Viral: ఇలాంటి షాకులిస్తే చాలు.. ఇంకెప్పుడూ పబ్లిక్ ప్లేసుల్లో రీల్స్ చేయరు!
ABN , Publish Date - Apr 27 , 2024 | 04:28 PM
షార్ట్ వీడియోల కోసం వీధుల్లో బైక్‌పై స్టంట్స్ చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి ఇన్‌స్టా అకౌంట్ బ్లాక్ చేసే చర్యలకు ఉపక్రమించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో జనాలు.. వీధులు, మెట్రో స్టేషన్లు, రైళ్లు, బస్సులు ఇలా ఎక్కడ పడితే అక్కడ రీల్స్, షార్ట్ వీడియోల పేరిట (Short Videos) రెచ్చిపోతున్నారు. రకరకాల డ్యాన్స్‌లు చేస్తూ పక్క వాళ్లకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇలాగే షార్ట్ వీడియో కోసం రెచ్చిపోయిన ఓ యువకుడికి ఢిల్లీ పోలీసులు గట్టి షాకిచ్చారు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
Viral: బాయ్‌ఫ్రెండ్ బలవంతం చేస్తే లాటరీ టిక్కెట్ కొన్న మహిళ! చివరకు..
ఢిల్లీలోని షాహ్‌దరా ప్రాంతంలోని న్యూ ఉస్మాన్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల విపిన్ ఇటీవల వీధుల్లో బైక్‌పై స్టంట్లు చేస్తూ ఇన్‌స్టా రీల్ వీడియో రికార్డు చేశాడు. ఈ క్రమంలో అతడు వాహనాల రాకపోకలకు అడ్డంకులు సృష్టించాడు. ఆ తరువాత అతడి రీల్ నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు అతడిపై దృష్టి పెట్టారు. నిందితుడిపై ఐపీసీ, మోటార్ వెహికిల్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత అతడి ఇంటికి వెళ్లి మరీ అరెస్టు చేశారు. విపిన్ మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్‌ను సీజ్ చేయడంతో పాటు అతడి ఇన్‌స్టా అకౌంట్‌ను బ్లాక్ చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు. వీధుల్లో నిర్లక్ష్యంగా స్టంట్లు చేస్తూ ప్రమాదాలకు కారణం కావద్దని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు (Delhi man caught for obstructing traffic defying rules to make videos).
ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో పెద్ద స్పందన వచ్చింది. అనేక మంది పోలీసుల చర్యలను ప్రశంసించారు. యువత షార్ట్ వీడియోల పిచ్చిలో పడి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారంటూ అనేక మంది కామెంట్ చేశారు. ఇలాంటి రెండు మూడు షాకులు ఇస్తే జనాలు పబ్లిక్ ప్లేసుల్లో రీల్స్ వంటివి ట్రై చేసేందుకు జంకుతారని కొందరు పేర్కొన్నారు.