Special Story : నో ప్లాన్.. నో జాబ్.. రూ. కోటి జాబ్ వదిలేశాడు..
ABN, Publish Date - Dec 21 , 2024 | 03:17 PM
ఆదాయం వచ్చే మరో దారి లేని స్థితిలో.. పదేళ్లుగా చేస్తున్న ఉద్యోగం వదిలేసుకునే సాహసం చెయ్యగలరా? అదీ ఏడాదికి రూ.కోటి జీతం వచ్చే జాబ్. ఆలోచించడానికే వింతగా అనిపిస్తోంది కదూ.. బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల టెకీ ఈ పనే చేశాడు.. ఎఁదుకోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ఆదాయం వచ్చే మరో దారి లేని స్థితిలో.. పదేళ్లుగా చేస్తున్న ఉద్యోగం వదిలేసుకునే సాహసం చెయ్యగలరా? అదీ ఏడాదికి రూ.కోటి జీతం వచ్చే జాబ్. ఆలోచించడానికే వింతగా అనిపిస్తోంది కదూ.. బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల టెకీ ఈ పనే చేశాడు. చేతిలో మరో జాబ్ ఆఫర్ లేకపోయినా, ఏ కారణంతో జాబ్ వదిలేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
బెంగళూరుకు చెందిన వరుణ్ హసీజా 20 ఏళ్ల వయసులోనే కెరీర్ మొదలుపెట్టాడు. 2 నెలల ముందు వరకూ బెంగళూరులోని ఒక ఎమ్మెన్సీలో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేసేవాడు. చేతినిండా డబ్బు. విలాసవంతమైన జీవితం. ప్రేమించే కుటుంబం అన్నీ ఉన్నా ఉద్యోగ జీవితంలో విపరీతమైన ఒత్తిడి. టార్గెట్ల వెంట పరుగులు పెట్టలేక నిత్యం మానసిక ఆందోళనలతో సతమయ్యేవాడు. అవసరానికి మించి సంపాదన వస్తున్నా జీవితంలో సంతృప్తి కరవైంది. దీంతో ప్రశాంతత కోసం కెరీర్ నుంచి బ్రేక్ తీసుకోవాలనే అనూహ్య నిర్ణయానికొచ్చాడు వరుణ్.
విలాసవంతమైన జీవితం కంటే సంతోషకరమైన జీవితమే ముఖ్యమని భావించాడు వరుణ్. తాను చేసే ఉద్యోగం వల్ల మానసికంగా, శారీరకంగా ఎంత నరకం అనుభవిస్తున్నదీ భార్య మోక్షదా మన్‌చందాకు వివరించాడు. పరిస్థితి అర్థం చేసుకున్న ఆమె "నీ సంతోషం, ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యం కాదని" భర్త నిర్ణయాన్ని సంతోషంగా అంగీకరించింది. ముంబయిలోని ఓ కళాశాలలో ఆంగ్ల ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది మోక్షదా.
జాబ్ మానేశాక కుటుంబ అవసరాలు ఎలా నిర్వహించుకోవాలనే దానిపై ఒక ఎక్సెల్ షీట్ తయారుచేశాడు వరుణ్. ఇంటి అద్దె, నెలవారీ ఖర్చులు, సేవింగ్స్, బీమా, ప్రయాణాలు.. ఇలా ప్రతి ఒక్కటీ వివరంగా రాసుకున్నాడు. అత్యవసర ఖర్చులను మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ ప్రిపేర్ చేసుకున్నాడు. ఫ్యాన్సీ ట్రిప్‌లు, వృథా ఖర్చులు తగ్గించుకోవడంతో ఒక్కరి జీతంతోనైనా ఏడాదిపాటు ఏ చింతా లేకుండా గడపవచ్చని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. హౌస్ లోన్ లేకపోవడంతో ఇదంతా సాధ్యమైంది.
బ్యాకప్ ప్లాన్.. జాబ్ ఆఫర్ లేకున్నా.. ప్రశాంతత కోసం కెరీర్ బ్రేక్ తీసుకోవాలనే కష్టతరమైన నిర్ణయం తీసుకోవటం.. ఏడాది కోసం తాను ప్రిపేర్ చేసిన ఎక్సెల్ షీట్ గురించి వరుణ్ 'ఎక్స్' లో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. చేతిలో జాబ్ ఆఫర్ లేకపోయినా డేరింగ్ నిర్ణయం తీసుకున్న వరుణ్ ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు. లే ఆఫ్స్, పింక్ స్లిప్‌ల వల్ల హఠాత్తుగా జాబ్ కోల్పోయేవారిలో ధైర్యం నింపేలా మీ పోస్ట్ ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
జీవితంలో సంపద, సంతోషం రెండూ అవసరమేనని అంటాడు వరుణ్ హసీజా. వచ్చే ఏడాది నచ్చిన రంగంలో స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని థ్రెడ్‌లో చెప్పుకొచ్చాడు.
Updated Date - Dec 21 , 2024 | 04:23 PM