Viral: పోలీసులు యువకుడికి అర్ధరాత్రి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చారో చూస్తే..
ABN, Publish Date - May 10 , 2024 | 05:09 PM
యువకుడి పుట్టిన రోజన అర్ధరాత్రి బోస్టన్ పోలీసులు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. యువకుడి ఇంటికి కేక్ తీసుకెళ్లి అతడితో కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: మనిషి జీవితంలో పుట్టినరోజులకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వేడుకలను అయినవాళ్ల మధ్య జరుపుకోవాలని అంతా కోరుకుంటారు. పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చేందుకూ వెనకాడరు. ఆ ఏడు సాధించిన విజయాలు, ఎదుర్కొన్న వైఫల్యాలు, నేర్చుకున్న పాఠాల గురించి కొందరు నెమరేసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రోజున ఒంటరిగా గడపటమంటే నిజంగా విషాదకరమే. అందుకే ఓ అమెరికా (USA) యువకుడు ఏకంగా పోలీసులకే ఫోన్ చేసి వారికి తన మనసులో మాట చెప్పుకున్నాడు. ఆ తరువాత వారిచ్చిన సర్‌ప్రైజ్‌కు అతడు ఉబ్బితబ్బిబ్బైపోయాడు.
బోస్టన్‌కు చెందిన క్రిస్ (25) అనే యువకుడు ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ రోజు తన పుట్టిన రోజు అని, తనకెవరైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారా అని అడిగాడు. ఆ తరువాత మరో మాట మాట్లాడకుండా పోన్ పెట్టేశాడు. అతడి అభ్యర్థన విన్న పోలీసులూ తొలుత ఆశ్చర్యపోయారు. ఎందుకైనా మంచిదని అతడి వివరాలు చెక్ చేస్తే ఆ రోజు నిజంగానే అతడి బర్త్‌డే అని తేలింది (Police surprise man with sweet treat after 911 call for birthday wishes).
Viral: విమానంలో రెచ్చిపోయిన మహిళ.. సీటులో కాళ్లు జాపుకునేందుకు చోటు లేదని..
దీంతో, పోలీసులు అతడు ఒంటరిగా ఫీలవకూడదని భావించి మరో అరగంటకు అతడి ఇంటికి వచ్చారు. డోర్ బెల్లు చప్పుడవడంతో తలుపు తీసిన క్రిస్.. ఎదురుగా ఉన్న పోలీసులను చూసి ఒక్కసారిగా షాకైపోయాడు. పోలీసులు అతడికి అంతకుమించిన సర్‌ప్రైజ్ ఇస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు. తమ వెంట తెచ్చిన చిన్న కేక్‌ను అతడితో కట్ చేయించి పుట్టిన రోజు వేడుక జరిపారు. ఇదంతా వారి షర్ట్‌కు తగిలించి ఉన్న కెమెరాలో రికార్డైంది. ఆ తరువాత ఈ వీడియో నెట్టింట కాలు పెట్టడంతో జనాల నుంచి భారీ స్పందన వచ్చింది.
ఎంత బిజీలో ఉన్నా పోలీసులు యువకుడి కోసం తీరిక చేసుకుని వచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం జనాలకు యమాగా నచ్చింది. దీంతో, వారు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కూడా స్పందించారు. ‘‘ప్రతి ఒక్కరికి పుట్టిన రోజు ఉంటుంది. ఆ రోజు ప్రత్యేకంగా ఉండాలని కోరుకోవడం సహజం. అందుకే మేము అలా చేశాము’’ అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నెటిజన్లను బాగా ఆకట్టుకున్న ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
Updated Date - May 10 , 2024 | 05:22 PM