AI Technology: మృతదేహం కళ్లు తెరిపించిన ఏఐ.. చివరకు నేరస్థులు ఎలా దొరికిపోయారంటే..
ABN, Publish Date - Jan 25 , 2024 | 07:37 PM
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పెద్ద పెద్ద సమస్యలను సైతం ఈజీగా పరిష్కరించే వెసులుబాటు వచ్చింది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని కొందరు మంచి మంచి పనులు చేస్తుంటే.. మరికొందరు...
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పెద్ద పెద్ద సమస్యలను సైతం ఈజీగా పరిష్కరించే వెసులుబాటు వచ్చింది. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని కొందరు మంచి మంచి పనులు చేస్తుంటే.. మరికొందరు దీన్ని దుర్వినియోగం చేసి కటకటాలపాలవడం చూస్తున్నాం. మరోవైపు వివిధ కేసుల పరిష్కారంలో పోలీసులకూ ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. ఇటీవల టెక్నాలజీ రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన ఏఐ.. పలు రంగాల వారికి ఏంతో ఉపకరిస్తోంది. తాజాగా, ఢిల్లీ పోలీసులు ఈ ఏఐ టెక్నాలజీ సాయంతో ఓ కేసు ఈజీగా పరిష్కరించారు. మృతదేహం కళ్లు తెరచినట్లు చేసి.. చివరకు నేరస్థులను ఈజీగా పట్టుకోగలిగారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తర ఢిల్లీలో (North Delhi) ఈ ఘటన చోటు చేసుకుంది. జనవరి 10న స్థానిక గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద ఓ యువకుడి మృతదేహం (young man dead body) పడి ఉంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరో అతన్ని గొంతు నులిమి చంపినట్లు గుర్తించారు. అయితే నేరస్థులను పట్టుకోవడం మాత్రం వారికి సాధ్యం కాలేదు. దీంతో చివరకు పోలీసులు ఏఐ టెక్నాలజీని (AI technology) ఆశ్రయించారు. దాని సాయంతో ముందుగా మృతదేహం కళ్లు తెరచినట్లుగా చేశారు. తర్వాత ఆ వ్యక్తి సదరు ప్రాంతంలో నిలబడి ఫొటో తీసుకున్నట్లుగా క్రియేట్ చేశారు.
తర్వాత ఆ ఫొటోలను ఫ్రింట్ చేయించి, నగరంలోని వివిధ ప్రాంతాల్లో అంటించారు. అలాగే అన్ని పోలీస్ స్టేషన్లతో పాటూ వాట్సప్ గ్రూపుల్లోనూ ఆ ఫొటోను షేర్ చేశారు. దీంతో చివరకు యువకుడి కుటుంబ సభ్యులు గుర్తు పట్టి పోలీసులను సంప్రదించారు. చనిపోయిన వ్యక్తి హితేంద్రాగా తెలిసింది. తర్వాత దర్యాప్తు ప్రారంభించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు యువకులతో కలిసి హితేంద్ర హత్య జరిగిన ప్రాంతానికి వచ్చాడని, అక్కడ వారి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో మిగతా ఇద్దరు యువకులు అతన్ని గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని పక్కన పడేసి వెళ్లినట్లు విచారణలో తెలిసింది. ఈ కేసులో నిందితులకు ఓ మహిళ కూడా సహకరించినట్లు గుర్తించారు. దీంతో సదరు మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - Jan 25 , 2024 | 07:42 PM