Balineni Srinivas: బాలినేని జనసేనలోకి జంప్ అవుతారా..?
ABN, Publish Date - Jun 07 , 2024 | 05:15 PM
బాలినేని శ్రీనివాస్ (Balineni Srinivasa Reddy).. వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పేస్తారా..? ఇక పార్టీలో ఉండకూడదని ఫిక్స్ అయ్యారా..? వైఎస్ జగన్‌తో (YS Jagan) ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమేనని.. కుమారుడితో కలిసి జనసేనలోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారా..? మూడో కంటికి తెలియకుండా లోలోపలే చర్చలు కూడా జరుగుతున్నాయా..? అంటే..
బాలినేని శ్రీనివాస్ (Balineni Srinivasa Reddy).. వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పేస్తారా..? ఇక పార్టీలో ఉండకూడదని ఫిక్స్ అయ్యారా..? వైఎస్ జగన్‌తో (YS Jagan) ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమేనని.. కుమారుడితో కలిసి జనసేనలోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారా..? మూడో కంటికి తెలియకుండా లోలోపలే చర్చలు కూడా జరుగుతున్నాయా..? అంటే తాజా పరిణామాలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లను బట్టి చూస్తే నిజమనిపిస్తోంది. ఇందులో నిజానిజాలెంత..? బాలినేని నిజంగానే వైసీపీని వీడే ప్రయత్నం చేస్తున్నారా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంకెందుకు ఆలస్యం.. ఇక పొలిటికల్ స్టోరీ చదివేయండి..!
ఇదీ అసలు సంగతి..?
బాలినేని.. వైఎస్ జగన్ దగ్గరి బంధువన్న విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో.. ఇప్పుడు వైసీపీలో ఈయన కీలకనేతగానే ఉంటున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పేరెత్తితే మొదట గుర్తొచ్చే పేరు కూడా బాలినేనిదే. అలా నాడు.. నేడు ఓ వెలుగు వెలిగిన ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. జనసేన తీర్థం పుచ్చుకోబోతోతున్నారన్నదే ఆ వార్త సారాంశం. ఈ వార్తలు ఎవరో వైరల్ చేస్తే తప్పు అని అనుకోవచ్చు కానీ.. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు.. కొందరు బాలినేని అభిమానులు, అనుచరులు సైతం ట్విట్టర్ వేదికగా చెప్పుకుంటున్న పరిస్థితి. పైగా.. ఆయన చేసిన ఒక ట్వీట్ మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఎన్నికల్లో వైసీపీ, ఇటు ఒంగోలు నుంచి బాలినేని ఓడిపోవడంతో ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే ఇలా వార్తలు గుప్పుమనడంతో అసలేం జరుగుతోందో క్యాడర్‌కు అర్థం కాని పరిస్థితి.
ఏం జరిగింది..?
వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న బాలినేనికి.. మార్పులు, చేర్పులు జరిగాక రెండోసారి పదవి దక్కలేదు. నాటి నుంచి కాస్త అసంతృప్తిగానే ఉన్న ఆయన.. వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అడుగడుగునా అడ్డుపడుతూ వస్తున్నారని నాడు పెద్ద రచ్చే జరిగింది. ఇద్దరినీ పిలిపించి మరీ వైఎస్ జగన్ క్లాస్ తీసుకున్నా.. ఏ మాత్రం రాకపోగా అది కాస్త మరింత పెరిగి వైసీపీని వీడి టీడీపీలో చేరతారని నాడు పెద్ద చర్చే జరిగింది. దీనికి తోడు జిల్లా ఎస్పీ విషయంలో రాద్ధాంతం, పైగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్దని మాగుంట శ్రీనివాసరెడ్డికే టికెట్ ఇవ్వాలని నేరుగా జగన్‌కే తేల్చి చెప్పేయగా.. ఏ మాత్రం పట్టించుకోని వైసీపీ అధినేత ఆఖరికి చెవిరెడ్డి వైపే మొగ్గు చూపించారు. ఇలా ఈ ఒక్క సీటే కాదు.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం కొన్నింటిలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పినప్పటికీ జగన్ అస్సలు ఒప్పుకోలేదు. ఈ ఎన్నికల్లో బాలినేనితో పాటు చెవిరెడ్డి, జిల్లా మొత్తమ్మీద కేవలం రెండు సీట్లకే పరిమితం అయ్యింది వైసీపీ.
