Viral: ప్రియురాలి ఎఫైర్‌తో మనోవేదన! బాధితుడికి రూ.35 లక్షల పరిహారం!
ABN, Publish Date - Dec 20 , 2024 | 09:50 PM
చైనాలో ఓ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ప్రియురాలి ఎఫైర్‌తో మానసిక వేదన అనుభవించిన ఓ వ్యక్తికి పరిహారం కింద ఏకంగా రూ.35 లక్షలు దక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: సమాజంలో మగాళ్లకు న్యాయం జరగట్లేదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్న నడుమ చైనాలో ఓ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ప్రియురాలి ఎఫైర్‌తో మానసిక వేదన అనుభవించిన ఓ వ్యక్తికి పరిహారం కింద ఏకంగా రూ.35 లక్షలు దక్కింది. కోర్టు బాధితుడి తరఫున తీర్పు వెలువరించడంతో అతడి మాజీ ప్రియురాలికి భారీ షాక్ తగిలింది. టీవీ సీరియల్‌ను మించిన ట్విస్టులున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా పెను సంచలనానికి దారి తీసింది (Viral).
Viral: ద్రవ్యోల్బణం పీక్స్‌కెళ్లడం అంటే ఇదీ! కప్పు కాఫీ ధర ఎంతో తెలిస్తే..
షాంఘాయ్ కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం, లీ అనే యువకుడికి, జూ అనే యువతికి 2018లో పరిచయమైంది. అది ప్రేమగా మారడంతో వారు కలిసి జీవించేందుకు నిర్ణయించారు. ఆ తరువాత రెండేళ్ల పాటు వారి బంధం సాఫీగానే సాగింది. కానీ లీ బంధువు ఎంట్రీతో అతడి జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. జూకు లీ బంధువుతో సాన్నిహిత్యం పెరిగి చివరకు ఎఫైర్‌కు దారి తీసింది. లీకి తెలీకుండా జూ కొంత కాలం పాటు ఈ వ్యవహారం నడిపినా చివరకు ఓ రోజు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ప్రియురాలి మోసానికి మానసికంగా కుంగిపోయిన అతడు వెంటనే ఆమెకు బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోయాడు.
కానీ జూ మాత్రం లీ కాళ్లావేళ్లా పడింది. తన తప్పు ఆ ఒక్కసారికి క్షమించమని కోరింది. తన నిజాయతీని రుజువు చేసుకునేందుకు ఆమె అతడికి అప్పటికప్పుడు 3 లక్షల యువాన్ల నగదును బహుమతిగా బదిలీ చేసింది. ఇకపై జీవితాంతం అతడి పట్ల నిబద్ధతతో ఉంటూ ప్రతి క్షణం తన నిజాయతీని నిరూపించుకుంటానంటూ చెప్పుకొచ్చింది. ఆమె క్షమాపణలకు కరిగిపోయిన లీ మళ్లీ జూకు దగ్గరయ్యాడు. కానీ జూ తీరు మాత్రం మారకపోవడంతో మరో సారి ఆమె రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దీంతో, మండిపడ్డ లీ ఆమెకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పేశాడు.
Viral: ఆడ సింహానికి సవాలు విసిరిన బాడీ బిల్డర్! చివరకు ఏమైందో చూస్తే..
ఆ తరువాత ఇద్దరి మధ్య నగదు బహుమతి విషయంలో పేచీ మొదలైంది. తమ బంధాన్ని పెళ్లితో శాశ్వతం చేసుకునేందుకే తాను 3 లక్షలు చెల్లించానని ఆమె వాదించింది. ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది కాబట్టి డబ్బును తిరిగిచ్చేయాలని డిమాండ్ చేసింది. లీ మాత్రం ఇందుకు ససేమిరా అన్నాడు. జూ పలుమార్లు చేసిన మోసాలతో తనకు తీవ్ర మానసిక వేదన మిగిలిందని అన్నాడు. ఇందుకు పరిహారంగా ఆ డబ్బును తన వద్దే పెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఈ వివాదం తెగకపోవడంతో చివరకు పంచాయతీ కోర్టుకు చేరింది.
కాగా, కోర్టు లీకి మద్దతుగా నిలిచింది. తమ బంధాన్ని పునరుద్ధరించుకునేందుకు లీ తనంతట తానుగా ఆ డబ్బును ఇచ్చిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇది పెళ్లితో ముడిపడిన బహుమతి కాదని తేల్చి చెప్పారు. కాబట్టి, లీ డబ్బును తిరిగివ్వాల్సిన అవసరం లేదంటూ తీర్పు వెలువరించారు. దీనిపై ప్రస్తుతం చైనాలో పెద్ద చర్చే జరుగుతోంది.
Viral: వామ్మో.. మిల్క్ ప్యాకెట్స్‌పై ఎక్స్‌పైరీ డేట్ వెనక ఇంత స్టోరీ ఉందా!
Updated Date - Dec 20 , 2024 | 09:54 PM