Viral: భారతీయుల్ని ఫాలో అవుతున్న బ్రిటన్ కంపెనీ.. ఆనంద్ మహీంద్రా ఫుల్ ఖుష్!
ABN, Publish Date - Apr 29 , 2024 | 05:06 PM
ముంబై డబ్బావాలాల స్ఫూర్తితో లండన్‌లో స్టార్టప్ డెలివరీ సంస్థ ఏర్పాటైన విషయాన్ని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నెట్టింట పంచుకున్నారు. ఇక్కడి సంస్కృతి అక్కడికి చేరడం రివర్స్ వలసవాదానికి సంకేతమేమో అని సరదా వ్యాఖ్య చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారతీయతను, స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించడంలో ముందుండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మరో ఆసక్తికర అంశాన్ని నెట్టింట పంచుకున్నారు. భారతీయుల అలవాట్లే స్ఫూర్తిగా బ్రిటన్‌లో ఓ కంపెనీని నెలకొల్పిన విషయాన్ని ఆయన తాజాగా షేర్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (viral) మారింది.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ముంబై డబ్బావాలా (Mumbai Dabbawala) స్ఫూర్తితో ఇటీవల లండన్‌లో ఫుడ్ డెలివరీ స్టార్టప్ ప్రారంభమైన విషయాన్ని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. ముంబైలో డబ్బావాలాలు స్టీలు బాక్సుల్లో భోజనం, టిఫిన్ తదితరాలను ఇళ్ల నుంచి ఆఫీసులకు సరఫరా చేస్తారన్న విషయం తెలిసిందే. సమయపాలనకు, నిబద్ధతకు ప్రతీకగా నిలిచే ముంబై డబ్బావాలాలు బిజినెస్ మోడల్ ఎందరికో ఆదర్శం. ఇదే స్ఫూర్తితో డబ్బా డ్రాప్ (DubbaDrop) అనే కంపెనీని లండన్‌లో నెలకొల్పారు.
Uber: రోడ్డు ప్రమాదం.. ఊబర్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించిన వైద్యురాలు!
డబ్బాడ్రాప్ కూడా స్టీల్ బాక్సుల్లోనే ఫుడ్ డెలివరీ చేస్తారు. ప్యాకేజీంగ్ అంతా ముంబై డబ్బావాలా మోడల్ లోనే ఉంటుంది. రకరకాల భారతీయ వంటకాలను డబ్బాడ్రాప్ సంస్థ డెలివరీ చేస్తుంది. ప్లాస్టిక్ వినియోగానికి చెక్ పెడుతూ డబ్బావాలాల స్ఫూర్తితో సుస్థిర వ్యాపార పద్ధతిని అవలంబిస్తున్న ఈ కంపెనీ చూస్తుండగానే నెట్టింట వైరల్ అయ్యి ఆనంద్ మహీంద్రా దృష్టిలోకి వచ్చింది. ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన ఇది రివర్స్ కలోనైజేషన్ (వలసవాదం)కు సూచనా? అని వ్యాఖ్యానించారు.
ఈ పోస్టుకు సహజంగానే నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. భారత సంస్కృతి సంప్రదాయాలు ఎన్నో ఏళ్లుగా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొందరు కామెంట్ చేశారు. పాశ్చాత్యులు భారతీయ సంస్కృతులకు పట్టం కడుతుంటే ఇక్కడ వారు పాశ్చాత్యపోకడలకు బానిసలవుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడం పర్యావరణ పరిరక్షణకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
Updated Date - Apr 29 , 2024 | 08:48 PM