించడం, అమర వీరులను స్మరిస్తూ నివాళులర్పించడం, సమైక్య, సమగ్ర భావనతో ప్రవాస భారతీయులందరినీ ఒక తాటిపైకి తేవడం. ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో నిర్వహించే “సురభి ఏక్ ఎహసాస్” కార్యక్రమం, ఈ సంవత్సరం ఆగస్టు 10న తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సమాజంలోని నిజమైన హీరోలను అంటే మన దేశ సైనికుల శౌర్య చర్యలను కొనియాడి అభినందించడం, సమాజానికి “సురభి ఏక్ ఎహసాస్” అంటే ‘‘అందమైన ఒక అనుభవం’’ అందించడం లక్ష్యంగా నిర్వహించబడింది. దేశ భక్తీ పాటలు, నృత్యాల ద్వారా మాతృభూమి పట్ల వారికున్న అభిమానాన్ని జాగృతం చెయ్యడమే ఈ కార్యక్రమ ఉద్దేశం.
ఈ కార్యక్రమాన్ని ప్రముఖ గ్లోబల్ వెబ్ రేడియో ప్రెజెంటర్ RJ జయ, తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ (Tori Radio) ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశభక్తి పాటలతో, నృత్యాలతో అందరినీ అలరించారు. పిల్లలంతా మన జాతీయ గేయం, జాతీయ గీతాన్ని చక్కగా పాడి అందరి మన్ననలు పొందారు. అలాగే సీనియర్ సిటిజన్స్ గ్రూప్ “జాలి గుడ్ మైత్రివన్” సభ్యులు నయా దౌర్ చిత్రంలోని “యే దేశ్ హేయ్ వీర్ జవానో కా” పాట పాడి ప్రేక్షకులలో ఉత్సాహాన్ని తెచ్చారు. RJ జయకు అభినందనలు తెలుపుతూ విశ్రాంత కార్గిల్ వీరుడు సుబేదార్ యోగేంద్ర సింగ్ యాదవ్, పివిసి విశ్రాంత మేజర్ డిపి సింగ్, విశ్రాంత వింగ్ కమాన్దర్ అఫ్రాజ్, యువ రచయిత దీపక్ సురానా పంపిన వీడియో సందేశాలు ప్రదర్శించారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సౌరభ్ రాఠీ వ్యవహరించారు.
తొలిసారి, “సురభి ఏక్ ఎహసాస్” లో సంస్కృతిక ప్రదర్శనలు మాత్రమే కాకుండా, జాతీయ భాష హిందీలో కవిత రచనల పోటీలు నిర్వహించి విజేతలకు హిమాంశు గుప్తా, కౌంసిల్ మెడల్, ప్రశంసా పత్రాలను అందజేశారు. అలాగే పాల్గొన్నవారందరికి సోహన్ గోయెంక బహుమతులు అందజేశారు.
సాంస్కృతిక ప్రదర్శనలిచ్చిన సభ్యుల స్పందనలు ఇలా వున్నాయి..
‘‘జయ జీ, గత నెల ప్రయాణంలో ఉంటూ కూడా ఇంత మనోహరమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేయడంలో మా మాటలు విఫలమవుతున్నాయి. మరోసారి ధన్యవాదాలు. మీరు సమాజం, దేశం కోసం చేస్తున్న ప్రతిదానికీ దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు’’.
‘‘జయ జీ.. ఇది నా మొదటి సురభి అనుభవం, నేను ఈ రోజుకీ నిన్నటి ప్రకంపనలను అనుభవిస్తున్నాను. మా పిల్లలకు దేశభక్తిని అనుభవించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఒక గొప్ప కమ్యూనిటీ అనుభవం. అలాగే పెద్దలందరికీ పాఠశాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి తెచ్చింది! మీ ప్రయత్నాలకు అభినందనలు’’.
భారతీయ సంఘాల నుంచి అనేక ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హాంగ్ కాంగ్‌లో నివసిస్తున్న భారతీయులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజయ్యారు. సమాజంలోని సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక అతిథులు ఈ కార్యక్రమం పట్ల ప్రవాసుల ఉత్సాహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు వారు ఆనందం వ్యక్తం చేసి, భవిష్యత్తులో తమ మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి భారత కాన్సులేట్ జనరల్, హాంకాంగ్, మకావు కౌంసిల్ హిమాంశు గుప్తా, ఫోరమ్ ఆఫ్ ఇండియన్ ప్రొఫెషనల్స్ అధ్యక్షుడు గౌతమ్ బోర్డోలోయి, ఇండియా అసోసియేషన్ హాంకాంగ్ సభ్యుడు నోతన్ తొలాని, చైనా, హాంకాంగ్ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అధ్యక్షుడు సోహన్ గోయెంకతో పాటూ దేశం కోసం మూడు యుద్ధాల్లో ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన కాప్టైన్ రామచందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Updated Date - Aug 15 , 2024 | 08:59 PM