PeddiReddy: 15 ఏళ్లుగా శాసిస్తున్న పెద్దిరెడ్డి కోటకు బీటలు..!
ABN, Publish Date - Jun 11 , 2024 | 01:37 PM
పుంగనూరు రాజకీయాలను 15 ఏళ్లుగా శాసిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఏకచత్రాధిపత్యానికి కళ్లెం పడింది. గతంలో కనుచూపు మేరలో కనిపించని టీడీపీ..
పుంగనూరు రాజకీయాలను 15 ఏళ్లుగా శాసిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) ఏకచత్రాధిపత్యానికి కళ్లెం పడింది. గతంలో కనుచూపు మేరలో కనిపించని టీడీపీ ఈసారి గెలుపు వాకిలి వరకు వెళ్లగలిగింది. వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి (Peddireddy Mithun Reddy) కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టిన ప్రతిపక్ష నాయకులను కేసులతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులకు గురిచేస్తూ భయపెట్టేలా చేశారు. అన్నిశాఖల్లో అనుకూలమైన అధికారులను నియమించుకుని పోలీసు రాజ్యం సాగించారు. వారి తీరుతో విసిగిపోయిన పుంగనూరు ప్రజలు అవకాశం కోసం వేచి ఉండి ఎన్నికల్లో దాదాపు ఓడించినంత పనిచేశారు. తక్కువ మెజారిటీతో పెద్దిరెడ్డి బయటపడాల్సి వచ్చింది.
43వేల నుంచి 6వేలకు..!
పుంగనూరు నియోజకవర్గంలో 1,17,072 పురుష, 1,21,791 మహిళ, ట్రాన్స్‌జెండర్లు ఐదుగురితో కలిపి మొత్తం 2,38,868 ఓట్లున్నాయి. ఈ ఎన్నికల్లో 2,06,916 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో పీలేరు నుంచి పుంగనూరుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్దిరెడ్డి టీడీపీ అభ్యర్థి ఎం.వెంకటరమణరాజుపై 40,299 ఆధిక్యతతో గెలిచారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వెంకటరమణరాజుపై 31,731 ఓట్ల ఆధిక్యతతో రెండోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎన్.అనీషారెడ్డిపై 43,343 మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డిపై 6,095 ఓట్లతో గట్టెక్కారు.
పోరాడి ఓడిన చల్లా..
పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ పాలనలో ప్రతిపక్షాలపై రాజకీయపరంగా దాదాపు వెయ్యిమందిపై పోలీసులు కేసులు పెట్టారు. పలువురిపై రౌడీషీట్లు తెరిచారు. దీనిపై టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. పార్టీ శ్రేణులకు అండగా నిలవడమేగాక జైలుకు సైతం వెళ్లి వచ్చారు. తద్వారా ఓటర్లలో ఆయనపై నమ్మకం పెరిగింది. ఎన్నికల ఫలితాల్లో తొలి రెండు రౌండ్లు మెజారిటీ సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో గెలుపుపై ఆశలు చిగురించాయి. తర్వాత రౌండ్లలో వైసీపీకి ఆధిక్యత వచ్చింది. 7 రౌండ్లలో టీడీపీ, 12రౌండ్లలో వైసీపీ ఆధిక్యత సాధించాయి. పుంగనూరు టౌన్‌లో 3,236 ఓట్లు, రూరల్‌లో 715 ఓట్లు, పెద్దిరెడ్డి సొంత మండలం సదుంలో 4,218 ఓట్లు, పులిచెర్ల మండలంలో 448 ఓట్లు వైసీపీ అదనంగా సాధించగలిగింది. చౌడేపల్లె మండలంలో 983, సోమల మండలంలో 460, చల్లా బాబు సొంత మండలం రొంపిచెర్లలో 555 ఓట్లు టీడీపీ ఆధిక్యత సాధించింది. 2,763 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీకి 1543, వైసీపీకి 1019, నోటాకు 20 ఓట్లు పడ్డాయి. బీసీవై పార్టీ అభ్యర్థి బోడే రామచంద్రయాదవ్‌కు 4,559 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మురళీమోహన్ యాదవ్‌కు 3,546 ఓట్లు దక్కాయి. చివరికి చల్లా బాబుకు 94,698 ఓట్లు, పెద్దిరెడ్డికి 1,00,793 ఓట్లు రాగా వైసీపీ 6,095 ఓట్లతో విజయం సాధించింది.
Updated Date - Jun 11 , 2024 | 01:37 PM