Viral: స్పోర్ట్స్ షూ వేసుకుని ఆఫీసుకు వచ్చినందుకు ఊస్టింగ్.. బాధితురాలికి రూ.32 లక్షల పరిహారం!
ABN , Publish Date - Dec 29 , 2024 | 12:27 PM
ఆఫీసుకు స్పోర్ట్స్ షూస్ వేసుకుని వచ్చినందుకు తనను సంస్థ అన్యాయంగా తొలగించిందంటూ కోర్టుకెక్కిన ఓ యువతి చివరకు యాజమాన్యం నుంచి రూ.32 లక్షల బారీ పరిహారం దక్కించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆమె ఓ యువ ఉద్యోగి. రెండేళ్ల క్రితం ఓ ఉద్యోగంలో చేరింది. అప్పటికి ఆమె వయసు 18 ఏళ్లే. సంస్థపై పూర్తి అవగాహన లేదు. అలాంటి యువతితో ఓ మేనేజర్ దురుసుగా ప్రవర్తించాడు. ఆఫీసుకు స్పోర్ట్స్ షూ వేసుకుని వచ్చినందుకు నలుగురిలో నిలబెట్టి కడిగేశాడు. చివరకు ఉద్యోగం నుంచి తీసేశాడు. అయితే, తనకు అన్యాయం జరిగిందని భావించిన యువతి వెంటనే ఉద్యోగ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా సంస్థకు బుద్ధొచ్చేలా గట్టి గుణపాఠం నేర్పింది. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది (Viral). పూర్తి వివరాల్లోకి వెళితే..
ఎలిజబెత్ బెనాజీ అనే యువతి 2022లో మాక్సిమస్ యూకే సర్వీసెస్ అనే రిక్రూటింగ్ ఏజెన్సీలో చేరింది. అప్పటికి ఆమెకు 18 ఏళ్లు. చేరిన మూడు నెలల తరువాత ఓ రోజు ఆమె ఆఫీసుకు స్పోర్ట్స్ షూస్ వేసుకుని వచ్చింది. దీంతో, ఆమె మేనేజర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సంస్థ డ్రెస్ కోడ్‌కు విరుద్ధంగా దుస్తులు వేసుకొచ్చినందుకు ఆమెను చివరకు విధుల నుంచి తొలగించారు. దీంతో, తిక్కరేగిన యువతి దక్షిణ లండన్‌లోని ఉద్యోగ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.
Viral: కెనడాలో చెల్లాచెదురుగా చెత్త బ్యాగులు.. భారతీయులను బాధ్యుల్ని చేస్తూ పరోక్ష విమర్శలు
ఉద్యోగ సమయంలో తనను చిన్న పిల్లలా చూశారని, ప్రతి చిన్న విషయంలోనూ తన నిఘా పెడుతూ మైక్రోమేనేజ్ చేశారని బాధితురాలు ఆరోపించింది. తన వయసు కారణంగా వివక్ష ఎదుర్కొన్నట్టు వాపోయింది. అసలు సంస్థలో డ్రెస్ కోడ్ ఉన్న విషయంపై తనకు ఎటువంటి సమాచారం లేదని కూడా చెప్పింది. తన సహోద్యోగుల్లో కొందరు దాదాపు ఇలాంటి బూట్లే వేసుకున్నా వారిని పన్నెత్తు మాట అనలేదని పేర్కొంది. తనను మాత్రమే దోషిగా చేసి తొలగించారని పేర్కొంది.
Viral: లిప్‌స్టిక్ పెట్టుకునేందుకు రూ.27 లక్షల బ్యాగు కొనుగోలు
ఆమె వాదనతో న్యాయమూర్తి అంగీకరించారు. ఆమె సంస్థకు కొత్త అన్న విషయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా సంస్థ దురుసుగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఆమెకు డ్రెస్ కోడ్ గురించి తెలిసుండకపోవచ్చన్న ఆలోచన కూడా మేనేజర్ కనబరచలేదని పేర్కొన్నారు. సంస్థ తీరు అన్యాయమని, కావాలని రంధ్రాన్వేషణ చేస్తున్నట్టు ఉందని చెప్పుకొచ్చారు. ఇక యువతికి డ్రెస్ కోడ్ గురించి ముందే సమాచారం ఇచ్చామన్న సంస్థ వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది. అదే నిజమైతే, బాధిత ఉద్యోగినితో ఈమెయిల్ ద్వారా జరిపిన సంప్రదింపుల్లో డ్రెస్ కోడ్ ప్రస్తావన ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది. బాధితురాలితో అన్యాయంగా వ్యవహరించినందుకు ఆమెకు రూ.32 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.