Viral: ఏనుగుల మధ్య ఇలాంటి రిలేషన్ ఉంటుందా? చాలా మందికి తెలియని విషయం ఇది!
ABN, Publish Date - Apr 26 , 2024 | 04:05 PM
రెండు ఏనుగుల మధ్య 55 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని గురించి వివరిస్తూ ఐఏఎస్ అధికారి సుప్రీయా సాహు షేర్ చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: స్నేహం అనేది కేవలం మనుషులకు మాత్రమే పరిమితమైన భావన అని అనుకుంటాం కానీ ఈ బంధం బుద్ధికలిగిన అనేక జంతువుల్లో ఉంటుంది. అయితే, రెండు ఏనుగుల మధ్య 55 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహాన్ని గురించి వివరిస్తూ ఐఏఎస్ అధికారి సుప్రీయా సాహు షేర్ చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారాయి.
తమిళనాడులోని (TamilNadu) ముదుమలైలోని తెప్పకాడు ఏనుగుల క్యాంపులోని భామ (75), కామాట్చి (65) ఏనుగుల గురించి సుప్రియా సాహు నెట్టింట పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘ చాలా మందికి తెలీని విషయం ఏంటంటే.. మనుషుల్లాగే జంతువుల మధ్య కూడా గాఢ స్నేహ బంధం ఉంటుంది. ఇందుకు భామ, కామాట్చిలే మంచి ఉదాహరణ. ఇవి రెండు తెప్పకాడు ఏనుగుల క్యాంపులో ఉంటున్నాయి. గత 55 ఏళ్లుగా ఇవి ప్రాణస్నేహితులుగా ఉన్నాయి. ఇవి చాలా ధైర్యం గల జంతువులు. ఒకసారి భామ మావటిపై చిరుత దాడి చేసింది. ఆ సమయంలో భామ దాన్ని ధైర్యంగా ఎదుర్కొని తరిమికొట్టింది. మరో సందర్భంగా ఓ మగ ఏనుగు కామాట్చిపై దాడి చేసింది. ఆ సమయంలో తీవ్రగాయాల పాలైనా కామాట్చి మాత్రం ధైర్యం కోల్పోలేదు. నాటి గాయాలను నుంచి కోలుకునేందుకు కామాట్చికి కొన్నేళ్లు పట్టింది. ఆహారం తినే సమయంలో కూడా ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి. వీటికి చెరకు అంటే బోలెడంత ఇష్టం. అందుకే ఒకదానికి చెరకు ఇస్తే రెండో ఏనుగుకు ఇవ్వాల్సిందే’’ అని ఆమె చెప్పుకొచ్చారు (55 year Friendship between Animals).
ఏనుగుల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న క్యాంపు నిర్వాహకులను కూడా సుప్రియా సాహు ధన్యవాదాలు తెలిపారు. క్యాంపులో రెండు గున్న ఏనుగులు సహా 27 ఏనుగులు ఉన్నట్టు తెలిపారు. ఆసియాలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న క్యాంపుల్లో ఇదీ ఒకటని చెప్పారు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భామ, కామాట్చి మధ్య స్నేహం అనేక మందిని ఆకట్టుకుంది. గజరాజులను జాగ్రత్తగా చూసుకుంటున్న అటవీ శాఖ సిబ్బంది పైనా జనాలు ప్రశంసల వర్షం కురిపించారు.
Updated Date - Apr 26 , 2024 | 04:14 PM