నొచ్చుకున్నారా..?
ఈ ఫలితాలను చూసిన బాలినేని.. తాను చెప్పినట్లుగా అభ్యర్థులను మార్చి ఉంటే జిల్లాలో ఫలితాలు మరోలా ఉండేవని అనుచరులతో చెప్పుకుని బాధపడ్డారట. ఇక ఏపీలో అక్కడక్కడా జరుగుతున్న గొడవలపై బాలినేని ట్విట్టర్ వేదికగా స్పందించిన తీరుతో అసలు సిసలైన అనుమానం జనాల్లో మొదలైంది. ‘అఖండ విజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. హింసాత్మాక ఘటనలకు తావులేదని నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హార్షణీయం. శాసనసభ్యునిగా నా 25ఏళ్ల రాజీకియ జీవితంలో ఎటువంటి హింసాత్మాక ఘటనలకు తావులేదు. అయితే మీ వ్యాఖ్యలకు పూర్తి భిన్నముగా ఒంగోలు చరిత్రలో ఎన్నడూలేని విధంగా చోటు చేసుకుంటున్న హింసాత్మాక ఘటనలు, అక్రమ కేసులు , భౌతిక దాడులు, మా అనుచరులపై వేధింపులపై మీరు స్పందించాలని కోరుకుంటున్నాను.. ధన్యవాదాలు’ అంటూ బాలినేని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు ఉండగా.. పవన్ పేరే ప్రస్తావించే ఎందుకు ట్వీట్ చేశారన్నది ఇప్పుడు వైసీపీ, జనసేన అభిమానుల ప్రశ్న.
మంచి పరిచయాలే..!
వాస్తవానికి.. పవన్-బాలినేని మధ్య కొత్త పరిచయమేమీ అక్కర్లేదు. ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఇక సినీ ఇండస్ట్రీ పరంగా కూడా బాలినేనికి చాలా మంది నిర్మాతలతో వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఆ మధ్య పవన్ కల్యాణ్ సినిమాకు కోట్లలో డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారనే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో జనసేనలోకి వెళితే తన వారసుడు ప్రణీత్ రెడ్డికి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందని.. తనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలతో మళ్లీ మునుపటి రోజులు తెచ్చుకోవచ్చని బాలినేని భావిస్తున్నారట. అందుకే వైసీపీని వీడి.. పవన్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని చర్చలు జరుగుతున్నాయి. అబ్బే.. బాలినేని వైసీపీని వీడటమా..? సమస్యే లేదని కొందరు వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి. 24 గంటలుగా ఈ వార్తలు అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో వస్తున్నప్పటికీ ఇంతవరకూ బాలినేని గానీ.. ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా స్పందించలేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా రియాక్ట్ కాకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. వైసీపీ కార్యకర్తలే బాలినేని జంప్ అంటూ హడావుడి చేయడంతో అసలేం జరుగుతోందో తెలియక ఒంగోలు వైసీపీ క్యాడర్ అయోమయంలో పడింది. ఇందులో నిజానిజాలెంత..? నిజంగానే జంప్ అవుతారా..? అనేది తెలియాలంటే రియాక్షన్ వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.
ఇవి కూడా చదవండి..
కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ.. చంద్రబాబు ఏయే శాఖలు అడగొచ్చు..!?
నాడు నో అపాయిట్మెంట్.. నేడు మోదీ పక్కనే చంద్రబాబు!
అనుకున్నట్లే.. వైసీపీ జెండాను ‘పీకే’శారుగా..!!
Updated Date - Jun 07 , 2024 | 05:25 PM