భద్రాద్రి: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దక్షిణ అయోధ్య భద్రాచలం భక్తులతో సందడిగా మారింది. సీతారాముల కల్యాణం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. పండితులు వేద మంత్రోచ్ఛరణలు ఆలపిస్తున్న వేళ రఘునందనుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. పట్టాభిషేకం మహోత్సవం సందర్బంగా ఉదయం నుంచే భద్రాచలం ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కల్యాణమూర్తులు మిథిలా ప్రాంగణానికి చేరుకోగానే శ్రీరామనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. గోదావరి నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలను భక్తులపై చల్లి అర్చకులు ఆశీస్సులు అందించారు. ప్రభుత్వం తరఫున గవర్నర్ రాధాకృష్ణన్..స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.